వెయ్యి కోట్లకు బాండ్ల జారీ
- రాజధానిలోని మూడు జోన్ల లేఅవుట్లలో వసతులకు రూ.2,981 కోట్లు
- సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం
సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకోసం తొలివిడతగా రూ.వెయ్యికోట్ల మేర బాండ్లను జారీ చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అథారిటీ నిర్ణయించింది. రాజధానికోసం భూములిచ్చిన రైతులకు సంబంధించి.. తొలిదశలో మూడు జోన్లలోని 8 గ్రామాలకు చెందిన భూసమీకరణ స్థలాల లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన డిజైన్లకు ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.2,981 కోట్లు ఖర్చవుతుందని అంచనా. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఆమోదించిన అంశాలివీ..
► మూడు జోన్లకుగాను భూసమీకరణ లేఅవుట్లలో వసతుల కల్పనకు కన్సల్టెంట్లు జీఐఐసీ–ఆర్వీ అసోసియేట్స్ ఇచ్చిన డిజైన్లకు ఆమోదం. 29 రాజధాని గ్రామాల్ని 13 జోన్లుగా విభజించి వసతుల కల్పనకు ప్రణాళిక రూపొందించిన కన్సల్టెన్సీ సంస్థలు.
► 3జోన్లలోని 5.5 లక్షల నివాసాలు, 1.2 లక్షల వాణిజ్య అవసరాలకోసం ప్రతిరోజూ 107 ఎంఎల్‌డీ నీటి సరఫరాకు ప్రణాళిక.
► 250 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అవసరమైన కేబుళ్లను భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు చిన్న విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణా నికి అనుమతి. వరదనీటి పారుదలకోసం 278 కి.మి మేర కాలువల నిర్మాణం.
► భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అభివృద్ధి చేసి అందించే ప్రతి ప్లాటుకు ప్రభుత్వమే స్టాంపు డ్యూటీ, రిజి స్ట్రేషన్ ఖర్చు భరించాలని నిర్ణయం.
► స్విస్ చాలెంజ్ విధానంలో అమరావతి పరిధిలోని 6.84 చ కిలోమీటర్ల విస్తీర్ణంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఆమోదం.
► అమరావతిలో ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న ప్రైవేటు వర్సిటీల్లో కొన్నింటిని విశాఖ, తిరుపతిలో పెట్టేలా ప్రోత్సహించాలని నిర్ణయం.
► ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో తాత్కాలిక సచివాలయాన్ని ట్రాన్సిట్ సచివాలయంగా పిలవాలని నిర్ణయం.
► సచివాలయంలో సీఎం కార్యాలయం ఉన్న ఒకటో బ్లాకులో మరో అంతస్తు నిర్మాణానికి అనుమతి. అందులో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు.
ఆ ‘మెట్రో’లు మంజూరు కాలేదు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను ఇంకా మంజూరు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టుల స్థితిగతులపై ఎంపీలు కొత్తపల్లి గీత, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎస్ రాజేంద్రన్, హరి మాంజీలు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్‌జిత్ సింగ్ బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విజయవాడ మెట్రోకు భూసేకరణ ఖర్చుతో పాటు మొత్తం రూ. 6,823 కోట్లు అంచనా వ్యయం అవుతుందని వివరించారు. ఇక విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 9,736 కోట్ల అంచనా వ్యయం అవుతుందన్నారు.