Krishna karakatta
-
కృష్ణా జలాలకు ‘ఇదేం ఖర్మ బాబూ...’
జగన్ మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మరో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరు పెట్టారు. నిజానికి తెలుగు నిఘంటువులో ‘ఖర్మ’ అనే పదమే లేదు. తెలుగు భాష పట్ల అపారమైన గౌరవం ఉన్న ఎన్టీ రామారావు తన పార్టీకి తెలుగుదేశం అనే పేరు పెట్టారు. అటువంటి పార్టీకి నేడు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు అర్థం పర్థంలేని ఒక పదాన్ని సృష్టించి ఆ పేరుతో ప్రజలను పెడతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తరుణంలో రాష్ట్రాభివృద్ధికి అడు గడుగునా అడ్డు పడుతున్నారంటూ ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ బాబూ’ అంటూ ప్రత్యర్థులు ఆయన్ని విమర్శి స్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు విమర్శలను పట్టించుకోవడం కానీ, తన తప్పుల వల్ల ప్రజలకు, పర్యావరణానికి హాని జరుగుతున్నా పశ్చాత్తాప పడటం కానీ చేయరు. ఆయన చట్ట విరుద్ధ పనుల్లో... కృష్ణానదీ తీరాన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంలో ఇప్పటికీ నివసిస్తుండటం ఒకటి. ఈ ప్రాంతంలోని నివాస ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విడుదల అవుతున్న కాలుష్యం కారణంగా కృష్ణానది చివరి రిజర్వాయర్ అయిన ప్రకాశం బ్యారేజ్ వద్ద నిల్వ చేస్తున్న జలాలు పెద్ద ఎత్తున కలుషిత మవుతున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర పొల్యూషన్ బోర్డు ‘వాటర్ క్వాలిటీ ఆఫ్ రివర్స్ 2021’ పేరిట విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 2022, అక్టోబర్ 13న బోర్డు అప్డేట్ చేసిన వివరాల ప్రకారం... విజయవాడ కృష్ణా బరాజ్ వద్ద గల ఈ నీరు పానయోగ్యంగా ఏ మాత్రం లేదని స్పష్టమయింది. కృష్ణా కరకట్ట ప్రాంతంలో గుంటూరు జిల్లా పరిధిలో 48 భవనాలు, కృష్ణా జిల్లా పరిధిలో 18 భవనాలు ఉన్నాయి. వీటిలో చంద్రబాబు నివాసంతో పాటు వందలాది మంది రోగులకు నిలయమైన ప్రకృతి వైద్యశాల కూడా అక్కడే ఉంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలకు డ్రైనేజ్ సదుపాయం లేదు. వీరు వాడే నీరంతా కృష్ణా బరాజ్ వద్ద గల నీటిలోనే కలిసి పోతోంది. ఫలితంగా ఈ జలాలు కలుషితమవుతున్నాయి. కేంద్ర పొల్యూషన్ బోర్డు నివేదిక ప్రకారం నదీజలాల్లో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బి.ఒ.డి.) ఐదు రోజుల సగటు విశ్లేషణల్లో లీటర్‌కు రెండు మిల్లీ గ్రాముల కన్నా తక్కువ ఉండాలి. గుంటూరు జిల్లా అమరావతి వద్ద కృష్ణా జలాల్లో బి.ఒ.డి. 1.4 మిల్లీగ్రాములుండగా అదేనీటిలో కృష్ణా బరాజ్ వద్ద బి.ఒ.డి. 2.6 మిల్లీ గ్రాములకు పెరిగి పోయింది. అయితే ఈ నీటినే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లక్షలాది మంది ప్రజలు మంచి నీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కృష్ణా బరాజ్‌కు కుడివైపున నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంలో మాజీ ముఖ్యమంత్రి నివసించడం ‘రివర్ కన్సర్వెన్సీ యాక్ట్’ను ఉల్లంఘించడమే. ఈ యాక్ట్ ప్రకారం నదిని ఆనుకుని 500 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణాలను చేయకూడదు. కానీ మాజీ ముఖ్యమంత్రి నివసిస్తున్న భవనం నదికి వందమీటర్ల దూరంలోనే ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 1996 మార్చి ఎనిమిదో తేదీన విడుదల చేసిన జీఓ నం. 111 ప్రకారం... నదికి సమీపాన ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. ఎటువంటి వ్యర్థ పదార్థాలు నదిలో వదలకూడదు. భారత శిక్షాస్మృతి సెక్షన్ 277 ప్రకారం నీటి వనరులను కలుషితం చేసే వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు నివాస ప్రాంతంలో ఉన్న కట్టడాలన్నీ నదీ ‘పరిరక్షణ చట్టం–1884’ నిబంధనలకు విరుద్దంగా నిర్మించినవేనని స్వయానా అప్పటి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 2015 జనవరిలో చెప్పడమే కాక... వివిధ శాఖల నుంచి నోటీసులు కూడా ఇప్పించి వీటన్నిటినీకూల్చి వేస్తామని హడావిడి చేశారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసిస్తున్న లింగమనేని ఎస్టేట్ భవనం కూడా ఈ కూల్చివేత భవనాల జాబితాలో ఉంది. నదీ తీర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడం నిషిద్ధం. ఇదే విషయాన్ని అప్పటి ఆయన మంత్రి వర్గ సహచరుడే ప్రకటించినప్పటికీ చంద్రబాబు పెడచెవిన పెట్టారు. వందలాది కోట్ల రూపాయల వ్యయంతో కృష్ణా పుష్కరాలను నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నదికి పవిత్ర హారతులు కూడా ఇచ్చారు. ఒకవైపు పుణ్య స్నానాలు చేస్తూ, హారతులు ఇస్తూ... మరోవైపు ఆ నదినే వ్యర్థాలతో అపవిత్రం చేయడం అత్యంత శోచనీయం. చంద్రబాబు నాయుడు పంతాలకు, పట్టింపులకు పోకుండా ఆ ప్రాంతంలోని తన నివాసాన్ని వేరే చోటికి తరలించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అలాగే ఈ ప్రాంతంలోని మిగిలిన అక్రమ కట్టడాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం తొలగించాలి. కృష్ణా నది శుద్ధికి శ్రీకారం చుట్టాలి. (క్లిక్ చేయండి: విజ్ఞానమే పరిష్కారం! చిట్కాలు కావు!) - వి.వి.ఆర్. కృష్ణంరాజు ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
Andhra Pradesh: శాసన రాజధానికి రహదారి
సాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది కుడి కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. బ్యారేజీ వద్ద కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కరకట్ట రోడ్డును 15.52 కిలోమీటర్ల మేర రూ.150 కోట్ల ఖర్చుతో విస్తరించనున్నారు. కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకం వద్ద నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అనంతరం విస్తరణ పనులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పూర్తి నాణ్యతతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కరకట్ట పటిష్టం.. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలుగా ఈ రోడ్డును విస్తరిస్తున్నారు. రెండు లైన్లలో వాహనాలు వెళ్లేందుకు, మరో రెండు వరుసలు ఇరువైపులా నడకదారుల కోసం కేటాయించారు. ఈ రోడ్డులో కొండవీటి వాగు బ్రిడ్జిని పునఃనిర్మించనున్నారు. అమరావతి ఎన్–1, ఎన్–2, ఎన్–3 రహదారులతోపాటు సీడ్ యాక్సెస్ రోడ్డు, గొల్లపూడి – చినకాకాని –విజయవాడ బైపాస్ రోడ్లను కరకట్ట రోడ్డుకు అనుసంధానం చేస్తారు. దీనిద్వారా రాజధాని ప్రాంతానికి పూర్తిస్థాయి రహదారి సౌకర్యం కలుగుతుంది. సచివాలయం, పలు విద్యా సంస్థలతోపాటు ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, హరిశ్చంద్రపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. సచివాలయం, హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. రోడ్డు విస్తరణతో కరకట్ట పటిష్టంగా మారి తరచూ వరదల ముంపు బారిన పడే ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాలకు మేలు జరుగుతుంది. ఈ రోడ్డు వల్ల ప్రధానంగా విజయవాడ వైపు నుంచి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్లి వచ్చే అధికారులు, ఉద్యోగులు, ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీరతాయి. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, అనిల్‌కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, చెరకువాడ శ్రీరంగనాథరాజు, నారాయణస్వామి, సీహెచ్ వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలత, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మద్దాలి గిరి, అన్నాబత్తుల శివ, షేక్ ముస్తఫా, గుంటూరు మేయర్ మనోహర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. -
4 లేన్లుగా కరకట్ట రోడ్డు.. రూ.150 కోట్లతో విస్తరణ
సాక్షి, అమరావతి: అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో భాగమైన కరకట్ట రోడ్డు నాలుగు లేన్లుగా విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోని కీలక ప్రాజెక్టులపై సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.150 కోట్లతో కృష్ణా కరకట్ట రోడ్డు నాలుగు లేన్లుగా విస్తరణ ప్రతిపాదన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న రహదారులను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేసే పనులు కూడా పూర్తి చేయాలన్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. విశాఖ తీరంలో ప్రతిపాదిత ప్రాజెక్టుపై సీఎం సమీక్ష విశాఖపట్నంలోని సముద్ర తీరంలో 13.59 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇదే భూమిని గత ప్రభుత్వం లులూ గ్రూపునకు కారుచౌకగా 33 ఏళ్ల లీజుకు కట్టబెట్టింది. తాజాగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్బీసీసీ, ఏపీఐఐసీ సీఎంకు వివరాలు అందించాయి. కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి కనీసం సుమారు రూ.1,450 కోట్ల నికర ఆదాయం వస్తుందని ఎన్బీసీసీ వివరించింది. సీఎం సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఏఎంఆర్డీఏ కమిషనర్ పి.లక్ష్మీ నరసింహం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జల దిగ్బంధంలో లంక గ్రామాలు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదికి వరద పోటెత్తడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు లంక గ్రామాలు కకావికలమయ్యాయి. పొలాలతోపాటు, గ్రామాల్లోకీ వరద నీరు ప్రవేశించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో కృష్ణానది కరకట్టను అనుకొని ఉన్న తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటశాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో లంక గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. 70 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పులిగెడ్డ అక్విడెక్టుపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో ఉద్యాన, వ్యవసాయ పంటలకు, చేపల చెరువులకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి – విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద మద్దూరు గ్రామంలోకి నీరు రావటంతో పాటు, రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు పడవల్లో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. రేపల్లె మండలం పెనుమూడి, పల్లెపాలెం గ్రామాల్లో వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలోని సబ్‌స్టేషన్‌లోకి నీరు రావటంతో 8 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీట మునిగిన పంట పొలాలు.. అపార నష్టం తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో ఉద్యాన పంటలు 13,089 ఎకరాల్లో నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో 7097.5 ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి. గుంటూరు జిల్లాలో దాచేపల్లి, అచ్చంపేట, అమరావతి, తాడేపల్లి, కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో 12,262.5 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో 7097.5 ఎకరాల్లో వరి, 3,495 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 ఎకరాల్లో మల్బరి పంటలు నీట మునిగాయి. 165 గృహాలు వరద ప్రభావానికి దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో 41 పునరావాస కేంద్రాలకు 8,100 మందిని, గుంటూరు జిల్లాలో 14 మండలాల్లోని 53 గ్రామాల్లో 3,543 మందిని 15 పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారపరెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. అంత్యక్రియలకూ కష్టకాలం భట్టిప్రోలు(వేమూరు), కొల్లూరు : కృష్ణానదికి వరద రావడంతో మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లే మార్గం లేక గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో మృతి చెందిన నూతక్కి రామయ్య(75)కు కరకట్టపైనే దహన సంస్కారాలు చేశారు. కొల్లూరు మండలం గాజుల్లంకలో మృతి చెందిన మత్తి జనభాయమ్మకు అక్కడ అంత్యక్రియలు నిర్వహించే వీలులేక పడవలో కొల్లూరుకు తరలించారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో దహన సంస్కారాలకు వరద నీటిలో ఇబ్బందులు చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టిన వరద కృష్ణా నది గర్భాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను వరద ముంచెత్తుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న ఇంటిని వరద నీరు చుట్టుముట్టినా తన నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఆయన ఒప్పుకోవడం లేదు. హెలిప్యాడ్, గార్డెన్, చుట్టుపక్కలున్న తోటలన్నీ నీట మునిగినా ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది ఇల్లు ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి నోటీసు ఇవ్వడానికి వెళ్లిన వీఆర్వో ప్రసాద్‌ను సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించక పోవడంతో దానిని గోడకు అంటించారు. వరద ముప్పు కారణంగా ఇప్పటికే కరకట్టను ఆనుకొని ఉన్న 32 నివాసాలకు నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
సీఎం వైఎస్ జగన్ అమెరికా నుంచి సమీక్ష
సాక్షి, అమరావతి: కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస చర్యలు కొనసాగిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో విస్లృతంగా పర్యటిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, వైద్య సదుపాయాలు సక్రమంగా అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన పంటలకు పరిహారం ఇచ్చేందుకు వీలుగా పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికార బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మేమున్నామని భరోసా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు శనివారం విస్తృతంగా పర్యటిస్తూ బాధితులకు అండగా నిలిచారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్ విజయవాడ నుంచి అవనిగడ్డ వరకు కృష్ణా పరివాహక ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల్లో పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు. సహాయక, పునరావాస కార్యక్రమాలు అమలు తీరును సమీక్షించారు. మోకాళ్ల లోతు నీళ్లలో నడిచి మరీ ముంపు గ్రామాల్లోకి వెళ్లి బాధితులతో మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కొన్ని చోట్ల ట్రాక్టర్ నడుపుకుంటూ పర్యటించడం విశేషం. ముంపునకు గురైన వ్యవసాయ, ఉద్యాన పంట పొలాలను పరిశీలించారు. లంక గ్రామాలకు పడవలో వెళ్లారు. వరద బాధితులు చెప్పిన విషయాలను ఆసాంతం విని తదనుగుణంగా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో వసతులపై ఆరా విజయవాడలోని గీతానగర్, రామలింగేశ్వరనగర్, భూపేష్‌నగర్, ఆళ్ల చల్లారావు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరారు. వచ్చే ఏడాదిలోగా తప్పకుండా నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. కృష్ణా నది కరకట్ట మీదుగా తోట్లవల్లూరు, పమిడిముక్కల, అవనిగడ్డ, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు అందిస్తున్న భోజన సదుపాయాలు, ఇతర సహాయక చర్యలను పరిశీలించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి నాణ్యమైన భోజనం.. చిన్నారులకు పాలు, రొట్టెలు అందిస్తున్నామని అధికారులు మంత్రులకు తెలిపారు. శిబిరాల వద్ద ప్రత్యేకంగా మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. 24 గంటలూ బాధితులకు అందుబాటులో ఉండాలని కోరారు. విస్తృతంగా పర్యటించిన అధికార పార్టీ నేతలు వరద ప్రాంతాల్లోని ప్రజలతో మంత్రులు మాట్లాడి పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. ప్రజల ఇళ్లు, ఆస్తులకు కలిగే నష్టానికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రులతోపాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలా అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, మేరుగ నాగార్జున, నంబూరు శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిమాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ బొప్పన కుమార్ తదితరులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వేదాద్రి, ముక్త్యాల తదితర ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను సమీక్షించారు. ముంపునకు గురైన ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. పంటలకు పరిహారం అందిస్తాం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు, సూచనలతో వరద ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టామని మంత్రులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం అంతా వరద బాధితులకు అండగా సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యామన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే అధికార బృందాలను ఏర్పాటు చేశామని, వరదలు తగ్గుముఖం పట్టగానే నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పిస్తాయని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు తగిన పరిహారం అందిస్తామని మంత్రులు రైతులకు హామీ ఇచ్చారు. సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష వాషింగ్టన్ డీసీ : కృష్ణా నది వరదలపై అధికారులు పంపిన నివేదికలను అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఎగువ నుంచి వస్తున్న వరద, దిగువకు విడుదల చేస్తున్న జలాలపై ఆయన ఆరా తీశారు. వరదల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు సహాయం అందించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించొద్దని చెప్పారు. తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసికట్టుగా పని చేస్తున్నారని, బాధితులకు సహాయం చేస్తున్నారని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వరద సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని, ప్రస్తుతం వరద తగ్గు ముఖం పట్టిందని తెలిపారు. రంగంలోకి సహాయక బృందాలు కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో ముంపు బారిన పడిన నదీ తీర ప్రాంతాలు కడలిని తలపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అగ్నిమాపక శాఖ(ఫైర్), స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శనివారం ఉదయానికి కృష్ణా జిల్లాలోని 18 మండలాల్లో 34 గ్రామాలపై వరద ప్రభావం ఉందని గుర్తించారు. గుంటూరు జిల్లాలోని 14 మండలాల్లో 53 గ్రామాలు వరద బారిన పడ్డాయి. రెండు జిల్లాల్లోను మొత్తం 32 మండలాల్లో 87 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని అధికారులు నిర్ధారించారు. లైఫ్ జాకెట్లు, బోట్లతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రెండు జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో ఏపీ ఫైర్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన 140 మంది సిబ్బంది, 10 మండలాల్లో 18 బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. 180 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. విజయవాడలోని కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వరనగర్లతోపాటు తోట్లవల్లూరు, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కంచికచర్ల, కొల్లిపర, కొల్లూరు తదితర మండలాల్లో సహాయ బృందాల సేవలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, సీతానగరం తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఇల్లు వదిలేందుకు ససేమిరా రెండు జిల్లాల్లోనూ కృష్ణా నదీ తీరంలో వరదలో చిక్కుకున్న పలు ప్రాంతాల్లో ఇళ్లను విడిచి బయటకు వచ్చేందుకు పలువురు ప్రజలు ససేమిరా అంటున్నారు. ఇంటి ముందు మూడు నుంచి ఐదు అడుగుల మేర వరద నీరు చేరిన ప్రాంతాల్లో సైతం భవనాలపై అంతస్తులకు చేరుతున్న ప్రజలు తమ ఇంటిని వదిలి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. వరద ముప్పు మరింత పెరిగితే వారు ఇళ్లపై అంతస్తుల నుంచి కూడా బయటకు వచ్చేందుకు కష్టమవుతుందని గుర్తించిన ప్రభుత్వ యంత్రాంగం వారికి నచ్చజెపుతోంది. ఒకవైపు వర్షాలు పడుతున్నందున వరద తీవ్రత పెరిగితే ముంపు ముప్పులో చిక్కుకుంటారనే ముందు జాగ్రత్తతో వారికి నచ్చజెపుతున్నారు. మాట వినని వారిని బలవంతంగానైనా సహాయ బృందాల ద్వారా బోట్లపై బయటకు తీసుకొస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, నీరు అందించడంతోపాటు వ్యాధుల బారిన పడకుండా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. -
ముంచెత్తిన ‘కృష్ణమ్మ’
సాక్షి, అమరావతి బ్యూరో/విజయవాడ: కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో కరకట్ట వెంబడి నిర్మించిన అతిథి గృహాలు, ఇతర కట్టడాల్లోకి బుధవారం వరద నీరు ప్రవేశించింది. కరకట్ట లోపలి వైపున నదీ గర్భంలోకి చొచ్చుకెళ్లి గతంలో భారీ కట్టడాలను నిర్మించారు. వాటికి కొండరాళ్లతో పునాదులు వేసి.. నీటి ప్రవాహానికి అడ్డంగా గట్లు నిర్మించారు. నది పోటెత్తి ప్రవహిస్తుండటంతో చాలా కట్టడాల్లోకి వరద నీరు ప్రవేశించింది. వీటివల్ల నదీ ప్రవాహ దిశ మారుతోందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. కృష్ణా కరకట్ట దిగువన ఉన్న అక్రమ కట్టడాలలో చంద్రబాబు నివాసం కూడా ఉన్న సంగతి తెలిసిందే. నదీ గర్భంలో నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి నీరు చేరుతుండటంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని సామగ్రిని మరో అంతస్తులోకి చేర్చారు. నీటిమట్టం పెరుగుతుండటంతో చంద్రబాబు నివాసం వద్ద రక్షణ చర్యలు చేపట్టారు. వాకింగ్ ట్రాక్ సమీపంలో 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తున ఇసుక బస్తాలు వేసి ముంపు నీరు లోనికి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేశారు. చంద్రబాబు వాహన శ్రేణిని సురక్షిత ప్రదేశానికి తరలించగా, ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కరకట్ట లోపల మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన అతిథి గృహం మంతెన సత్యనారాయణ నిర్వహిస్తున్న ప్రకృతి ఆశ్రమం, గణపతి సచ్చిదానందం ఆశ్రమంలోకి వరద నీరు చేరింది. నదిని ఆనుకుని అనాథ బాలల కోసం నిర్మించిన ‘చిగురు’ బాలల ఆశ్రమం సైతం ముంపుబారిన పడింది. దీంతో చిన్నారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కరకట్ట వెంబడి ఉన్న అతిథి గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే సమీప ప్రాంతాల్లోని మత్స్యకారులను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు కృష్ణా నది ప్రవాహానికి అక్రమ కట్టడాలు ఎలా అడ్డు తగులుతున్నాయో సీఆర్డీఏ అధికారులు బుధవారం పరిశీలించారు. అక్కడి పరిస్థితిని ఫొటోలు, వీడియోలు తీశారు. లంక గ్రామాలను ముంచెత్తిన వరద ప్రకాశం బ్యారేజి నుంచి భారీఎత్తున వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుండటంతో లంక గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని లంక గ్రామాలతోపాటు పులిచింతల ముంపు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరటంతో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉద్దండరాయనిపాలెం లంకలోని 150 కుటుంబాలను, తాళ్లాయపాలెం లంకలోని 70 కుటుంబాలను, వెంకటపాలెంలోని 24 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దలంకకు చెందిన 200 కుటుంబాలను ఇబ్రహీంపట్నం వైపు పడవల ద్వారా తరలించారు. పులిచింతల ముంపు గ్రామాలను ఖాళీ చేయించారు. గొట్టిముక్కల గ్రామం నీట మునగటంతో 20 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. కొల్లిపర మండలంలోని పాతబొమ్మువానిపాలెం, అన్నవరపులంక, కొత్తూరిలంక గ్రామాల నుంచి 2 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అనుపాలెం, తూములూరు గ్రామాల్లోని పునరావాస కేంద్రాలకు 200 కుటుంబాలను తరలించారు. రేపల్లె మండలం పెనుమూడి, పులిగడ్డ వారధికి వరద నీరు చేరింది. కొల్లూరు మండలం దోనేపూడి, పోతార్లంక మధ్య చిన్నరేవు బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా నది మధ్యలో చిక్కుకున్న ఘంటసాలకు చెందిన ఆరుగురిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మంత్రుల పర్యటన వరద ఉధృతిని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి బుధవారం పరిశీలించారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పరిస్థితిని, తీసుకున్న జాగ్రత్తలను మంత్రులకు వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రులు ఆదేశించారు. -
అక్రమ నిర్మాణాల తొలగింపు సబబే
ఆరిలోవ (విశాఖ తూర్పు)/లక్కవరపుకోట (శృంగవరపుకోట): కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నది సరైన నిర్ణయమేనని వాటర్‌మేన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు. విశాఖలో పలు జలాశయాలను పర్యవేక్షించేందుకు మూడ్రోజుల కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలోని జలవనరుల పరిరక్షణ సంఘం చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం నగరంలోని ముడసర్లోవ రిజర్వాయరును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణాలు తొలగించడం అభినందనీయమన్నారు. మిగిలిన వాటిని కూడా తొలగించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ సంఘం నుంచి తనవంతు సహకారం వైఎస్ జగన్‌కు అందిస్తానన్నారు. పర్యటనలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, జల సంఘం జాతీయ కన్వీనరు బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కర్మాగారాలతో పర్యావరణానికి విఘాతం అనంతరం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం శ్రీరాంపురం, రెల్లిగౌరమ్మపేట, కొత్తపాలెం గ్రామాల సమీపంలో ఉన్న స్టీల్ ఎక్సే్చంజ్ ఇండియా లిమిటెడ్, మహామాయ కర్మాగారాలను సందర్శించిన రాజేంద్రసింగ్ బృందం.. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి ఈ ఫ్యాక్టరీలను నిర్మించారన్నారు. ఈ గ్రామాల్లో చెరువులు, రహదారులు, గెడ్డలను కబ్జా చేసిన వైనాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు తమ ఇబ్బందులను బృంద సభ్యుల ముందు ఏకరువు పెట్టారు. అనంతరం కొత్తపాలెంలో జరిగిన సభలో రాజేంద్రసింగ్ మాట్లాడారు. ఇక్కడి ప్రజలు మేల్కొని ఉద్యమాలు చేయకపోతే మరికొన్నేళ్లలో భూగర్భ జలాలు పూర్తిగా కనుమరుగవుతాయన్నారు. విశ్రాంతి ఐఏఎస్ అధికారి శర్మ మాట్లాడుతూ.. కాలుష్యం కారణంగా ఇక్కడి వారు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
-
అనుమతి లేకుండా ఎలా కట్టారు?
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్ట లోపల అనుమతి లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలకు సీఆర్డీఏ సమాయత్తమైంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణా నది నుంచి వంద మీటర్లలోపు నిర్మించిన భవనాలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. సుమారు 50 నిర్మాణాల్ని గుర్తించిన సీఆర్డీఏ అధికారులు వాటిలో 35 వరకూ అనుమతుల్లేకుండా నిర్మించినవేనని ఇప్పటివరకు నిర్ధారించారు. 28 నిర్మాణాలకు నోటీసులివ్వాలని నిర్ణయించిన అధికారులు శుక్రవారం పది భవనాలకు నోటీసులు పంపించారు. మిగిలిన వాటికి శనివారం నోటీసులు పంపనున్నారు. శుక్రవారం నోటీసులు పంపిన భవనాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథిగృహం కూడా ఉంది. ఎటువంటి అనుమతుల్లేకుండా కృష్ణా నది నుంచి వంద మీటర్ల లోపు జీ+1 భవనాన్ని రమేష్ నిర్మించినట్లు గుర్తించిన సీఆర్డీఏ నోటీసులిచ్చేందుకు ఆయనకు రెండుసార్లు ఫోన్ చేయగా స్పందించలేదని తెలిసింది. దీంతో విజయవాడలోని లింగమనేని ఎస్టేట్స్ కార్యాలయానికి వెళ్లి నోటీసులిచ్చేందుకు ప్రయత్నించినా అక్కడెవరూ తీసుకునేందుకు సిద్ధపడకపోవడంతో ఉండవల్లిలోని అక్రమ నిర్మాణం వద్దకే వెళ్లి అక్కడి గోడకు నోటీసు అంటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ ఆ నోటీసులో పేర్కొంది. అన్ని చట్టాలు ఉల్లంఘించి.. తమ అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్ రూల్స్ 2012, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి కేపిటల్ సిటీ జోనింగ్ రెగ్యులేషన్‌కు–2016కి విరుద్ధంగా లింగమనేని నిర్మాణాలున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. నేల మీద, మొదటి అంతస్తులో ఆర్సీసీ నివాస భవనం, నేల అంతస్తులో ఆర్సీసీ గది, హెలీప్యాడ్ నిర్మాణాల్ని కృష్ణా నది నుంచి వంద మీటర్లలోపు నిర్మించారని, ఇవికాక అనుమతి లేకుండా పది తాత్కాలిక షెడ్లను నిర్మించారని అధికారులు తెలిపారు. వారంలోపు నోటీసుపై స్పందించి సంజాయిషీ ఇవ్వనిపక్షంలో తగిన చర్య తీసుకుంటామని, ఒకవేళ సంజాయిషీ సరిగా లేకపోయినా చర్య తప్పదని నోటీసులో స్పష్టం చేశారు. లింగమనేని రమేష్ భవనంతోపాటు పది భవనాలకు సీఆర్డీఏ సెక్షన్ 115(3) ప్రకారం శుక్రవారం నోటీసులిచ్చిన సీఆర్డీఏ అధికారులు సంజాయిషీ ఇవ్వకున్నా, ఇచ్చిన సంజాయిషీ సరిగా లేకున్నా సెక్షన్ 115(2) మేరకు తొలగింపు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనుమతుల్లేని భవన యజమానుల జాబితా చందన కేదారేశ్వరరావు ఏ అనుమతుల్లేకుండానే జీ+2 అతిథిగృహం, బీజేపీకి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రెండు అతిథిగృహాలు నిర్మించినట్లు గుర్తించారు. లోటస్ హోటల్, ఫిషర్మెన్ అసోసియేషన్, గణపతి సచ్చిదానంద ఆశ్రమం, శ్రీ రెడ్డి, ఇస్కాన్ టెంపుల్, సాగర్ మినరల్ వాటర్ ప్లాంట్, సుంకర శివరామకృష్ణ, సత్యానంద ఆశ్రమం, అక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పాతూరి సుధారాణి, తులసి గార్డెన్స్, వేదాద్రి మహర్షి తపోవనం, డాక్టర్ మాగంటి ప్రసాద్, లక్ష్మీనారాయణ, నకంటి వెంకట్రావు, సీహెచ్ వేణుగోపాలరావు, చిగురు అనాథ బాలల ఆశ్రమం, సిటీ కేబుల్ మధుసూదనరావు, ఎం.సత్యనారాయణ, మత్స్యకారుల అసోసియేషన్, శివక్షేత్రంలో అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. మందడం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల పరిధిలో మరికొన్ని ఇళ్లు కూడా అనధికారికంగా నిర్మించినట్లు గుర్తించారు. వీటిలో కొన్నింటికి పంచాయతీ అనుమతులు, ఇతర అనుమతులున్నా స్థూలంగా నదీ పరిరక్షణ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలకు వ్యతిరేకంగానే ఉన్నాయని నిర్ధారించారు. వీటిలో కొన్నింటికి ఇప్పటికే నోటీసులిచ్చిన సీఆర్డీఏ అధికారులు సోమవారంలోపు మిగిలిన వాటికి ఇవ్వనున్నారు. చంద్రబాబు నివాసం వద్ద హైడ్రామా తాడేపల్లి రూరల్: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడమైన లింగమనేని రమేష్ అతిథిగృహానికి నోటీసులు జారీ చేసేందుకు సీఆర్డీఏ అధికారులు శుక్రవారం అక్కడకు చేరుకున్న సందర్భంగా వారిని తొలుత లోపలికి అనుమతించలేదు. దీంతో దాదాపు గంటన్నరపాటు హైడ్రామా నెలకొంది. సదరు ఇంటి యజమాని అయిన లింగమనేని రమేష్‌కు నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి లోపలకు వెళ్లాలని అడగ్గా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు చాలాసేపు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. నోటీసులివ్వడానికి వచ్చిన సీఆర్డీఏ అధికారులను లోపలకి అనుమతించట్లేదంటూ మీడియాలో ప్రచారం జరగడంతో.. వెనక్కి తగ్గిన సిబ్బంది ఎట్టకేలకు సీఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డిని, ఆయన వాహనాన్ని, మరో సీఆర్డీఏ అధికారిని లోపలికి అనుమతించారు. మొదట బిబి2 గేటు వద్ద నోటీసు అంటించిన నరేంద్రనా«థ్‌రెడ్డి ఉన్నతాధికారులతో ఫోనులో మాట్లాడారు. చంద్రబాబు నివాసం ఉండే ప్రధాన గేటుకు అంటించమని సూచించడంతో మరికొంతసేపు హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు నరేంద్రనాథ్‌రెడ్డి ప్రధాన గేటు వద్ద కూడా నోటీసు అంటించి తన వాహనంలో విజయవాడకు తిరిగి వెళ్లిపోయారు. క్షుణ్ణంగా పరిశీలించి.. న్యాయ సలహా తీసుకున్నాకే నోటీసులు నోటీసులివ్వడానికి ముందు ఆయా భవనాల పరిస్థితిని సీఆర్డీఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రదేశాల్లో ఏ భవనాలు, ఎన్ని అంతస్తులు, ఎన్ని షెడ్లు, ఇతర నిర్మాణాలున్నాయో పరిశీలించారు. వాటిలో కొన్నింటికి అనుమతులున్నట్లు చెబుతుండడంతో అవి ఎలాంటి అనుమతులో పరిశీలించారు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్నాక సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదించి పక్కాగా నోటీసులు రూపొందించారు. కొన్ని భవనాలకు పంచాయతీలు అనుమతులివ్వగా, కొన్నింటికి గతంలోని ఉడా పరిమితమైన అనుమతులిచ్చినట్లు, మరికొన్నింటికి నిరభ్యంతర పత్రాలున్నట్లు గుర్తించారు. అయితే ఏదో చిన్నవాటికి అనుమతులు తీసుకుని ఆ ముసుగులో భారీ కట్టడాలు నిర్మించినట్లు తేల్చారు. -
సీఎం నివాసం వద్ద కరకట్టపై కారు దగ్ధం
-
సీఎం నివాసం సమీపంలో తగలబడ్డ కారు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలోని కరకట్ట రహదారిపై ఓ కారు తగులబడిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట వద్ద కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న మహీంద్ర XUV వాహనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కారు డ్రైవర్ అప్రమత్తమై... వాహనంలో ఉన్నవారిని దించివేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే కారు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. వీరంతా రాయపూడి నుంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఎం నివాసానికి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తగలబడిన కారు వివరాలుతో పాటు మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి కామినేనికి అవమానం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అవమానం జరిగింది. ఉండవల్లి కరకట్ట మీదకు వెళ్లే రహదారి వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే రోడ్డులో ...సెక్యూరిటీ పేరు చెప్పి మంత్రి వాహనాన్ని మంగళవారం ఉదయం భద్రతా సిబ్బంది నిలిపివేశారు. అసెంబ్లీకి అటువైపుగా దారి లేదంటూ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లు పెట్టి మంత్రి కామినేని శ్రీనివాసరావు, నలుగురు ఎమ్మెల్యేల కార్లను ఆపారు. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా పంపేది లేదని గన్మన్లతో వాగ్వివాదానికి దిగారు. 15 నిమిషాలపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండిపోయారు. మరోవైపు సీఎం ఇంటికెళ్లే కరకట్ట మార్గంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజధాని ప్రాంత ప్రజలను కూడా అటువైపు నుంచి రాకపోకలు సాగనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా కరకట్ట రోడ్డుపై మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీరియస్ అయ్యారు. పోలీసులను వివరణ కోరారు. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. పోలీసుల తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆదేశించారు. గతంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీకి కూడా ఇటువంటి సంఘటనే ఎదురైంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన కరకట్టపై నుంచి శాసనసభకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట్ట దగ్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేశారు. -
చంద్రబాబు సహా 57మందికి హైకోర్టు నోటీసులు
-
చంద్రబాబు సహా 57మందికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణానది పరివాహక కరకట్ట ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా 57మందికి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన లింగమనేని గ్రూపు నుంచి లీజుకు తీసుకున్నారు. ఇందులో లింగమనేని రమేష్, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజులకు చెందిన భవనాలు, మంతెన సత్యనారాయణరాజుకు చెందిన ప్రకృతి ఆశ్రమం కట్టడాలున్న విషయం విదితమే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కృష్ణా కరకట్టపై 4 లేన్ల రహదారి
ప్రతిపాదించిన సీఆర్డీఏ సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలోని కృష్ణా కరకట్టలపై నాలుగులేన్ల రోడ్డు నిర్మించడానికి సీఆర్డీఏ అంచనాలు రూపొందించింది. అలాగే కరకట్ట ఎత్తు, వెడల్పు పెంచి మరింత పటిష్టం చేయాలని పేర్కొంది. కరకట్టపై 72 కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి మొత్తం రూ. 3,600 కోట్లు ఖర్చవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రంగాల వారీగా ఎన్ని నిధులు అవసరమవుతాయో సీఆర్డీఏ అంచనా వేసింది. కృష్ణా నది నీరు సీడ్ కేపిటల్ ప్రాంతానికి రాకుండా దారి మళ్లించేందుకు, సీడీ పనుల కోసం మొత్తం 32 కిలో మీటర్ల మేర నిర్మాణాలకు రూ. 960 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంది. ఖాళీగా ఉండే 577 ఎకరాల్లో పార్కుల అభివృద్ధికి ఎకరానికి రూ. కోటి చొప్పున, మొత్తం కృష్ణా నది ఒడ్డు, పార్కుల అభివృద్ధికి రూ. 5,417 కోట్ల వ్యయం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. 14 వేల కుటుంబాలకు ఇళ్లు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. రాజధాని ప్రాంతంలోని 14 వేల కుటుంబాలకు ఇళ్లు లేవని, వారందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఒక్కో చదరపు అడుగుకు రూ. 1,200 చొప్పున రూ. 840 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్డీఏ పేర్కొంది. ఒక్కో కుటుంబానికి 500 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మిస్తే..70,00,000 చదరపు అడుగులు అవసరం అవుతుందని సీఆర్డీఏ అంచనావేసింది. అలాగే రాజధానిలో రూ. 81 కోట్లతో 27 స్కూళ్లు నిర్మించాలని, ఒక్కో స్కూల్‌కు 10 వేల చదరపు అడుగులు అవసరమవుతుందని పేర్కొంది. అలాగే 200 పడకలతో మూడు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని, ఒక్కో ఆస్పత్రిని 2.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించాలని కూడా సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ. 338 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అలాగే రాజధానిలో రూ. 41 కోట్ల వ్యయంతో 27 పట్టణ ఆరోగ్య కేంద్రాలను కూడా నిర్మించాలని ప్రతిపాదించింది. మౌలిక వసతులకు రూ. 14 వేల కోట్లు రాజధాని ప్రాంతంలోని 17 వేల ఎకరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 14,090 కోట్ల వ్యయం అవుతుందని సీఆర్డీఏ అంచనాలను రూపొందించింది. ఈ 17 వేల ఎకరాల్లో 1,360 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రూ. 5,440 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. అలాగే 2,720 కి.మీ మేర నీటి సరఫరాకు రూ. 1,360 కోట్లు, 2,720 కి.మీ. మేర వృథా నీటి నిర్వహణకు రూ. 490 కోట్లు, వరద నీటి నిర్వహణకు రూ. 5,440 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. 2720 కిలో మీటర్ల విద్యుత్ సరఫరాకు రూ. 1,360 కోట్లు ఖర్చు అవుతుందని సీఆర్డీఏ లెక్కగట్టింది. ఇక రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1,565 కోట్ల వ్యయం అవుతుందని, నీటి సరఫరాకు రూ. 259.32 కోట్లు, వరద నీటి పనుల కోసం రూ. 307.50 కోట్లు, వృథా నీటి పనుల కోసం రూ. 324.20 కోట్లు, ఘన వ్యర్థాల నిర్వహణకు రూ. 97.23 కోట్లు, విద్యుత్ పంపిణీకి రూ. 292.60 కోట్లు, గ్రామాల్లో ఆర్అండ్బీ ప్రధాన రహదారుల కోసం రూ. 41.80 కోట్లు, పంచాయతీరాజ్ ప్రధాన రహదారుల కోసం రూ. 66.88 కోట్లు, గ్రామాల్లో అంతర్గత రహదారుల కోసం 175.56 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్డీఏ పేర్కొంది.