జపాన్, సింగపూర్ తరహాలో రాణించాలి
ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో 2016ను ప్రారంభించిన మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: జపాన్, సింగపూర్, ఇజ్రాయిల్ వంటి దేశాలకు పరిమిత వనరులున్నా వాటి ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో మన్ననలు పొందాయని, అదే తరహాలో రాష్ట్రానికి చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈలు) విజయం సాధించాలని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నగరంలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(ఎంఎస్‌ఎఈ ఎక్స్‌పో- 2016)ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఎగుమతులు, దిగుమతుల సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్రం నుంచి ఎగుమతులకు ఉన్న అవకాశాలను గురిస్తామన్నారు. నాణ్యత, మన్నికకు పెద్దపీట వేస్తూ స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను ప్రోత్సహించాల్సి ఉందన్నారు.
ఎక్స్‌పో -2016 తరహాలో జిల్లాస్థాయిలోనూ ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహించాలని జూపల్లి సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని, టీఎస్‌ఐపాస్ పారిశ్రామిక విధానం ద్వారా ఎంతో పారదర్శకతతో 356 పరిశ్రమలకు అనుమతి ఇచ్చి రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో 90 వేల మందికి ఉదోగ్య అవకాశాలు కల్పించామని చెప్పారు. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, కాన్ఫడరేషన్ ఆఫ్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గిరిజారెడ్డి, బీహెచ్‌ఈఎల్ జీఎం ఆర్.పార్థసారథి, ఎంఎస్‌ఎంఈ బాలానగర్ డెరైక్టర్ డి.చంద్రశేఖర్, డిప్యూటీ డెరైక్టర్ బి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.