4 లేన్లుగా కరకట్ట రోడ్డు.. రూ.150 కోట్లతో విస్తరణ | CM YS Jagan Review Meeting On Pending Projects In AP | Sakshi
Sakshi News home page

4 లేన్లుగా కరకట్ట రోడ్డు.. రూ.150 కోట్లతో విస్తరణ

Published Tue, Feb 9 2021 3:36 AM | Last Updated on Tue, Feb 9 2021 10:21 AM

CM YS Jagan Review Meeting On Pending Projects In AP - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో భాగమైన కరకట్ట రోడ్డు నాలుగు లేన్లుగా విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పరిధిలోని కీలక ప్రాజెక్టులపై సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.150 కోట్లతో కృష్ణా కరకట్ట రోడ్డు నాలుగు లేన్లుగా విస్తరణ ప్రతిపాదన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.

అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న రహదారులను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును మెయిన్‌ రోడ్డుకు అనుసంధానం చేసే పనులు కూడా పూర్తి చేయాలన్నారు. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

విశాఖ తీరంలో ప్రతిపాదిత ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
విశాఖపట్నంలోని సముద్ర తీరంలో 13.59 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఇదే భూమిని గత ప్రభుత్వం లులూ గ్రూపునకు కారుచౌకగా 33 ఏళ్ల లీజుకు కట్టబెట్టింది. తాజాగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీ, ఏపీఐఐసీ సీఎంకు వివరాలు అందించాయి.

కమర్షియల్‌ ప్లాజా, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి కనీసం సుమారు రూ.1,450 కోట్ల నికర ఆదాయం వస్తుందని ఎన్‌బీసీసీ వివరించింది. సీఎం సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ పి.లక్ష్మీ నరసింహం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement