ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ప్రధాన గేటుకి అంటించిన నోటీసు
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్ట లోపల అనుమతి లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలకు సీఆర్‌డీఏ సమాయత్తమైంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణా నది నుంచి వంద మీటర్లలోపు నిర్మించిన భవనాలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. సుమారు 50 నిర్మాణాల్ని గుర్తించిన సీఆర్‌డీఏ అధికారులు వాటిలో 35 వరకూ అనుమతుల్లేకుండా నిర్మించినవేనని ఇప్పటివరకు నిర్ధారించారు. 28 నిర్మాణాలకు నోటీసులివ్వాలని నిర్ణయించిన అధికారులు శుక్రవారం పది భవనాలకు నోటీసులు పంపించారు. మిగిలిన వాటికి శనివారం నోటీసులు పంపనున్నారు. శుక్రవారం నోటీసులు పంపిన భవనాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథిగృహం కూడా ఉంది. ఎటువంటి అనుమతుల్లేకుండా కృష్ణా నది నుంచి వంద మీటర్ల లోపు జీ+1 భవనాన్ని రమేష్ నిర్మించినట్లు గుర్తించిన సీఆర్‌డీఏ నోటీసులిచ్చేందుకు ఆయనకు రెండుసార్లు ఫోన్ చేయగా స్పందించలేదని తెలిసింది. దీంతో విజయవాడలోని లింగమనేని ఎస్టేట్స్ కార్యాలయానికి వెళ్లి నోటీసులిచ్చేందుకు ప్రయత్నించినా అక్కడెవరూ తీసుకునేందుకు సిద్ధపడకపోవడంతో ఉండవల్లిలోని అక్రమ నిర్మాణం వద్దకే వెళ్లి అక్కడి గోడకు నోటీసు అంటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్‌డీఏ ఆ నోటీసులో పేర్కొంది.
అన్ని చట్టాలు ఉల్లంఘించి..
తమ అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్ రూల్స్ 2012, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి కేపిటల్ సిటీ జోనింగ్ రెగ్యులేషన్‌కు–2016కి విరుద్ధంగా లింగమనేని నిర్మాణాలున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. నేల మీద, మొదటి అంతస్తులో ఆర్‌సీసీ నివాస భవనం, నేల అంతస్తులో ఆర్‌సీసీ గది, హెలీప్యాడ్ నిర్మాణాల్ని కృష్ణా నది నుంచి వంద మీటర్లలోపు నిర్మించారని, ఇవికాక అనుమతి లేకుండా పది తాత్కాలిక షెడ్లను నిర్మించారని అధికారులు తెలిపారు. వారంలోపు నోటీసుపై స్పందించి సంజాయిషీ ఇవ్వనిపక్షంలో తగిన చర్య తీసుకుంటామని, ఒకవేళ సంజాయిషీ సరిగా లేకపోయినా చర్య తప్పదని నోటీసులో స్పష్టం చేశారు. లింగమనేని రమేష్ భవనంతోపాటు పది భవనాలకు సీఆర్‌డీఏ సెక్షన్ 115(3) ప్రకారం శుక్రవారం నోటీసులిచ్చిన సీఆర్‌డీఏ అధికారులు సంజాయిషీ ఇవ్వకున్నా, ఇచ్చిన సంజాయిషీ సరిగా లేకున్నా సెక్షన్ 115(2) మేరకు తొలగింపు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
అనుమతుల్లేని భవన యజమానుల జాబితా
చందన కేదారేశ్వరరావు ఏ అనుమతుల్లేకుండానే జీ+2 అతిథిగృహం, బీజేపీకి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రెండు అతిథిగృహాలు నిర్మించినట్లు గుర్తించారు. లోటస్ హోటల్, ఫిషర్‌మెన్ అసోసియేషన్, గణపతి సచ్చిదానంద ఆశ్రమం, శ్రీ రెడ్డి, ఇస్కాన్ టెంపుల్, సాగర్ మినరల్ వాటర్ ప్లాంట్, సుంకర శివరామకృష్ణ, సత్యానంద ఆశ్రమం, అక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పాతూరి సుధారాణి, తులసి గార్డెన్స్, వేదాద్రి మహర్షి తపోవనం, డాక్టర్ మాగంటి ప్రసాద్, లక్ష్మీనారాయణ, నకంటి వెంకట్రావు, సీహెచ్ వేణుగోపాలరావు, చిగురు అనాథ బాలల ఆశ్రమం, సిటీ కేబుల్ మధుసూదనరావు, ఎం.సత్యనారాయణ, మత్స్యకారుల అసోసియేషన్, శివక్షేత్రంలో అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. మందడం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల పరిధిలో మరికొన్ని ఇళ్లు కూడా అనధికారికంగా నిర్మించినట్లు గుర్తించారు. వీటిలో కొన్నింటికి పంచాయతీ అనుమతులు, ఇతర అనుమతులున్నా స్థూలంగా నదీ పరిరక్షణ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలకు వ్యతిరేకంగానే ఉన్నాయని నిర్ధారించారు. వీటిలో కొన్నింటికి ఇప్పటికే నోటీసులిచ్చిన సీఆర్‌డీఏ అధికారులు సోమవారంలోపు మిగిలిన వాటికి ఇవ్వనున్నారు.
చంద్రబాబు నివాసం వద్ద హైడ్రామా
తాడేపల్లి రూరల్: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడమైన లింగమనేని రమేష్ అతిథిగృహానికి నోటీసులు జారీ చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు శుక్రవారం అక్కడకు చేరుకున్న సందర్భంగా వారిని తొలుత లోపలికి అనుమతించలేదు. దీంతో దాదాపు గంటన్నరపాటు హైడ్రామా నెలకొంది. సదరు ఇంటి యజమాని అయిన లింగమనేని రమేష్‌కు నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఆర్‌డీఏ డిప్యూటీ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి లోపలకు వెళ్లాలని అడగ్గా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో సీఆర్‌డీఏ అధికారులు చాలాసేపు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. నోటీసులివ్వడానికి వచ్చిన సీఆర్‌డీఏ అధికారులను లోపలకి అనుమతించట్లేదంటూ మీడియాలో ప్రచారం జరగడంతో.. వెనక్కి తగ్గిన సిబ్బంది ఎట్టకేలకు సీఆర్‌డీఏ డిప్యూటీ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డిని, ఆయన వాహనాన్ని, మరో సీఆర్‌డీఏ అధికారిని లోపలికి అనుమతించారు. మొదట బిబి2 గేటు వద్ద నోటీసు అంటించిన నరేంద్రనా«థ్‌రెడ్డి ఉన్నతాధికారులతో ఫోనులో మాట్లాడారు. చంద్రబాబు నివాసం ఉండే ప్రధాన గేటుకు అంటించమని సూచించడంతో మరికొంతసేపు హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు నరేంద్రనాథ్‌రెడ్డి ప్రధాన గేటు వద్ద కూడా నోటీసు అంటించి తన వాహనంలో విజయవాడకు తిరిగి వెళ్లిపోయారు.
క్షుణ్ణంగా పరిశీలించి.. న్యాయ సలహా తీసుకున్నాకే నోటీసులు
నోటీసులివ్వడానికి ముందు ఆయా భవనాల పరిస్థితిని సీఆర్‌డీఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రదేశాల్లో ఏ భవనాలు, ఎన్ని అంతస్తులు, ఎన్ని షెడ్లు, ఇతర నిర్మాణాలున్నాయో పరిశీలించారు. వాటిలో కొన్నింటికి అనుమతులున్నట్లు చెబుతుండడంతో అవి ఎలాంటి అనుమతులో పరిశీలించారు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్నాక సీఆర్‌డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదించి పక్కాగా నోటీసులు రూపొందించారు. కొన్ని భవనాలకు పంచాయతీలు అనుమతులివ్వగా, కొన్నింటికి గతంలోని ఉడా పరిమితమైన అనుమతులిచ్చినట్లు, మరికొన్నింటికి నిరభ్యంతర పత్రాలున్నట్లు గుర్తించారు. అయితే ఏదో చిన్నవాటికి అనుమతులు తీసుకుని ఆ ముసుగులో భారీ కట్టడాలు నిర్మించినట్లు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment