చంద్రబాబు దగ్గరే తప్పు.. సీఎంగా అర్హుడేనా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Slams CM Chandrababu Naidu Over Vijayawada Floods, Watch Video Inside | Sakshi
Sakshi News home page

YS Jagan: తప్పు చంద్రబాబు దగ్గరే ఉంది.. క్షమాపణలు చెప్పాల్సిందే

Published Wed, Sep 4 2024 4:39 PM | Last Updated on Wed, Sep 4 2024 9:09 PM

YS Jagan Slams CM chandrababu Over Vijayawada Floods Sep 4 News

విజయవాడ, సాక్షి: వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి  చంద్రబాబు ఏం చేయడం లేదని.. అసలు ప్రణాళికబద్ధంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజరాజేశ్వరి పేట వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. బాధితులను పరామర్శించారు. అనంతరం.. చంద్రబాబు సర్కార్‌ అలసత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వర్షాలు, వరదల గురించి ముందస్తు సమాచారం ఉంది. అయినా కాస్తో కూస్తో ఆదుకునే ప్రయత్నమూ చేయలేదు. ఎక్కడా రిలీఫ్‌ క్యాంప్‌లు లేవు. ప్రజలపై చంద్రబాబుకు కనికరం లేదు. విజయవాడలో ఏ కాలనీకి వెళ్లినా.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వరదతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది. తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టే కలెక్టరేట్‌ కార్యాలయంలో ఉండి బిల్డప్‌ ఇస్తున్నారు.

ఆ పదవికి అర్హుడివేనా?:
సీఎం చంద్రబాబు, తాను ఆ పదవిలో కూర్చోవడానికి అసలు  అర్హుడినేనా? అని ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని, ఇప్పుడు విజయవాడ విపత్తుకు ముమ్మాటికి చంద్రబాబు తప్పిదమే కారణమని, అందుకు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగన్‌ అన్నారు. విజయవాడ వరదలకు ఇప్పటికే 32 మంది బలి అయ్యారన్న ఆయన, ఇంకా ఎందరు చనిపోయారో లెక్క తెలియడం లేదని, మరోవైపు సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని వెల్లడించారు. తన తప్పు కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు, నెపాన్ని అధికారులపై నెడుతున్నారన్న ఆయన, నిజానికి అన్ని అనర్ధాలకు కారణం చంద్రబాబే అని తేల్చి చెప్పారు.

చంద్రబాబు–దారుణం
తాను నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ నివాసాన్ని కాపాడుకోవడం కోసమే, చంద్రబాబు విజయవాడను ముంచారని, చివరకు ఆ ఇల్లు కూడా నీట మునగడంతో, కలెక్టర్‌ ఆఫీస్‌కు మకారం మార్చారని, ప్రజల కోసమే తానక్కడ ఉంటున్నట్లు ప్రచారం చేసుకుంటూ.. మందీ మార్బలంతో వరద పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తూ హంగామా చేస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. విజయవాడలో విపత్తు కచ్చితంగా మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్‌ అని మరోసారి స్పష్టం చేసిన ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు.

‘బుడమేరు వాగుపై వెలగలేరు రెగ్యులేటర్‌ గేట్లు ఒకేసారి ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? అలా కాకుండా మూడు రోజుల ముందు, వాటిని కాస్త ఎత్తి ఉంటే, వరద ఎప్పటికప్పుడు వెళ్లిపోయి ఉండేవి కదా?. ఆ వరదను అలా రెగ్యులేట్‌ చేసి ఉంటే, తొలుత డైవర్షన్‌ ఛానల్, అక్కణ్నుంచి పోలవరం కెనాల్‌ ద్వారా ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిసిపోయి ఉండేది. కానీ, అలా చేయకుండా, వరద ఉధృతి పెరిగాక, ఒకేసారి ఎత్తారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసం, ఆ పని చేయడంతో, ఆ నీరంతా ఒక్కసారిగా నగరాన్ని ముంచెత్తింది’.



‘ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? వారిని ఆదుకోవడం కోసం ఏమైనా అడుగులు వేశాడా? ఏ చర్యలైనా తీసుకున్నాడా?. అంటే ఏదీ లేదు. విజయవాడలో ఎక్కడికైనా వెళ్లండి. ఏ కాలనీ అయినా తీసుకోండి. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా రిలీఫ్‌ క్యాంపులు లేవు’ 

ముందస్తు జాగ్రత్త లేదు
ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలపై ఐఎండీ (వాతావరణశాఖ) హెచ్చరించిన గత బుధవారం నాడే, ఎగువన ప్రాజెక్టుల వద్ద ఇరిగేషన్‌ సెక్రటరీ ఫ్లడ్‌ వాటర్‌ కుషన్‌ ఏర్పాటు చేసి, నీటి విడుదలను నియంత్రించి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి హెచ్చరికలు లేకుండా బుడమేరు నుంచి నీరు వదలడం, ముందు జాగ్రత్తగా నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్‌ క్యాంప్‌లకు తరలించకపోవడం ఇన్ని అనర్థాలకు కారణమని తేల్చి చెప్పారు. ఇరిగేషన్, రెవెన్యూ, హోం శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా కారణమని చెప్పారు.

అదే మా ప్రభుత్వ హయాంలో..
అదే తమ ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలొస్తే.. 40 వేల జనాభా ఉన్న ఊరి నుంచి 36 వేల మందికి పైగా రిలీఫ్‌ క్యాంప్‌లకు తరలించామని జగన్‌ గుర్తు చేశారు. అలాగే, ఏ విపత్తు వచ్చినా, ముందుగానే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కలెక్టర్లు అప్రమత్తమయ్యే వారని, అక్కడి వారికి ముందుగానే సమాచారం ఇవ్వడంతో పాటు, వాలంటీర్లు దగ్గరుండి తలుపుతట్టి మరీ ప్రజలను రిలీఫ్‌ క్యాంపులకు తీసుకెళ్లేవారని, ప్రతి సందర్భంలో ప్రజల చేయి పట్టుకుని వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేవారని తెలిపారు. అంతే తప్ప, ఇప్పటి మాదిరిగా ఏనాడూ ప్రచార ఆర్భాటం చేయలేదన్న జగన్‌.. ఈ సీఎం మాదిరిగా కలెక్టర్‌ ఆఫీస్‌లో పడుకుంటూ, అర్థరాత్రి ప్రెస్‌మీట్స్‌ పెట్టలేదని గుర్తు చేశారు.

కలెక్టర్లకు వారం టైమ్‌
రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా, సహాయక చర్యలు వేగంగా జరిగేలా కలెక్టర్లకు పూర్తి అధికారం ఇస్తూ.. తగిన నిధులు కూడా కేటాయిస్తూ (టీఆర్‌–27 కింద కలెక్టర్ల ఖాతాలో జమ), వారం రోజుల టైమ్‌ ఇచ్చేవారమన్న జగన్, అప్పటి వరకు తాను అక్కడికి వెళ్లకపోయే విషయాన్ని ప్రస్తావించారు. సహాయక చర్యలకు అటంకం కలగొద్దు అనేదే తమ అభిమతమని చెప్పారు.  ఆ టైమ్‌ ఇవ్వడం వల్ల వెంటనే కలెక్టర్‌ యాక్టివేట్‌ కావడంతో పాటు, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను కూడా యాక్టివేట్‌ చేసి, అంతా కలిసి ఒక వ్యవస్థలా పని చేసి, ప్రతి బాధితుడికీ అండగా నిల్చేవారని చెప్పారు. బాధితులను రిలీఫ్‌ క్యాంప్‌లకు తరలించడం, బాగోగులు చూడడం, అక్కడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు రూ.2 వేల చొప్పున ఇవ్వడం.. ఇవన్నీ ఒక కార్యక్రమంలా జరిగాయని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు. ఇదంతా కేవలం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని గమనించాలని కోరారు.

ఆ వాల్‌ కనుక లేకపోయి ఉంటే..
ప్రకాశం బ్యారేజీకి ఏ మాత్రం వరద వచ్చినా, మునిగిపోయే కృష్ణలంక, ఇంకా దిగువ ప్రాంతాల వాసుల కష్టాలు స్వయంగా చూసి, రూ.500 కోట్లతో కృష్ణలంకకు ఇరువైపులా నిర్మించిన రీటెయినింగ్‌ వాల్‌.. ఇప్పుడు దాదాపు 3 లక్షల మందిని కాపాడుతోందని  జగన్‌ వెల్లడించారు. అందుకే మొన్న తాను వారధి మీదుగా వస్తుండగా, కృష్ణలంక వాసులు ఆపి, ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారని తెలిపారు. ఈరోజు ఒకవేళ ఆ వాల్‌ లేకపోయి ఉంటే, ఇంకా ఎంత అనర్థం జరిగి ఉండేదో ఆలోచించాలని అన్నారు.

వారి మరణాలకు సమాధానం చెప్పాలి
విజయవాడ విపత్తులో ఇప్పటికే 32 మంది చనిపోయారన్న శ్రీ వైయస్‌ జగన్, పేర్లతో సహా ఆ వివరాలన్నీ పత్రికలో వచ్చాయని చెప్పారు. నిజానికి మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న ఆయన, వరద పూర్తిగా తగ్గితే అన్నీ వెలుగులోకి వస్తాయని అన్నారు. ఏదేమైనా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇదంతా జరిగిందన్న ఆయన, ఇప్పటి వరకు బయటపడిన 32 మంది మరణాలకు సమాధానం చెప్పాలని కోరారు. ఇంత దారుణంగా ఆర్గనైజేషన్‌ మేనేజ్‌మెంట్‌ అనేది లేకుండా ఈ మాదిరిగా మేనేజ్‌ చేసిన చంద్రబాబు, అసలు సీఎం పదవిలో ఉండడానికి అర్హుడినేనా? అని తనకు తాను గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని అన్నారు. ఈ మరణాలకు వెంటనే బాధ్యత తీసుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పి, బాధితుల సహాయ కార్యక్రమంలో ముందడుగు వేయాలని తేల్చి చెప్పారు.

అధికారులపై వేలెత్తడం హేయం
‘సీఎం చంద్రబాబు అధికారులను సస్పెండ్‌ చేస్తానంటున్నాడు. అసలు అధికారులు ఎవరు? ప్రభుత్వం ఎవరు? ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి ఏ అధికారికి ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వాలి అని చెప్పి, ఆయనే దగ్గరుండి అన్ని పోస్టింగులు పూర్తి చేశాడు. ఆయనే పోస్టింగులు ఇప్పించుకున్న అధికారుల వల్ల ఇది జరిగింది అని ఆయనే సిగ్గు లేకుండా చెబుతున్నాడు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఏదన్నా ఉంటుందా?. కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పి పుచ్చుకునే దాని కోసం అధికారులను బలిపశువులను చేస్తూ వారి మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తున్నారు’.

‘అన్నింటికీ కారణం నువ్వు అయినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు, దాన్ని హుందాగా అంగీకరించి, తప్పు చేశానని ప్రజలను  క్షమాపణ అడిగి అడుగులు ముందుకు వేయాలి కానీ.. తాను చేసిన తప్పులకు అధికారుల మీద వేలెత్తి చూపిస్తూ, వారిని తప్పు పడుతూ,  వారిపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్న చంద్రబాబు కంటే దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు’

ఆ లాక్‌లు ఎవరెత్తారు?

‘బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్‌ ఉంది. వెలగలేరు రెగ్యులేటర్‌ మీద లాక్‌లు.. అంటే గేట్లు ఎవడు ఎత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడు ఎత్తాడు? ఎందుకు ఎత్తాడు? అది ఎత్తకపోయి ఉంటే చంద్రబాబునాయుడుగారి ఇల్లు మునిగేది. ఎందుకంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లేవి. బాబు ఇల్లు మునిగేది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్‌ ఛానల్‌ ద్వారా పోలవరం కెనాల్‌లో పడి, అక్కణ్నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో  కలిసేవి. దాని వల్ల బ్యాక్‌వాటర్‌ ఎక్కువై చంద్రబాబు ఇల్లు మునిగేది. మరి ఆ రెగ్యులేటర్‌ 11 గేట్లు ఒకేసారి ఎత్తింది ఎవరు? ఎందుకు అర్ధరాత్రి పూట హడావుడిగా ఎత్తారు? ఎక్కడ చంద్రబాబునాయుడు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎత్తారు. అది ఎత్తడం వల్ల ఆ గేట్ల నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చిన నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి’ అని జగన్‌ వివరించారు.

నిజాయితీ ఉంటే చూపండి
‘ఇది రూట్‌ సార్‌.. మీరంతా విలేకరులు.. ఒకసారి నేరుగా వెళ్లి మీరు చూడండి. ఇదే విషయం వాళ్ల పాంప్లెట్‌ పేపర్‌ ఈనాడులోనూ వచ్చింది. దయచేసి కాస్తో కూస్తో జర్నలిజంలో న్యాయం, ధర్మం కొంచం అయినా పాటించి. వాళ్ల గెజిట్‌ పేపర్‌ ఈనాడులో వచ్చిన ఆ వార్తను ఒక్కసారి మీ టీవీల్లో చూపించండి’. ‘వాళ్లంతట వాళ్లే గేట్లు ఎత్తడం జరిగింది. అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకెత్తారట! అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చాయట! అవన్నీ వాళ్లు రాసిన మాటలే. దయచేసి ఏ మాత్రం జర్నలిజంలో నిజాయితీ, న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమని అడుగుతున్నాను’ అని జగన్‌ అన్నారు.

మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్‌
విజయవాడ విపత్తు కచ్చితంగా మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్‌ అన్న శ్రీ వైయస్‌ జగన్, దీని వల్ల ఇప్పటికే 32 మంది చనిపోయారని చెప్పారు. గతంలో గోదావరి పుష్కరాల్లో కూడా చంద్రబాబునాయుడుగారు తన షూటింగ్‌ కోసం, తాను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో చేసిన హంగామాలో తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం చెందిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు కూడా అదే మాదిరిగానే చంద్రబాబునాయుడుగారి తప్పిదం వల్లే 32 మంది చనిపోయారని అన్నారు.

రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి
అంత మంది మరణానికి కారణమైన సీఎం చంద్రబాబు, వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని, మృతుల్లో ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, క్షమాపణ కోరుతూ వారందరికీ లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. ఇంకా ఈ వరదల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఇళ్లల్లోని సామాన్లన్నీ కొట్టుకుపోయాయని, ఫ్రిజ్‌లు, ఇతర వస్తువులన్నీ పోవడం వల్ల వారంతా చాలా నష్టపోయారని చెప్పారు. ఈ వరదల వల్ల 6 లక్షల మంది ప్రభావితులైనట్లు వారిచ్చిన రిపోర్ట్‌లోనే ఉన్నందువల్ల, ఆ విధంగా సామాన్లు కోల్పోయిన ప్రతి ఇంటికి కనీసం రూ.50 వేలు ఇవ్వాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement