ఉండవల్లిలో కృష్ణా నదీగర్భంలో నిర్మించిన చంద్రబాబు నివాసం. (ఇన్‌సెట్‌లో) ఆయన నివాసంలోకి చేరిన వరద నీరు
సాక్షి, అమరావతి బ్యూరో/విజయవాడ: కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో కరకట్ట వెంబడి నిర్మించిన అతిథి గృహాలు, ఇతర కట్టడాల్లోకి బుధవారం వరద నీరు ప్రవేశించింది. కరకట్ట లోపలి వైపున నదీ గర్భంలోకి చొచ్చుకెళ్లి గతంలో భారీ కట్టడాలను నిర్మించారు. వాటికి కొండరాళ్లతో పునాదులు వేసి.. నీటి ప్రవాహానికి అడ్డంగా గట్లు నిర్మించారు. నది పోటెత్తి ప్రవహిస్తుండటంతో చాలా కట్టడాల్లోకి వరద నీరు ప్రవేశించింది. వీటివల్ల నదీ ప్రవాహ దిశ మారుతోందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. కృష్ణా కరకట్ట దిగువన ఉన్న అక్రమ కట్టడాలలో చంద్రబాబు నివాసం కూడా ఉన్న సంగతి తెలిసిందే. నదీ గర్భంలో నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి నీరు చేరుతుండటంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని సామగ్రిని మరో అంతస్తులోకి చేర్చారు. నీటిమట్టం పెరుగుతుండటంతో చంద్రబాబు నివాసం వద్ద రక్షణ చర్యలు చేపట్టారు. వాకింగ్ ట్రాక్ సమీపంలో 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తున ఇసుక బస్తాలు వేసి ముంపు నీరు లోనికి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేశారు.
చంద్రబాబు వాహన శ్రేణిని సురక్షిత ప్రదేశానికి తరలించగా, ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కరకట్ట లోపల మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన అతిథి గృహం మంతెన సత్యనారాయణ నిర్వహిస్తున్న ప్రకృతి ఆశ్రమం, గణపతి సచ్చిదానందం ఆశ్రమంలోకి వరద నీరు చేరింది. నదిని ఆనుకుని అనాథ బాలల కోసం నిర్మించిన ‘చిగురు’ బాలల ఆశ్రమం సైతం ముంపుబారిన పడింది. దీంతో చిన్నారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కరకట్ట వెంబడి ఉన్న అతిథి గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే సమీప ప్రాంతాల్లోని మత్స్యకారులను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు కృష్ణా నది ప్రవాహానికి అక్రమ కట్టడాలు ఎలా అడ్డు తగులుతున్నాయో సీఆర్‌డీఏ అధికారులు బుధవారం పరిశీలించారు. అక్కడి పరిస్థితిని ఫొటోలు, వీడియోలు తీశారు.
లంక గ్రామాలను ముంచెత్తిన వరద
ప్రకాశం బ్యారేజి నుంచి భారీఎత్తున వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుండటంతో లంక గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని లంక గ్రామాలతోపాటు పులిచింతల ముంపు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరటంతో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉద్దండరాయనిపాలెం లంకలోని 150 కుటుంబాలను, తాళ్లాయపాలెం లంకలోని 70 కుటుంబాలను, వెంకటపాలెంలోని 24 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దలంకకు చెందిన 200 కుటుంబాలను ఇబ్రహీంపట్నం వైపు పడవల ద్వారా తరలించారు. పులిచింతల ముంపు గ్రామాలను ఖాళీ చేయించారు.
గొట్టిముక్కల గ్రామం నీట మునగటంతో 20 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. కొల్లిపర మండలంలోని పాతబొమ్మువానిపాలెం, అన్నవరపులంక, కొత్తూరిలంక గ్రామాల నుంచి 2 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అనుపాలెం, తూములూరు గ్రామాల్లోని పునరావాస కేంద్రాలకు 200 కుటుంబాలను తరలించారు. రేపల్లె మండలం పెనుమూడి, పులిగడ్డ వారధికి వరద నీరు చేరింది. కొల్లూరు మండలం దోనేపూడి, పోతార్లంక మధ్య చిన్నరేవు బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా నది మధ్యలో చిక్కుకున్న ఘంటసాలకు చెందిన ఆరుగురిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
మంత్రుల పర్యటన
వరద ఉధృతిని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి బుధవారం పరిశీలించారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పరిస్థితిని, తీసుకున్న జాగ్రత్తలను మంత్రులకు వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రులు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment