కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా | Poaching in the Krishna River | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా

Published Fri, Apr 28 2017 3:45 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా - Sakshi

కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా

ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో కృష్ణా నదిలో ఆక్రమణలు

నది మధ్య 150 ఎకరాల విస్తీర్ణం మేర నీటి లోపల బలమైన రోప్‌
పై భాగంలో ప్లాస్టిక్‌ డబ్బాలు.. ఎర్ర జెండాలతో హద్దులు
అటువైపు ఎవరూ రావద్దంటూ మత్స్యకారులకు హెచ్చరికలు
ముఖ్యమంత్రికీ వాటా ఉందంటూ అక్రమార్కుల బెదిరింపులు
రిసార్ట్స్, మల్టీప్లెక్స్‌ నిర్మాణాల కోసం పక్కా వ్యూహం
కబ్జాలపై ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు..


సముద్రం మధ్యలో ఐలాండ్‌ అడ్డాగా మాఫియా డాన్‌ చీకటి సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద బోట్లపై రాకపోకలు సాగిస్తుండటాన్ని హాలీవుడ్‌ సినిమాల్లో చూస్తుంటాం. దానిని తలదన్నేలా రాష్ట్రంలో అధికార పార్టీ పెద్దలు కృష్ణా నదినే కబ్జా చేసి మధ్యలో ఐలాండ్‌ సృష్టిస్తున్నారు. బలమైన కట్టడంతో ప్రవాహాన్నే పక్కకు మళ్లింప చూస్తున్నారు. ఇసుక, మద్యం, కొండలు, గుట్టలు, అడవులు, చెరువులు.. అక్రమార్జనకు ఇవన్నీ సరిపోక ఏకంగా నది గర్భాన్నే ఆక్రమించుకోవడం విస్తుగొలుపుతోంది.

సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ పెద్దల అక్రమాలకు భూములు.. కొండలు.. చెరువులే కాదు, నదులు కూడా మాయమవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఏకంగా కృష్ణా నదినే ఆక్రమించుకున్నారు. నది మధ్యలో రిసార్ట్స్, మల్టీప్లెక్స్‌లు నిర్మించుకునేందుకు సుమారు 150 ఎకరాల విస్తీర్ణం చుట్టూ హద్దులతో ఎర్ర జెండాలు ఏర్పాటు చేశారు. ఇటువైపు ఎవరైనా వస్తే కబడ్దార్‌.. అంటూ హెచ్చరిస్తున్న అధికార పార్టీ నేతల బరితెగింపు వ్యవహారం ‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ప్రధాన నీటి ఆదరువు కృష్ణా నది.

లక్షలాది ఎకరాలకు సాగునీటితో పాటు విజయవాడ, గుంటూరు, తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని జనాభాకు తాగునీరు అందిస్తోంది. ఏపీ నూతన రాజధానిగా అమరాతిని ప్రకటించిన కొన్నాళ్లకే టీడీపీ నేతలు నదిలో విలువైన ఇసుకను భారీ యంత్రాల సాయంతో కొల్లగొట్టారు. లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. అంతటితో ఆగక ఏకంగా ఇపుడు నదినే కబ్జా చేసి వ్యాపార వనరుగా మార్చుకుంటుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెల క్రితం నుంచి పనులు
తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం లంకకు అతిసమీపంలో విస్తరించిన కృష్ణా నది మధ్య భాగం సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. కృష్ణా పరివాహక ప్రాంతమైన తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తుమ్మలపాలెం, గుంటుపల్లి మధ్య కృష్ణానదిలో కిలోమీటరు  మేర కంచె ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మద్దతుతోనే ఈ ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 25 అడుగుల లోతున్న నదిలో నెల క్రితం పనులు ప్రారంభించినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. రోజూ సుమారు 20 మంది గజ ఈతగాళ్లు పడవల్లో వచ్చి నదిలో దిగి ఇనుముతో తయారు చేసిన రోప్‌ను నీటిలో విడిచిపెట్టినట్లు తెలిపారు.

ఈ రోప్‌కు ప్లాస్టిక్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన నీలం డబ్బాలను ఏర్పాటు చేసి, వాటిపై ఎర్రని జెండాలు ఉంచారు. నాలుగు రోజుల క్రితం ఈ పని పూర్తి చేశారు. ఈ పనులు జరిగిన నెల పాటు మత్స్యకారులెవ్వరినీ అటువైపు వేటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఎందుకిలా చేస్తున్నారని కొందరు మత్స్యకారులు  ప్రశ్నిస్తే.. ‘ప్రభుత్వం మాది. మేము ఏం చేస్తే మీకెందుకు’ అని గట్టిగా మాట్లాడారు. ఈ పని ఎవరు చేయిస్తున్నారని మత్స్యకారులు మరోసారి ప్రశ్నించటంతో.. ఈ పనిలో సీఎం చంద్రబాబుకు కూడా వాటా ఉందని స్పష్టం చేసినట్లు మత్స్యకారులు వివరించారు.

ఐలాండ్‌ సృష్టిస్తున్నారు..
ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించాక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూములకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ముఖ్యంగా కృష్ణా నదీ తీర ప్రాంతంపై టీడీపీ పెద్దలు దృష్టి సారించారు. లంక, నదీ తీర ప్రాంతంలో ఉన్న భూములను సొంతం చేసుకునేందుకు పథకం వేశారు. అందులో భాగంగా నాలుగు నెలల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు కొందరు గూండాలతో ఉద్దండరాయునిపాలెం సమీపంలోని లంకలోకి ప్రవేశించి సుమారు రూ.300 కోట్లు విలువచేసే భూములను ఆక్రమించునే ప్రయత్నం చేశారు.  స్థానికులు అడ్డుకోవటం... దానిని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావటంతో అప్పట్లో ఆ ఆక్రమణకు అడ్డుకట్టపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నదిపై దృష్టి పెట్టి.. నీటి మధ్యలో 150 ఎకరాల మేర ఆక్రమించారు.

అందులో రిసార్ట్స్, మల్టీఫ్లెక్స్‌లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్మించి తద్వారా భారీ డబ్బు సంపాదించాలనేది టీడీపీ నేతల లక్ష్యం. ప్రస్తుతం ఆక్రమణకు గురైన ప్రాంతంలో గతంలో ఓ బడా కంపెనీ వారు మట్టితో దీవిలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ఆ ప్రాంతాన్ని మట్టి, ఇసుకతో మరింత విస్తరించి ఐలాండ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం తుమ్మలపాలెం ఘాట్‌ వద్దకు మూడు భారీ పడవలు తెప్పించారు. భారీ పైపులు కూడా తీసుకొచ్చారు. పడవల్లో పైపులు, ఇసుక, మట్టి తీసుకెళ్లి జెండాలు పాతిన ప్రాంతంలో నదిని పూడ్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బలమైన గట్టు నిర్మించాలని నిర్ణయించారు. ఇతే జరిగితే నదికి వరద వచ్చినపుడు నీరు వేగంగా వెళ్లలేక, ఒత్తిడి పెరిగి కరకట్టలు కోసుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు.

అధికారుల పొంతనలేని సమాధానం   
అక్రమార్కులు కృష్ణా నదిని ఆక్రమించుకుంటున్న విషయం గురించి మత్స్యకారులు, స్థానికులు తుళ్లూరు తహసీల్దార్‌ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ‘సాక్షి’ తుళ్లూరు తహసీల్దార్‌ను వివరణ కోరగా.. సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.  సీఎం చంద్రబాబు భద్రత కోసం పోలీసులు అలా ఏర్పాటు చేసినట్లున్నారని శ్రీధర్‌బాబు విచిత్రమైన సమాధానం ఇచ్చారు.

సీఎం భద్రతకు, నదిలో జెండాలు పాతాల్సిన అవసరమే లేదని గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌ కొట్టిపారేశారు. అధికారుల పొంతనలేని సమాధానాలు చూస్తుంటే ప్రభుత్వ పెద్దలు పక్కా వ్యూహంతో కృష్ణా నదిని ఆక్రమించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

ఇదేం విడ్డూరం!
ఎక్కడైనా భూములు, కొండలు ఆక్రమించుకున్న విషయాలను విన్నాం. చూశాం. కానీ ఇక్కడ నదినే ఆక్రమించుకున్నారు. ఇలా చేస్తున్నదెవరని అడిగితే ఇందులో చంద్రబాబుకు కూడా వాటా ఉందంటున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి జెండాలు పాతి వెళ్లాక మమ్మల్నెవర్నీ అవతలకు పంపలేదు. ఈ ప్రాంతంలో 500 కుటుంబాలకుపైగా చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాం. జెండాలు పాతిన చోట సింగపూర్, జపాన్‌ నుంచి మిషన్లు తీసుకొచ్చి నదిని పూడ్చివేస్తారంట. ఇలాగైతే మేమెలా బతకాలి?
– అబ్రహాం, మత్స్యకారుడు, గుంటుపల్లి.

 నదినే లేకుండా చేస్తున్నారు..
రాజధాని పేరుతో పంటలను నాశనం చేశారు. ఇప్పుడు రిసార్ట్స్‌ల కోసం అంటూ ఏకంగా నదినే పూడ్చి వేయటానికి సిద్ధమవుతున్నారు. నాలుగు నెలల క్రితం 250 ఎకరాల లంక భూములను కొందరు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. మా ఊరి వాళ్లం అంతా ఏకమై అడ్డుకుంటే వెనక్కుతగ్గారు. మళ్లీ ఇప్పుడు ఏకంగా నదినే ఆక్రమించున్నారు.
– నందిగామ సురేష్, రైతు, ఉద్దండరాయునిపాలెం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement