కృష్ణా నది వెంబడి 30 వేల ఇళ్లు నిర్మిస్తాం
సీఆర్‌డీఏ సమీక్షలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: కృష్ణానదికి అవతలి వైపు ఉన్న ప్రదేశంలో సుమారు లక్ష మందికి సరిపోయేలా 30 వేల ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సీఆర్‌డీఏ, రాజధాని వ్యవహారాలపై సీఎం సమీక్షించారు. కృష్ణా నది నుంచి అమరావతికి మొత్తం ఎన్ని వారధులు అవసరమవుతాయో ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అమరావతి నగరానికి కృష్ణానది ప్రధాన ఆకర్షణని, దానిపై నిర్మించే వారధులు రాజధానికి వన్నె తెచ్చేలా ఉండాలన్నారు.
అమరావతిలో విద్యుత్ బస్సులు, మెట్రో రైళ్లతో పాటు జలమార్గాలు వినియోగంలోకి వస్తాయని చెప్పారు. వాహనాలు సులభంగా వెళ్లేందుకు వీలుగా నగరంలోని రింగ్‌రోడ్లు ఉండాలని, దీనిపై నిపుణులతో చర్చించాలని సూచించారు. రాజధానిలోని ఏదైనా ఒక పర్వత ప్రాంతంలో అక్షరధామ్ తరహాలో ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల సర్వేలెన్స్ కెమెరాలు, 17 కమాండ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే విశాఖ, విజయవాడ, కర్నూలు నగరాల్లో ప్రయోగాత్మకంగా పూర్తిస్థాయి ఫైబర్ ప్రాజెక్టును అమలు చేస్తామని చెప్పారు.