CRDA Authority
-
ఒక్క రాజధానిలో వెయ్యి కుంభకోణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో వెయ్యి కుంభకోణాలు జరిగినట్లు కొద్ది రోజులుగా సీఆర్డీఏ సమీక్షల్లో తేటతెల్లం అవుతోందని, రాజధాని చుట్టూ భూకుంభకోణాలు అల్లుకుని ఉన్నాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని అభివృద్ధి పేరిట భారీ దోపిడీ జరిగిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షల్లో అనేక కుంభకోణాలు బయటపడుతున్నాయని తెలిపారు. రాజధాని చుట్టూ భూకుంభకోణం, సింగపూర్ కంపెనీలకు భూములు ఇవ్వడంలో కుంభకోణం, నీటి పైపులైన్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం.. ఇలా లెక్కలేనన్ని కుంభకోణాలున్నాయని అన్నారు. అసలు ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసమే ఒక పెద్ద కుంభకోణమని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అమరావతిని దోపిడీకి రాజధానిగా మార్చేసిందని మండిపడ్డారు. కుంభకోణాలపై చర్యలకు ఉపక్రమిస్తే సహజంగానే చంద్రబాబు తట్టుకోలేరని, ఆయన పుత్రరత్నం అంతకన్నా తట్టుకోలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆర్థిక లావాదేవీలకు పవన్ మద్దతు ‘‘రాజధానిలో జరిగిన దోపిడీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధనానికి జవాబుదారీగా ఉండాల్సిన వారే దారుణంగా దోపిడీకి పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిందేనని ఎవరైనా అంటారు. కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎందుకు వత్తాసు పలుకుతున్నాడో... దోపిడీని పక్కదోవ పట్టించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడో అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్ మైండ్‌సెట్, జనసేన పార్టీ అజెండా మారలేదనిపిస్తోంది. జనసేన పార్టీ అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది. ఎవరి తీరు ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? గత ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో జరిగిన దోపిడీ గురించి ఆయన ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబుకు, ఆయన చేసిన ఆర్థిక లావాదేవీలకు జనసేన అధ్యక్షుడు మద్దతు ఇస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్‌కు కూడా ఏమైనా భాగస్వామ్యం ఉందా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ కుంభకోణాలకు అనుకూలం అనేది ప్రజలకు అర్థమైపోయింది. పవన్ కల్యాణ్ నివాసం కోసం 2 ఎకరాల భూమిని ఇచ్చింది, చంద్రబాబుకు అక్రమ నివాస భవనం ఇచ్చింది ఒక్కరే. వీరిద్దరికీ ఆర్థిక సంబంధాలున్నాయని స్పష్టం కావడానికి ఈ బంధం చాలు. ఆర్థిక సంబంధాలకు తోడు రాజకీయ బంధం, తెరవెనుక స్క్రిప్టు సంబంధాలున్నాయి’’ అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీ–బి పార్టీ జనసేన ‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే పవన్ కల్యాణ్ నవయుగ కాంట్రాక్టర్‌ను సమర్థించడంలో అర్థం ఏమిటి? విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ) సవరిస్తే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ అంశంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పవన్ కల్యాణ్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? ఇలాంటి అంశాలన్నీ చూస్తే చంద్రబాబుకు నారాయణ అనే వ్యక్తి భూములు, ఆస్తులపరంగా బినామీ అయితే రాజకీయ పరంగా పవన్ కల్యాణ్ బినామీ అనేది స్పష్టమవుతోంది. కొత్త పలుకు అనే రాధాకృష్ణ చిలుక పలుకులు పలుకుతూ ఉంటారు. పదేళ్ల కాలంలో బొత్స విజయనగరం జిల్లాను ఏ మేరకు అభివృద్ధి చేశారో చూడండి అంటున్నారు. మేము విశ్వాసంతో చెబుతున్నాం. చెట్టును, పుట్టను అడిగినా ఏ రంగంలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది. జనసేన పార్టీ ప్రజల కోసం మాట్లాడటం లేదు, టీడీపీ–బి పార్టీగా మాట్లాడుతోంది’’ అని మంత్రి బొత్స దుయ్యబట్టారు. రాజధానిలో జరిగిన కుంభకోణాలు, అక్కడ వరద రాగల పరిస్థితులు, ఇతర ప్రతికూల అంశాలన్నీ పరిశీలిస్తున్నామని, ఆ తరువాతే ఒక అభిప్రాయానికి వస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
అనుమతి లేకుండా ఎలా కట్టారు?
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్ట లోపల అనుమతి లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలకు సీఆర్డీఏ సమాయత్తమైంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణా నది నుంచి వంద మీటర్లలోపు నిర్మించిన భవనాలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. సుమారు 50 నిర్మాణాల్ని గుర్తించిన సీఆర్డీఏ అధికారులు వాటిలో 35 వరకూ అనుమతుల్లేకుండా నిర్మించినవేనని ఇప్పటివరకు నిర్ధారించారు. 28 నిర్మాణాలకు నోటీసులివ్వాలని నిర్ణయించిన అధికారులు శుక్రవారం పది భవనాలకు నోటీసులు పంపించారు. మిగిలిన వాటికి శనివారం నోటీసులు పంపనున్నారు. శుక్రవారం నోటీసులు పంపిన భవనాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథిగృహం కూడా ఉంది. ఎటువంటి అనుమతుల్లేకుండా కృష్ణా నది నుంచి వంద మీటర్ల లోపు జీ+1 భవనాన్ని రమేష్ నిర్మించినట్లు గుర్తించిన సీఆర్డీఏ నోటీసులిచ్చేందుకు ఆయనకు రెండుసార్లు ఫోన్ చేయగా స్పందించలేదని తెలిసింది. దీంతో విజయవాడలోని లింగమనేని ఎస్టేట్స్ కార్యాలయానికి వెళ్లి నోటీసులిచ్చేందుకు ప్రయత్నించినా అక్కడెవరూ తీసుకునేందుకు సిద్ధపడకపోవడంతో ఉండవల్లిలోని అక్రమ నిర్మాణం వద్దకే వెళ్లి అక్కడి గోడకు నోటీసు అంటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ ఆ నోటీసులో పేర్కొంది. అన్ని చట్టాలు ఉల్లంఘించి.. తమ అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్ రూల్స్ 2012, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి కేపిటల్ సిటీ జోనింగ్ రెగ్యులేషన్‌కు–2016కి విరుద్ధంగా లింగమనేని నిర్మాణాలున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. నేల మీద, మొదటి అంతస్తులో ఆర్సీసీ నివాస భవనం, నేల అంతస్తులో ఆర్సీసీ గది, హెలీప్యాడ్ నిర్మాణాల్ని కృష్ణా నది నుంచి వంద మీటర్లలోపు నిర్మించారని, ఇవికాక అనుమతి లేకుండా పది తాత్కాలిక షెడ్లను నిర్మించారని అధికారులు తెలిపారు. వారంలోపు నోటీసుపై స్పందించి సంజాయిషీ ఇవ్వనిపక్షంలో తగిన చర్య తీసుకుంటామని, ఒకవేళ సంజాయిషీ సరిగా లేకపోయినా చర్య తప్పదని నోటీసులో స్పష్టం చేశారు. లింగమనేని రమేష్ భవనంతోపాటు పది భవనాలకు సీఆర్డీఏ సెక్షన్ 115(3) ప్రకారం శుక్రవారం నోటీసులిచ్చిన సీఆర్డీఏ అధికారులు సంజాయిషీ ఇవ్వకున్నా, ఇచ్చిన సంజాయిషీ సరిగా లేకున్నా సెక్షన్ 115(2) మేరకు తొలగింపు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనుమతుల్లేని భవన యజమానుల జాబితా చందన కేదారేశ్వరరావు ఏ అనుమతుల్లేకుండానే జీ+2 అతిథిగృహం, బీజేపీకి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రెండు అతిథిగృహాలు నిర్మించినట్లు గుర్తించారు. లోటస్ హోటల్, ఫిషర్మెన్ అసోసియేషన్, గణపతి సచ్చిదానంద ఆశ్రమం, శ్రీ రెడ్డి, ఇస్కాన్ టెంపుల్, సాగర్ మినరల్ వాటర్ ప్లాంట్, సుంకర శివరామకృష్ణ, సత్యానంద ఆశ్రమం, అక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పాతూరి సుధారాణి, తులసి గార్డెన్స్, వేదాద్రి మహర్షి తపోవనం, డాక్టర్ మాగంటి ప్రసాద్, లక్ష్మీనారాయణ, నకంటి వెంకట్రావు, సీహెచ్ వేణుగోపాలరావు, చిగురు అనాథ బాలల ఆశ్రమం, సిటీ కేబుల్ మధుసూదనరావు, ఎం.సత్యనారాయణ, మత్స్యకారుల అసోసియేషన్, శివక్షేత్రంలో అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. మందడం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల పరిధిలో మరికొన్ని ఇళ్లు కూడా అనధికారికంగా నిర్మించినట్లు గుర్తించారు. వీటిలో కొన్నింటికి పంచాయతీ అనుమతులు, ఇతర అనుమతులున్నా స్థూలంగా నదీ పరిరక్షణ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలకు వ్యతిరేకంగానే ఉన్నాయని నిర్ధారించారు. వీటిలో కొన్నింటికి ఇప్పటికే నోటీసులిచ్చిన సీఆర్డీఏ అధికారులు సోమవారంలోపు మిగిలిన వాటికి ఇవ్వనున్నారు. చంద్రబాబు నివాసం వద్ద హైడ్రామా తాడేపల్లి రూరల్: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడమైన లింగమనేని రమేష్ అతిథిగృహానికి నోటీసులు జారీ చేసేందుకు సీఆర్డీఏ అధికారులు శుక్రవారం అక్కడకు చేరుకున్న సందర్భంగా వారిని తొలుత లోపలికి అనుమతించలేదు. దీంతో దాదాపు గంటన్నరపాటు హైడ్రామా నెలకొంది. సదరు ఇంటి యజమాని అయిన లింగమనేని రమేష్‌కు నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి లోపలకు వెళ్లాలని అడగ్గా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు చాలాసేపు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. నోటీసులివ్వడానికి వచ్చిన సీఆర్డీఏ అధికారులను లోపలకి అనుమతించట్లేదంటూ మీడియాలో ప్రచారం జరగడంతో.. వెనక్కి తగ్గిన సిబ్బంది ఎట్టకేలకు సీఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డిని, ఆయన వాహనాన్ని, మరో సీఆర్డీఏ అధికారిని లోపలికి అనుమతించారు. మొదట బిబి2 గేటు వద్ద నోటీసు అంటించిన నరేంద్రనా«థ్‌రెడ్డి ఉన్నతాధికారులతో ఫోనులో మాట్లాడారు. చంద్రబాబు నివాసం ఉండే ప్రధాన గేటుకు అంటించమని సూచించడంతో మరికొంతసేపు హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు నరేంద్రనాథ్‌రెడ్డి ప్రధాన గేటు వద్ద కూడా నోటీసు అంటించి తన వాహనంలో విజయవాడకు తిరిగి వెళ్లిపోయారు. క్షుణ్ణంగా పరిశీలించి.. న్యాయ సలహా తీసుకున్నాకే నోటీసులు నోటీసులివ్వడానికి ముందు ఆయా భవనాల పరిస్థితిని సీఆర్డీఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రదేశాల్లో ఏ భవనాలు, ఎన్ని అంతస్తులు, ఎన్ని షెడ్లు, ఇతర నిర్మాణాలున్నాయో పరిశీలించారు. వాటిలో కొన్నింటికి అనుమతులున్నట్లు చెబుతుండడంతో అవి ఎలాంటి అనుమతులో పరిశీలించారు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్నాక సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదించి పక్కాగా నోటీసులు రూపొందించారు. కొన్ని భవనాలకు పంచాయతీలు అనుమతులివ్వగా, కొన్నింటికి గతంలోని ఉడా పరిమితమైన అనుమతులిచ్చినట్లు, మరికొన్నింటికి నిరభ్యంతర పత్రాలున్నట్లు గుర్తించారు. అయితే ఏదో చిన్నవాటికి అనుమతులు తీసుకుని ఆ ముసుగులో భారీ కట్టడాలు నిర్మించినట్లు తేల్చారు. -
అవినీతి పై సమగ్ర నివేదిక ఇవ్వండి : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాజధానిలో చోటుచేసుకున్న స్కాములపై లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట అంతులేని అవినీతి సాగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భూ సమీకరణ, భూముల కేటాయింపు, చేపట్టిన పనులు, వాటి కేటాయింపులు వంటి అంశాల్లో అవినీతి కనిపిస్తోందన్నారు. వీటన్నింటినీ లోతుగా పరిశీలించాలని, బాధ్యులెవరో గుర్తించాలని, ప్రభుత్వానికి ఎంత మేరకు నష్టం జరిగిందో సేకరించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రైతులు, ప్రభుత్వం, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీఆర్డీఏ వ్యవహరించాలని, ఏ పని చేసినా ప్రభుత్వానికి మంచిపేరు రావాలని స్పష్టం చేశారు. ఒక మంచి కార్యక్రమం చేస్తున్న సంతృప్తి కలిగేలా చూడాలన్నారు. ఎక్కడా అవినీతికి వత్తాసు పలకవద్దని, దీనిని ఏ దశలోనూ ప్రోత్సహించవద్దని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో అధికారులు తాము తీసుకెళ్లిన నివేదికలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చూపించి వాటిని వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ఆ విషయాలను విని ప్రతి అంశంలోనూ చోటుచేసుకున్న అవినీతిపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని, వీటిలో అక్రమాలకు బాధ్యులెవరు, ఎంత నష్టం జరిగిందనే సమాచారం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, అదనపు కమిషనర్లు విజయకృష్ణన్, రామమనోహరరావు పాల్గొన్నారు. ఎన్ని వేల కోట్లు లూటీ అయ్యాయో : మంత్రి బొత్స రాజధాని నిర్మాణం ముసుగులో ఎన్ని వేల కోట్ల ప్రజాధనం లూటీ అయ్యిందో అంచనాకు అందడం లేదని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో సమీక్ష ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అవినీతి కూపం ఎంత లోతు ఉందో తవ్వి తీయాల్సి ఉందన్నారు. ఏది ముట్టుకున్నా పెద్ద పెద్ద స్కాంలు బయటకొస్తున్నాయని చెప్పారు. భూములను సేకరించి వాటిని ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేశారని, తాబేదార్లు, చుట్టాలు, కావాల్సిన వాళ్లకు ఇచ్చేశారని తెలిపారు. రైతులకు ప్లాట్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయన్నారు. ఖర్చుకు మించి ఆదాయాన్ని దుర్వినియోగం చేశారని.. ముందు అవినీతి కూపం నుంచి సీఆర్డీఏ బయటపడిన తరువాత నిర్మాణాలపై దృష్టి పెడతామన్నారు. అక్రమ కట్టడాల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. మొత్తం 53 వేల ఎకరాల్లో రైతులవి, ప్రభుత్వానివి, వివాదాల్లో చిక్కుకున్నవి కూడా ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ జరిగిన నిర్మాణాల్లో కూడా భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. -
ప్రజావేదిక కూల్చివేత
-
ప్రజావేదిక కూల్చివేత
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం విదితమే. సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయకృష్ణన్ నేతృత్వంలో అధికారుల బృందం మంగళవారం సాయంత్రం ప్రజావేదిక వద్దకు చేరుకుని కూల్చివేతకు అవసరమైన సూచనలు జారీ చేశారు. అందులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు, మైక్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సామగ్రి, పూల మొక్కలు కుండీలు సహా అన్నింటి వివరాలు నమోదు చేసుకుని ఆ తర్వాత కూల్చివేత పనులు మొదలు పెట్టారు. పూల కుండీలన్నింటినీ రాయపూడి సమీపంలోని సీఆర్డీఏ నర్సరీకి, మిగిలిన వస్తువులన్నింటినీ సచివాలయానికి తరలించారు. ఆ తర్వాత జేసీబీలతో క్యాంటీన్, వంట షెడ్, ప్రహరీని కూలగొట్టారు. తెల్లారే సరికి మొత్తం ప్రజావేదిక భవనాన్ని కూల్చేందుకు సీఆర్డీఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉండవల్లి చేరుకున్న చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి 11.30 గంటలకు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఉండవల్లిలోని ప్రజావేదికను సీఆర్డీఏ అధికారులు కూలగొడుతుండతుండడంతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు విజయవాడకు చేరుకోవడంతో విమానాశ్రయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హడావుడి చేశారు. చంద్రబాబుతో పాటు కార్యకర్తలు, నేతలు కూడా ఉండవల్లికి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు కృష్ణా కరకట్ట వద్ద వారిని అడ్డుకున్నారు. కరకట్టపైన చంద్రబాబు కాన్వాయ్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
మల్లె తోట తొలగించిన సీఆర్డీయే అధికారులు
అమరావతి: రాజధాని ప్రాంతంలోని నిడమర్రులో సీఆర్డీయే అధికారులు పొక్లయిన్లతో మల్లె తోటను తొలగించారు. పాతికేళ్లుగా తోటను నమ్ముకుని బతుకుతున్నామని, తొలగించవద్దంటూ రైతు రామిరెడ్డి వేడుకున్నా అధికారులు కనికరించలేదు. భూమి యజమాని రాజధానికి భూమి ఇచ్చాడంటూ తోటను ధ్వంసం చేశారు. -
రాజధాని డిజైన్లకు మళ్లీ మార్పులు
సాక్షి, అమరావతి : మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్లకు సీఎం చంద్రబాబు మళ్లీ కొన్ని మార్పులు సూచించారు. రెండురోజుల క్రితం ఫోస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్లపై జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చించారు. పాలనా నగరం మీదగా నిర్మించాలనుకుంటున్న జలమార్గం, అందుకు అవసరమైన నీరు, రాజధాని భవిష్యత్తు జల అవసరాలు, పులిచింతల ప్రాజెక్టు దిగువన నిర్మించబోయే బ్యారేజీ నుంచి వచ్చే నీటిపై జలవనరుల శాఖ, బ్లూ, గ్రీన్ కన్సల్టెంట్లతో చర్చించి తుది ప్రణాళికకు స్పష్టమైన రూపు ఇవ్వాలని బాబు సూచించారు. మరోవైపు ఫోస్టర్ ఇచ్చిన వ్యూహ డిజైన్లను శనివారం అసెంబ్లీలో ప్రదర్శించాలని సమావేశంలో నిర్ణయించారు. -
వెయ్యి కోట్లకు బాండ్ల జారీ
-
వెయ్యి కోట్లకు బాండ్ల జారీ
రాజధానిలోని మూడు జోన్ల లేఅవుట్లలో వసతులకు రూ.2,981 కోట్లు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకోసం తొలివిడతగా రూ.వెయ్యికోట్ల మేర బాండ్లను జారీ చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) అథారిటీ నిర్ణయించింది. రాజధానికోసం భూములిచ్చిన రైతులకు సంబంధించి.. తొలిదశలో మూడు జోన్లలోని 8 గ్రామాలకు చెందిన భూసమీకరణ స్థలాల లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన డిజైన్లకు ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.2,981 కోట్లు ఖర్చవుతుందని అంచనా. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆమోదించిన అంశాలివీ.. ► మూడు జోన్లకుగాను భూసమీకరణ లేఅవుట్లలో వసతుల కల్పనకు కన్సల్టెంట్లు జీఐఐసీ–ఆర్వీ అసోసియేట్స్ ఇచ్చిన డిజైన్లకు ఆమోదం. 29 రాజధాని గ్రామాల్ని 13 జోన్లుగా విభజించి వసతుల కల్పనకు ప్రణాళిక రూపొందించిన కన్సల్టెన్సీ సంస్థలు. ► 3జోన్లలోని 5.5 లక్షల నివాసాలు, 1.2 లక్షల వాణిజ్య అవసరాలకోసం ప్రతిరోజూ 107 ఎంఎల్డీ నీటి సరఫరాకు ప్రణాళిక. ► 250 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అవసరమైన కేబుళ్లను భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు చిన్న విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణా నికి అనుమతి. వరదనీటి పారుదలకోసం 278 కి.మి మేర కాలువల నిర్మాణం. ► భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అభివృద్ధి చేసి అందించే ప్రతి ప్లాటుకు ప్రభుత్వమే స్టాంపు డ్యూటీ, రిజి స్ట్రేషన్ ఖర్చు భరించాలని నిర్ణయం. ► స్విస్ చాలెంజ్ విధానంలో అమరావతి పరిధిలోని 6.84 చ కిలోమీటర్ల విస్తీర్ణంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఆమోదం. ► అమరావతిలో ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న ప్రైవేటు వర్సిటీల్లో కొన్నింటిని విశాఖ, తిరుపతిలో పెట్టేలా ప్రోత్సహించాలని నిర్ణయం. ► ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో తాత్కాలిక సచివాలయాన్ని ట్రాన్సిట్ సచివాలయంగా పిలవాలని నిర్ణయం. ► సచివాలయంలో సీఎం కార్యాలయం ఉన్న ఒకటో బ్లాకులో మరో అంతస్తు నిర్మాణానికి అనుమతి. అందులో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు. ఆ ‘మెట్రో’లు మంజూరు కాలేదు: కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను ఇంకా మంజూరు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టుల స్థితిగతులపై ఎంపీలు కొత్తపల్లి గీత, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎస్ రాజేంద్రన్, హరి మాంజీలు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విజయవాడ మెట్రోకు భూసేకరణ ఖర్చుతో పాటు మొత్తం రూ. 6,823 కోట్లు అంచనా వ్యయం అవుతుందని వివరించారు. ఇక విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 9,736 కోట్ల అంచనా వ్యయం అవుతుందన్నారు. -
తాత్కాలిక సచివాలయానికి రెండు టెండర్లు
10న టెండర్లు ఖరారు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, మల్కాపురం గ్రామాల పరి ధిలో నిర్మించే తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి రెండు టెండర్లు దాఖలయ్యాయి. ఆరు భవనాలకు సంబంధించిన మూడు ప్యాకేజీలకు ఎల్ అండ్ టీ, షాపూర్జీ-పల్లోంజీ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థల్లో ఎల్1(తక్కువకు కోడ్ చేసిన)గా నిలిచిన సంస్థకు ఈ నెల 10న టెండర్ ఖరారు చేస్తామని, అదేరోజు నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. సచివాలయం నిర్మాణానికి టెండర్లు దాఖలు సమయం బుధవారంతో ముగియడంతో సీఆర్డీఏ అధికారులు విజయవాడ కార్యాలయంలో వాటిని తెరిచారు. కాగా, ఈ రెండు సంస్థకు సంబంధించిన సాంకేతిక అర్హతలను ఈ నెల 10లోపు నిర్ధారించనున్నారు. ఈ రెండూ టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధిస్తే పదో తేదీ ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్(ఫైనాన్షియల్ బిడ్)లు తెరుస్తారు. మూడు ప్యాకేజీలున్నాయి కాబట్టి రెండు కంపెనీలూ ఈ పనులను చేజిక్కించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పనులు దక్కించుకున్న సంస్థ ఐదు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఒక శాతం ప్రోత్సాహకం, నాలుగు నెలల్లో పూర్తి చేస్తే రెండు శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని సీఆర్డీఏ నిర్ణయించింది. జూన్‌లోపు సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. -
రాజధానికి సహకరించాలి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు, పార్టీలు రాజధాని నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. అనుకూల వాతావరణం లేకపోతే ఇన్నాళ్లూ పడిన శ్రమ వృథా అవుతుందని, పెట్టుబడులు రావని చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సీఆర్డీఏ అథారిటీ తొలి సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. తాను ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులకోసం ప్రయత్నిస్తుంటే వాళ్లు ప్రజల్ని రెచ్చగొట్టి రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. అలజడులు సృష్టిస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌ల ఎంపిక స్విస్ చాలెంజ్ విధానంలో జరుపుతున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో కాన్సెప్ట్ సిటీల నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు, న్యాయ విశ్వ విద్యాలయం ఒకేచోట ఏర్పాటుచేసి అక్కడే ప్రపంచానికి అవుట్సోర్సింగ్ అందించే లీగల్ సర్వీసెస్‌ను కూడా అందుబాటులో ఉండేలా జస్టిస్ సిటీ నిర్మాణం చేపడతామన్నారు. నెలరోజుల్లోపు అటవీ భూముల క్లియరెన్స్ పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే తాను కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. పచ్చదనమే లక్ష్యం: సీఎం రాష్ట్రంలో 23 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 40 శాతానికి తీసుకెళ్లే లక్ష్యంతో అందరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా సీఆర్డీఏ పరిధిలోని అటవీ ప్రాం తంలో విత్తనాలు జల్లే కార్యక్రమాన్ని శుక్రవారమిక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జెండా ఊపి ప్రారంభించారు. రాజధానిలో కొత్త పరిశ్రమలు: మిశ్రా రాజధాని అమరావతి రీజియన్‌లో ఎనర్జీ, రవాణా, అర్బన్‌డెవలప్‌మెంట్, ఎలక్ట్రిసిటీ సెక్టార్లకు చెందిన పలు పరిశ్రమల స్థాపనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పరిశ్రమల శాఖ డెరైక్టర్ మిశ్రా తెలిపారు.