
ఆరిలోవ (విశాఖ తూర్పు)/లక్కవరపుకోట (శృంగవరపుకోట): కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నది సరైన నిర్ణయమేనని వాటర్‌మేన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు. విశాఖలో పలు జలాశయాలను పర్యవేక్షించేందుకు మూడ్రోజుల కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలోని జలవనరుల పరిరక్షణ సంఘం చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం నగరంలోని ముడసర్లోవ రిజర్వాయరును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణాలు తొలగించడం అభినందనీయమన్నారు. మిగిలిన వాటిని కూడా తొలగించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ సంఘం నుంచి తనవంతు సహకారం వైఎస్ జగన్‌కు అందిస్తానన్నారు. పర్యటనలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, జల సంఘం జాతీయ కన్వీనరు బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ కర్మాగారాలతో పర్యావరణానికి విఘాతం
అనంతరం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం శ్రీరాంపురం, రెల్లిగౌరమ్మపేట, కొత్తపాలెం గ్రామాల సమీపంలో ఉన్న స్టీల్ ఎక్సే్చంజ్ ఇండియా లిమిటెడ్, మహామాయ కర్మాగారాలను సందర్శించిన రాజేంద్రసింగ్ బృందం.. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి ఈ ఫ్యాక్టరీలను నిర్మించారన్నారు. ఈ గ్రామాల్లో చెరువులు, రహదారులు, గెడ్డలను కబ్జా చేసిన వైనాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు తమ ఇబ్బందులను బృంద సభ్యుల ముందు ఏకరువు పెట్టారు. అనంతరం కొత్తపాలెంలో జరిగిన సభలో రాజేంద్రసింగ్ మాట్లాడారు. ఇక్కడి ప్రజలు మేల్కొని ఉద్యమాలు చేయకపోతే మరికొన్నేళ్లలో భూగర్భ జలాలు పూర్తిగా కనుమరుగవుతాయన్నారు. విశ్రాంతి ఐఏఎస్ అధికారి శర్మ మాట్లాడుతూ.. కాలుష్యం కారణంగా ఇక్కడి వారు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment