సీఎం వైఎస్‌ జగన్‌ అమెరికా నుంచి సమీక్ష | CM YS Jagan Review On Floods from America | Sakshi
Sakshi News home page

సహాయం ముమ్మరం

Published Sun, Aug 18 2019 2:54 AM | Last Updated on Sun, Aug 18 2019 2:29 PM

CM YS Jagan Review On Floods from America  - Sakshi

కృష్ణా జిల్లా పెద్దపులిపాక సమీపంలో వరద నీటిలో చిక్కుకున్న స్థానికులను పడవలో పునరావాస కేంద్రానికి తరలిస్తున్న దృశ్యం. (ఇన్‌సెట్‌లో) బాలుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్న ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

సాక్షి, అమరావతి: కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస చర్యలు కొనసాగిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో విస్లృతంగా పర్యటిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, వైద్య సదుపాయాలు సక్రమంగా అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన పంటలకు పరిహారం ఇచ్చేందుకు వీలుగా పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికార బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

మేమున్నామని భరోసా..
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు శనివారం విస్తృతంగా పర్యటిస్తూ బాధితులకు అండగా నిలిచారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్‌ విజయవాడ నుంచి అవనిగడ్డ వరకు కృష్ణా పరివాహక ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల్లో పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు. సహాయక, పునరావాస కార్యక్రమాలు అమలు తీరును సమీక్షించారు. మోకాళ్ల లోతు నీళ్లలో నడిచి మరీ ముంపు గ్రామాల్లోకి వెళ్లి బాధితులతో మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కొన్ని చోట్ల ట్రాక్టర్‌ నడుపుకుంటూ పర్యటించడం విశేషం. ముంపునకు గురైన వ్యవసాయ, ఉద్యాన పంట పొలాలను పరిశీలించారు. లంక గ్రామాలకు పడవలో వెళ్లారు. వరద బాధితులు చెప్పిన విషయాలను ఆసాంతం విని తదనుగుణంగా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

పునరావాస కేంద్రాల్లో వసతులపై ఆరా
విజయవాడలోని గీతానగర్, రామలింగేశ్వరనగర్, భూపేష్‌నగర్, ఆళ్ల చల్లారావు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు కృష్ణా నదికి రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలని కోరారు. వచ్చే ఏడాదిలోగా తప్పకుండా నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. కృష్ణా నది కరకట్ట మీదుగా తోట్లవల్లూరు, పమిడిముక్కల, అవనిగడ్డ, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు అందిస్తున్న భోజన సదుపాయాలు, ఇతర సహాయక చర్యలను పరిశీలించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి నాణ్యమైన భోజనం.. చిన్నారులకు పాలు, రొట్టెలు అందిస్తున్నామని అధికారులు మంత్రులకు తెలిపారు. శిబిరాల వద్ద ప్రత్యేకంగా మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. 24 గంటలూ బాధితులకు అందుబాటులో ఉండాలని కోరారు.

విస్తృతంగా పర్యటించిన అధికార పార్టీ నేతలు
వరద ప్రాంతాల్లోని ప్రజలతో మంత్రులు మాట్లాడి పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. ప్రజల ఇళ్లు, ఆస్తులకు కలిగే నష్టానికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రులతోపాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలా అనిల్‌ కుమార్, సింహాద్రి రమేష్, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, మేరుగ నాగార్జున, నంబూరు శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిమాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్‌ బొప్పన కుమార్‌ తదితరులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వేదాద్రి, ముక్త్యాల తదితర ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను సమీక్షించారు. ముంపునకు గురైన ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు.  


పంటలకు పరిహారం అందిస్తాం 
అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు, సూచనలతో వరద ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టామని మంత్రులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం అంతా వరద బాధితులకు అండగా సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యామన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే అధికార బృందాలను ఏర్పాటు చేశామని, వరదలు తగ్గుముఖం పట్టగానే నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పిస్తాయని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు తగిన పరిహారం అందిస్తామని మంత్రులు రైతులకు హామీ ఇచ్చారు. 

సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష 
వాషింగ్టన్‌ డీసీ : కృష్ణా నది వరదలపై అధికారులు పంపిన నివేదికలను అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఎగువ నుంచి వస్తున్న వరద, దిగువకు విడుదల చేస్తున్న జలాలపై ఆయన ఆరా తీశారు. వరదల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు సహాయం అందించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించొద్దని చెప్పారు. తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసికట్టుగా పని చేస్తున్నారని, బాధితులకు సహాయం చేస్తున్నారని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వరద సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని, ప్రస్తుతం వరద తగ్గు ముఖం పట్టిందని తెలిపారు. 

రంగంలోకి సహాయక బృందాలు 
కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో ముంపు బారిన పడిన నదీ తీర ప్రాంతాలు కడలిని తలపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అగ్నిమాపక శాఖ(ఫైర్‌), స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శనివారం ఉదయానికి కృష్ణా జిల్లాలోని 18 మండలాల్లో 34 గ్రామాలపై వరద ప్రభావం ఉందని గుర్తించారు. గుంటూరు జిల్లాలోని 14 మండలాల్లో 53 గ్రామాలు వరద బారిన పడ్డాయి. రెండు జిల్లాల్లోను మొత్తం 32 మండలాల్లో 87 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని అధికారులు నిర్ధారించారు. లైఫ్‌ జాకెట్లు, బోట్లతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రెండు జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో ఏపీ ఫైర్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 140 మంది సిబ్బంది, 10 మండలాల్లో 18 బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. 180 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. విజయవాడలోని కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వరనగర్‌లతోపాటు తోట్లవల్లూరు, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కంచికచర్ల, కొల్లిపర, కొల్లూరు తదితర మండలాల్లో సహాయ బృందాల సేవలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, సీతానగరం తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.

ఇల్లు వదిలేందుకు ససేమిరా 
రెండు జిల్లాల్లోనూ కృష్ణా నదీ తీరంలో వరదలో చిక్కుకున్న పలు ప్రాంతాల్లో ఇళ్లను విడిచి బయటకు వచ్చేందుకు పలువురు ప్రజలు ససేమిరా అంటున్నారు. ఇంటి ముందు మూడు నుంచి ఐదు అడుగుల మేర వరద నీరు చేరిన ప్రాంతాల్లో సైతం భవనాలపై అంతస్తులకు చేరుతున్న ప్రజలు తమ ఇంటిని వదిలి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. వరద ముప్పు మరింత పెరిగితే వారు ఇళ్లపై అంతస్తుల నుంచి కూడా బయటకు వచ్చేందుకు కష్టమవుతుందని గుర్తించిన ప్రభుత్వ యంత్రాంగం వారికి నచ్చజెపుతోంది. ఒకవైపు వర్షాలు పడుతున్నందున వరద తీవ్రత పెరిగితే ముంపు ముప్పులో చిక్కుకుంటారనే ముందు జాగ్రత్తతో వారికి నచ్చజెపుతున్నారు. మాట వినని వారిని బలవంతంగానైనా సహాయ బృందాల ద్వారా బోట్లపై బయటకు తీసుకొస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, నీరు అందించడంతోపాటు వ్యాధుల బారిన పడకుండా మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement