సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా మరోసారి జపాన్ పాస్‌పోర్టు ఎంపికయింది. ‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’లో ఇలా జపాన్ పాస్‌పోర్ట్ ఎంపికవడం ఇది వరుసగా మూడోసారి. ఇందుకు కారణం ఈ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా ప్రపంచంలో 191 దేశాలు తిరిగి రావచ్చు. ఆ తర్వాత సింగపూర్ పాస్‌పోర్ట్ రెండో స్థానంలో, ఆ తర్వాత దక్షిణ కొరియా, జర్మనీ దేశాల పాస్‌పోర్టులు మూడో స్థానంలో ఎంపికయ్యాయి.
సింగపూర్ పాస్‌పోర్టు ద్వారా ప్రపంచంలో వీసా లేకుండా 190 దేశాలు, దక్షిణ కొరియా, జర్మనీ పాస్‌పోర్టుల ద్వారా 189 దేశాలు తిరిగి రావచ్చు. అమెరికా, బ్రిటన్ దేశాలు స్థానాలు క్రమంగా ఇండెక్స్‌లో పడిపోతూ వస్తున్నాయి. ఈ రెండు దేశాలతోపాటు బెల్జియం, గ్రీస్, నార్వే దేశాల పాస్‌పోర్టులు ఎనిమిదవ స్థానంలో ఎంపికయ్యాయి. ఈ ఐదు దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 184 దేశాలు తిరిగి రావచ్చు. అమెరికా, బ్రిటన్ దేశాలు 2015లో మొదటి స్థానంలో ఉండగా, గతేడాది ఆరవ స్థానంలోకి పడిపోయాయి.
వీసా అవసరం లేకుండా 188 దేశాలను తిరిగొచ్చే అవకాశం ఉన్న ఫిన్‌లాండ్, ఇటలీ దేశాల పాస్‌పోర్ట్‌లు నాలుగో స్థానంలో, 187 దేశాలు తిరిగొచ్చే అవకాశం ఉన్న డెన్మార్క్, లగ్జెమ్‌బర్గ్, స్పెయిన్ ఐదో స్థానంలో, 186 దేశాలు తిరిగొచ్చే అవకాశం ఉన్న ఫ్రాన్స్, స్వీడన్ ఆరవ స్థానంలో, ఆస్ట్రియా, ఐర్లాండ్, నెదర్లాండ్, పోర్చుగల్, స్విడ్జర్లాండ్ పాస్‌పోర్టులు ఏడో స్థానంలో ఎంపికయ్యాయి. ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్ తొమ్మిదవ స్థానంలో, హంగరి, లిథ్వానియా, స్లొవాకియా పాస్‌పోర్ట్‌లు పదవ స్థానంలో ఎంపికయ్యాయి. వీసా అవసరం లేకుండా 58 దేశాలు మాత్రమే తిరిగొచ్చే అవకాశం ఉన్న భారత పాస్‌పోర్ట్ 84వ స్థానంలో ఎంపికయింది. ఇది 2019లో 86వ స్థానంలో ఎంపికకాగా ఈ ఏడాది రెండు స్థానాలు మెరుగుపడింది.
Comments
Please login to add a commentAdd a comment