సాక్షి, అమరావతి: కృష్ణా నదికి ఇటీవల వచ్చిన వరదలను సమర్థవంతంగా నియంత్రిస్తూ రాయలసీమకు ఇప్పటికే 46 టీఎంసీల మిగులు జలాలను మళ్లించామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేసి ఉంటే రాయలసీమకు చుక్క నీరైనా వచ్చేదా? అని నిలదీశారు. ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదికి గతంలో వచ్చిన చిన్నపాటి వరదలనే నియంత్రించలేక శ్రీశైలం ప్రాజెక్టు పవర్‌హౌస్‌ను ముంచేసిన చంద్రబాబు ఇప్పుడు తనను చూసి వరద నియంత్రణ నేర్చుకోవాలని మాట్లాడుతుండటం సిగ్గుచేటని మండిపడ్డారు. అనిల్‌కుమార్ యాదవ్ ఇంకా ఏం మాట్లాడారంటే...
‘‘తుపాన్‌లు వచ్చినా, వరదలు వచ్చినా, కరువు వచ్చినా కమీషన్ల కోసం సమీక్షలు నిర్వహించిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కృష్ణా నది వరదలపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించలేదంటూ విమర్శించడం దారుణం. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ వరదలపై అప్రమత్తం చేశారు. అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడం వల్లే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. వరదలు వస్తుండడాన్ని ముందే పసిగట్టి కృష్ణా నది గర్భంలో కట్టుకున్న తన ఇల్లు మునిగిపోతుందని హైదరాబాద్‌కు పారిపోయిన చంద్రబాబు వరదలు తగ్గాక అక్కడక్కడ పర్యటించి, ప్రభుత్వంపై విమర్శలు చేసి, మళ్లీ హైదరాబాద్‌కు జారుకున్నారు.
బాబు అవగాహనా రాహిత్యానికి నిదర్శనం
కృష్ణా నది వరదలపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు కిందికి వదిలేసి ఉంటే వరద ప్రభావం ఉండేది కాదని ఓవైపు చెబుతున్న చంద్రబాబు మరోవైపు రాయలసీమకు నీళ్లు ఇవ్వడం లేదని, సముద్రంలోకి వృథాగా 290 టీఎంసీలు విడుదల చేశారని అనడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు అంటే 44 వేల క్యూసెక్కులను రాయలసీమకు విడుదల చేయాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 881 అడుగులు ఉండాలన్న విషయం 14 ఏళ్లు అధికారం వెలగబెట్టిన చంద్రబాబుకు తెలియదా? వెలిగోడు, గోరకల్లు, అవుకు, గండికోట, సోమశిల రిజర్వాయర్‌లకు ఇప్పటికే 46 టీఎంసీలను తరలించాం.
ఈ నెల 4 నుంచే హంద్రీ–నీవాకు, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయడం ప్రారంభించాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44,500 క్యూసెక్కులు విడుదల చేశాం. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నడూ 32 వేల క్యూసెక్కులకు మించి విడుదల చేయలేదు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఈ నెల 9న శ్రీశైలంలో నీటి నిల్వ 879 అడుగులకు చేరుకోగానే గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు విడుదల చేశాం. సాగర్‌లో నీటి మట్టం క్రస్ట్ గేట్ల స్థాయికి అంటే 545 అడుగులకు చేరుకోగానే ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 12న ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలాం. పులిచింతల ప్రాజెక్టు గేట్లను అదే రోజున ఎత్తి.. ఎగువ నుంచి వస్తున్న వరదను శ్రీశైలం, సాగర్, పులిచింతలను భర్తీ చేస్తూ దిగువకు ప్రవాహాన్ని విడుదల చేశాం. దీనివల్ల వరద ప్రభావం ప్రకాశం బ్యారేజీపై తక్కువగా పడింది. ఈ నెల 17న ఆరు గంటలపాటు మాత్రమే బ్యారేజీకి 8.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. మిగిలిన రోజుల్లో ఏనాడూ ఏడు లక్షల క్యూసెక్కులు దాటలేదు. చంద్రబాబు చెప్పినట్టు వచ్చిన నీటిని వచ్చినట్టు విడుదల చేసి ఉంటే ప్రకాశం బ్యారేజీలోకి 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చేది.
రైతులు ఆనందంలో ఉంటే బాబు కడుపు కాలుతోంది
శ్రీశైలం ప్రాజెక్టులోకి ఈ ఏడాది 879 టీఎంసీల ప్రవాహం వస్తే ప్రకాశం బ్యారేజీ వద్ద గరిష్టంగా 8.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 2009లో శ్రీశైలం ప్రాజెక్టులోకి 715 టీఎంసీలు వచ్చినా అప్పట్లో ప్రకాశం బ్యారేజీలోకి 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీన్నిబట్టి చూస్తే వరద నియంత్రణలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయం సాధించినట్లు స్పష్టమవుతోంది. పులిచింతలలో ఇప్పటికే 43 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది పూర్తి సామర్థ్యం మేరకు అంటే 45.77 టీఎంసీలను నిల్వ చేస్తాం. కృష్ణాకు వచ్చిన వరదల వల్ల ప్రాజెక్టులు నిండి, మంచి పంటలు పండుతాయని రైతులు ఆనందంలో ఉంటే.. చంద్రబాబు కడుపు కాలి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నదీ గర్భంలో ఇల్లు నిరి్మంచుకుంటే చంద్రబాబుదైనా, గజనీదైనా మునిగిపోక తప్పదు. వరద వల్ల నష్టపోయిన రైతులను, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుంది’’ అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు. రాయలసీమకు తరలించిన మిగులు జలాలను లెక్కలోకి తీసుకోవద్దని కృష్ణా బోర్డును కోరుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని నిర్మూలించేందుకే పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి పనులకు రివర్స్ టెండర్లు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment