రాజధానికి సహకరించాలి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు, పార్టీలు రాజధాని నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. అనుకూల వాతావరణం లేకపోతే ఇన్నాళ్లూ పడిన శ్రమ వృథా అవుతుందని, పెట్టుబడులు రావని చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ తొలి సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
తాను ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులకోసం ప్రయత్నిస్తుంటే వాళ్లు ప్రజల్ని రెచ్చగొట్టి రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. అలజడులు సృష్టిస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌ల ఎంపిక స్విస్ చాలెంజ్ విధానంలో జరుపుతున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో కాన్సెప్ట్ సిటీల నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
హైకోర్టు, న్యాయ విశ్వ విద్యాలయం ఒకేచోట ఏర్పాటుచేసి అక్కడే ప్రపంచానికి అవుట్‌సోర్సింగ్ అందించే లీగల్ సర్వీసెస్‌ను కూడా అందుబాటులో ఉండేలా జస్టిస్ సిటీ నిర్మాణం చేపడతామన్నారు. నెలరోజుల్లోపు అటవీ భూముల క్లియరెన్స్ పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే తాను కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు.
పచ్చదనమే లక్ష్యం: సీఎం
రాష్ట్రంలో 23 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 40 శాతానికి తీసుకెళ్లే లక్ష్యంతో అందరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలోని అటవీ ప్రాం తంలో విత్తనాలు జల్లే కార్యక్రమాన్ని శుక్రవారమిక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జెండా ఊపి ప్రారంభించారు.
రాజధానిలో కొత్త పరిశ్రమలు: మిశ్రా
రాజధాని అమరావతి రీజియన్‌లో ఎనర్జీ, రవాణా, అర్బన్‌డెవలప్‌మెంట్, ఎలక్ట్రిసిటీ సెక్టార్లకు చెందిన పలు పరిశ్రమల స్థాపనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పరిశ్రమల శాఖ డెరైక్టర్ మిశ్రా తెలిపారు.