కృష్ణా కరకట్టపై 4 లేన్ల రహదారి
ప్రతిపాదించిన సీఆర్‌డీఏ
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలోని కృష్ణా కరకట్టలపై నాలుగులేన్ల రోడ్డు నిర్మించడానికి సీఆర్‌డీఏ అంచనాలు రూపొందించింది. అలాగే కరకట్ట ఎత్తు, వెడల్పు పెంచి మరింత పటిష్టం చేయాలని పేర్కొంది. కరకట్టపై 72 కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి మొత్తం రూ. 3,600 కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రంగాల వారీగా ఎన్ని నిధులు అవసరమవుతాయో సీఆర్‌డీఏ అంచనా వేసింది. కృష్ణా నది నీరు సీడ్ కేపిటల్ ప్రాంతానికి రాకుండా దారి మళ్లించేందుకు, సీడీ పనుల కోసం మొత్తం 32 కిలో మీటర్ల మేర నిర్మాణాలకు రూ. 960 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంది. ఖాళీగా ఉండే 577 ఎకరాల్లో పార్కుల అభివృద్ధికి ఎకరానికి రూ. కోటి చొప్పున, మొత్తం కృష్ణా నది ఒడ్డు, పార్కుల అభివృద్ధికి రూ. 5,417 కోట్ల వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది.
14 వేల కుటుంబాలకు ఇళ్లు
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. రాజధాని ప్రాంతంలోని 14 వేల కుటుంబాలకు ఇళ్లు లేవని, వారందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఒక్కో చదరపు అడుగుకు రూ. 1,200 చొప్పున రూ. 840 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ పేర్కొంది. ఒక్కో కుటుంబానికి 500 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మిస్తే..70,00,000 చదరపు అడుగులు అవసరం అవుతుందని సీఆర్‌డీఏ అంచనావేసింది. అలాగే రాజధానిలో రూ. 81 కోట్లతో 27 స్కూళ్లు నిర్మించాలని, ఒక్కో స్కూల్‌కు 10 వేల చదరపు అడుగులు అవసరమవుతుందని పేర్కొంది. అలాగే 200 పడకలతో మూడు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని, ఒక్కో ఆస్పత్రిని 2.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించాలని కూడా సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ. 338 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అలాగే రాజధానిలో రూ. 41 కోట్ల వ్యయంతో 27 పట్టణ ఆరోగ్య కేంద్రాలను కూడా నిర్మించాలని ప్రతిపాదించింది.
మౌలిక వసతులకు రూ. 14 వేల కోట్లు
రాజధాని ప్రాంతంలోని 17 వేల ఎకరాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 14,090 కోట్ల వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ అంచనాలను రూపొందించింది. ఈ 17 వేల ఎకరాల్లో 1,360 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రూ. 5,440 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. అలాగే 2,720 కి.మీ మేర నీటి సరఫరాకు రూ. 1,360 కోట్లు, 2,720 కి.మీ. మేర వృథా నీటి నిర్వహణకు రూ. 490 కోట్లు, వరద నీటి నిర్వహణకు రూ. 5,440 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. 2720 కిలో మీటర్ల విద్యుత్ సరఫరాకు రూ. 1,360 కోట్లు ఖర్చు అవుతుందని సీఆర్‌డీఏ లెక్కగట్టింది.
ఇక రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1,565 కోట్ల వ్యయం అవుతుందని, నీటి సరఫరాకు రూ. 259.32 కోట్లు, వరద నీటి పనుల కోసం రూ. 307.50 కోట్లు, వృథా నీటి పనుల కోసం రూ. 324.20 కోట్లు, ఘన వ్యర్థాల నిర్వహణకు రూ. 97.23 కోట్లు, విద్యుత్ పంపిణీకి రూ. 292.60 కోట్లు, గ్రామాల్లో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారుల కోసం రూ. 41.80 కోట్లు, పంచాయతీరాజ్ ప్రధాన రహదారుల కోసం రూ. 66.88 కోట్లు, గ్రామాల్లో అంతర్గత రహదారుల కోసం 175.56 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ పేర్కొంది.