అమరావతిలో బుద్ధుని విగ్రహం వద్ద ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదికి వరద పోటెత్తడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు లంక గ్రామాలు కకావికలమయ్యాయి. పొలాలతోపాటు, గ్రామాల్లోకీ వరద నీరు ప్రవేశించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో కృష్ణానది కరకట్టను అనుకొని ఉన్న తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటశాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో లంక గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. 70 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పులిగెడ్డ అక్విడెక్టుపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో ఉద్యాన, వ్యవసాయ పంటలకు, చేపల చెరువులకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి – విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద మద్దూరు గ్రామంలోకి నీరు రావటంతో పాటు, రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు పడవల్లో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. రేపల్లె మండలం పెనుమూడి, పల్లెపాలెం గ్రామాల్లో వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలోని సబ్‌స్టేషన్‌లోకి నీరు రావటంతో 8 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నీట మునిగిన పంట పొలాలు.. అపార నష్టం
తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో ఉద్యాన పంటలు 13,089 ఎకరాల్లో నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో 7097.5 ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి. గుంటూరు జిల్లాలో దాచేపల్లి, అచ్చంపేట, అమరావతి, తాడేపల్లి, కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో 12,262.5 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో 7097.5 ఎకరాల్లో వరి, 3,495 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 ఎకరాల్లో మల్బరి పంటలు నీట మునిగాయి. 165 గృహాలు వరద ప్రభావానికి దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో 41 పునరావాస కేంద్రాలకు 8,100 మందిని, గుంటూరు జిల్లాలో 14 మండలాల్లోని 53 గ్రామాల్లో 3,543 మందిని 15 పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారపరెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.
అంత్యక్రియలకూ కష్టకాలం
భట్టిప్రోలు(వేమూరు), కొల్లూరు : కృష్ణానదికి వరద రావడంతో మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లే మార్గం లేక గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో మృతి చెందిన నూతక్కి రామయ్య(75)కు కరకట్టపైనే దహన సంస్కారాలు చేశారు. కొల్లూరు మండలం గాజుల్లంకలో మృతి చెందిన మత్తి జనభాయమ్మకు అక్కడ అంత్యక్రియలు నిర్వహించే వీలులేక పడవలో కొల్లూరుకు తరలించారు.
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో దహన సంస్కారాలకు వరద నీటిలో ఇబ్బందులు
చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టిన వరద
కృష్ణా నది గర్భాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను వరద ముంచెత్తుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న ఇంటిని వరద నీరు చుట్టుముట్టినా తన నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఆయన ఒప్పుకోవడం లేదు. హెలిప్యాడ్, గార్డెన్, చుట్టుపక్కలున్న తోటలన్నీ నీట మునిగినా ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది ఇల్లు ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి నోటీసు ఇవ్వడానికి వెళ్లిన వీఆర్వో ప్రసాద్‌ను సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించక పోవడంతో దానిని గోడకు అంటించారు. వరద ముప్పు కారణంగా ఇప్పటికే కరకట్టను ఆనుకొని ఉన్న 32 నివాసాలకు నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment