పోలాకి: పచ్చని ప్రాంతాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి ప్రజల నోట్లో బుగ్గిపోసే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జపాన్, సింగపూర్‌లు తప్ప ఇక్కడి జనం కనిపించరా?.. వారి ఆవేదన వినిపించదా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రశ్నించారు. బుధవారం పోలాకి మండలంలోని థర్మల్ ప్రతిపాదిత గ్రామాల్లో ఆయన పర్యటించారు. మందుగా సన్యాసిరాజుపేట ప్రాంతంలోని భూములను పరిశీలించారు. వాటి వివరాల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం తోటాడ, చెల్లాయివలస, చీడివలస తదితర గ్రామాల్లో ఏర్పాటుచేసిన సభల్లో మాట్లాడుతూ ఇప్పటికే పైడిభీమవరంలో రసాయన, ఫార్మా కంపెనీలు పెట్టి కాలుష్యప్రాంతంగా మార్చిన పాలకులు ఇప్పుడు సోంపేట, కాకరాపల్లి, పోలాకి ప్రాంతాలను థర్మల్ ప్లాంట్లతో కాలుష్య కసారాలుగా మర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను ప్రయోగశాలగా మార్చుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు ఇస్తామన్న ప్యాకేజీల విషయంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలన్నారు. అంగన్వాడీ వర్కర్లు, యానిమేటర్లు, మధ్యాహ్న భోజన పధక నిర్వాహకుల డిమాండ్లు తీర్చటం చేతకాని చంద్రబాబుకు సింగపూర్ ప్లాన్లు ఎందుకని ఎద్దేవావేశారు.
ఎలాంటి ఉద్యమ నేపథ్యంలేని పోలాకి ప్రాంతంలో ప్రజల ఆశాంతిని అర్థం చేసుకుని థర్మల్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి బవిరి క్రిష్ణమూర్తి మాట్లాడుతూ థర్మల్ ప్రతిపాదనను విరమించుకోకపోతే సోంపేట, కాకరాపల్లిలకు మించిన ఉద్యమాన్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటియూ నాయకుడు ఆర్.సురేష్‌బాబు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు టి.తిరుపతిరావు, గొల్లలవలస సర్పంచ్ ప్రతినిధి పంచిరెడ్డి సింహాచలం, థర్మల్ వ్యతిరేక ఉద్యమ నాయకులు కోట అప్పారావు, ఉప్పాడ శాంతారావు, అలిగి రామారావు తదితరులు పాల్గొన్నారు.
జపాన్ తప్ప జనం అక్కర్లేదా?
Published Thu, Apr 2 2015 4:11 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement