మహోగ్ర వేణి  | Above Six lakh cusecs flood flow into Prakasam Barrage | Sakshi
Sakshi News home page

మహోగ్ర వేణి 

Published Sat, Oct 17 2020 4:59 AM | Last Updated on Sat, Oct 17 2020 7:12 AM

Above Six lakh cusecs flood flow into Prakasam Barrage - Sakshi

సాక్షి, అమరావతి, ఏపీ నెట్‌వర్క్‌: కృష్ణవేణి మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 7.62 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి వచ్చే వరద 6.92 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. రాత్రి 11 గంటలకు 9 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. కృష్ణా నదీ గర్భంలో... ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం ఉంటున్న భవనంతోపాటు 36 అక్రమ కట్టడాలను వరద చుట్టుముట్టింది. భారీగా వరద వస్తుందనే సమాచారాన్ని అక్రమ కట్టడాల్లో నివాసం ఉంటున్న వారికి మూడు రోజుల క్రితమే తెలియజేసిన అధికారులు.. తక్షణమే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలకు తరలించింది. కృష్ణా డెల్టాకు 3 వేల క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 6.89 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. శనివారం ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్‌కు దిగువన లింగాలగట్టు గ్రామానికి ముప్పు పొంచి ఉండటంతో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాగార్జున సాగర్‌ నుంచి వస్తున్న జలాలకు మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 7.68 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 20 క్రస్ట్‌గేట్ల ద్వారా 8,55,857 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.  

లంకల్ని ముంచిన వరద 
గుంటూరు జిల్లాలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కొల్లూరు మండలంలో కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి.. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది లేకుండా రేషన్‌ సరుకులు, కొవ్వొత్తులు, కూరగాయలు పంపాలని ఆదేశించారు. దాచేపల్లి మండలం రామాపురంలో మత్స్యకారుల కాలనీ నీట మునిగింది. ఇళ్ల పైనుంచి వరద ప్రవహిస్తోంది. పొలాలు పూర్తిగా నీట మునిగాయి.  అలాగే వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టింది. గొట్టా బ్యారేజీ నుంచి 32,929 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఇదిలావుంటే.. గోదావరిలో ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,78,644 క్యూసెక్కులు చేరుతున్నాయి.  

శాంతించిన ఏలేరు 
తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన ఏలేరు వరద తగ్గుముఖం పట్టింది. ఏలేరు రిజర్వాయర్‌లో బుధవారం నుంచి రోజుకు 17 వేల క్యూసెక్కుల చొప్పున దిగువకు నీటిని విడుదల చేయగా శుక్రవారం ఉదయం 5 వేల క్యూసెక్కులకు తగ్గించారు. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాలో ఇంకా ముంపు పూర్తిగా వీడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. 

మంత్రుల పర్యటన 
ముంపునకు గురైన లంక ప్రాంతాల ఆక్వా రైతులు, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు గ్రామాలైన శ్రీపర్రు కాజ్‌వే, జాలిపూడి, గుడివాకలంకలలో వారు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ప్రజలు, రైతులు ఆందోళనపడొద్దని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement