రాజధాని ఎత్తు పెంచుతున్నారా?
ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించిన ఎన్జీటీ
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నది గరిష్ట ప్రవాహ మట్టానికంటే లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రతిపాదిత రాజధాని ఎత్తును పెంచనున్నారా? అంటూ జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అమరావతికి పర్యావరణ అనుమతులపై దాఖలైన పలు పిటిషన్లపై కొనసాగుతున్న విచారణలో భాగంగా సోమవారం ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు.. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సంజయ్ ఫారిక్ వాదనలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ స్వతంత్రకుమార్.. ‘మీరు లోతట్టు ప్రాంతం ఎత్తు పెంచబోతున్నారా?’ అని ఏపీ ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది గంగూలీని ప్రశ్నించారు. ‘లేదు.. లేదు.. మా వాదనల సమయంలో వివరిస్తాం..’ అని గంగూలీ చెప్పబోతుండగా సంజయ్ ఫారిఖ్ జోక్యం చేసుకుని.. వారు ఇచ్చిన నివేదికలోనే ఆ విషయం ఉందని, రూ.1,500 కోట్లతో రెండు మీటర్ల మేర ఎత్తు పెంచబోతున్నట్టుగా సీఆర్‌డీఏ కమిషనర్ ఓ జాతీయ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారని తెలియజేశారు. ఒక సందర్భంలో జస్టిస్ స్వతంత్రకుమార్ స్పందిస్తూ ‘చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం..’ అని వ్యాఖ్యానించారు. దాదాపు 2 గంటల విచారణ అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో జరుపుతామని తెలిపింది.