ఆ భూములతో వ్యాపారం చేస్తాం
సీఆర్‌డీఏ సమీక్షలో సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చే సింగపూర్, జపాన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని వ్యాపారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రైతుల నుంచి సేకరించిన భూమిని ప్రైవేటు కంపెనీలకు అభివృద్ధికిచ్చి వారితో కలిసి తాము కూడా పెట్టుబడులు పెట్టి లాభాలు అర్జిస్తామన్నారు. ఇందుకోసం అమరావతి డెవలప్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేస్తామన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ పెట్టుబడులు ఎంత పెట్టాలి, ఏ నిష్పత్తిలో వ్యాపారం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు ఇలా టౌన్‌షిప్‌లు కట్టి లాభాలు సాధించాయని, సింగపూర్‌లోని తమాసిన్ కంపెనీ ఇదే తరహాలో ఏడు లక్షల కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు. రాజధాని కోసం రైతులు ఇప్పటికే 33 వేల ఎకరాలు ఇచ్చారని, ఈ ప్రాంతంలోనే మరో 50 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయిస్తామని చెప్పారు ఈ 83 వేల ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు అభివృద్ధికిచ్చి, అందులో తాము పెట్టుబడులు పెడతామన్నారు.
వచ్చే లాభాలను పంచుకుంటామని, రియల్ ఎస్టేట్ కంపెనీలాగే పనిచేస్తామని తెలిపారు.2018 నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను భూసేకరణ ద్వారా తీసుకోవడానికి డబ్బు లేదన్నారు.
పండుగలా శంకుస్థాపన
రాజధాని శంకుస్థాపన కార్యక్రమం దసరా పండుగలా జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన సీఆర్‌డీఏ కమిటీతో సమీక్ష నిర్వహించారు. శంకుస్థాపనకు ప్రధాని వస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. శంకుస్థాపనకు అన్ని గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామంలోని కొంత మట్టి తెచ్చి అమరావతి మట్టిలో కలిపి భావోద్వేగం నింపాలన్నారు.
అవగాహన ఒప్పందాలు ఖరారు
ఇంధన రంగంలో ఉజ్వల భవితకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే కాకినా డ డీప్ సీ వాటర్ పోర్టులో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజ యవాడ గేట్ వే హోటల్‌లో సీఎం సమక్షంలో ఏపీ గ్యాస్ డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ , గెయి ల్, షెల్, ఇంజీ కంపెనీలు రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.రానున్న 13నెలల్లో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మిస్తామని బాబు హామీ ఇచ్చారు.