రాజధానిలో భూములిస్తాం.. భవనాలు నిర్మించండి
కంపెనీలను తీసుకురండి.. ఉద్యోగాలివ్వండి
స్థలాలు విక్రయించుకోండి.. లీజుకు ఇచ్చుకోండి
సింగపూర్ ప్రభుత్వానికి చంద్రబాబు ఆహ్వానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ వ్యవహారం సామాన్యులకు అర్థం కాని మాయాజాలంలా ఉంది. ఇందులో మొత్తం పెత్తనాన్ని సింగపూర్ కంపెనీలకే ప్రభుత్వం కట్టబెట్టనుంది. రాజధాని ప్రాంతంలో నిర్మించిన భవనాల్లోని స్థలాన్ని విక్రయించుకొనే అధికారం సింగపూర్ సంస్థలకే దక్కనుంది. రాజధాని నిర్మాణం చేపట్టాలంటూ సింగపూర్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. సింగపూర్ ప్రభుత్వం తరపున రాజధాని నిర్మాణానికి దరఖాస్తు చేయాల్సిందిగా ఆ దేశ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌ను మంగళవారం కోరారు. నూతన రాజధానిలో భూములు ఇస్తామని, నిర్మాణాలు చేపట్టడంతోపాటు ఆ నిర్మాణాల్లోకి పెట్టుబడులు పెట్టే కంపెనీలను తీసుకురావాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని కోరారు.కంపెనీలను తీసుకురావడంతో పాటు ఉద్యోగాలను కల్పించాలని సీఎం సూచించారు.
ప్రాథమిక చర్చల్లో వాటా అంశం
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ (ఏపీఐఐసీ లేదా సీఆర్‌డీఏ), సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు సంయుక్తంగా నూతన రాజధాని నిర్మాణం చేపట్టనున్నారు. హైటెక్ సిటీ నిర్మాణాన్ని ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఇందులో ఎల్‌అండ్‌టీకి 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటాను చంద్రబాబు సర్కారు కేటాయించింది. ఎల్‌అండ్‌టీకి లాభాలు వస్తేనే ఏపీఐఐసీకి 11 శాతం మేర పంపిణీ చేయాలని అప్పట్లో నిర్ణయించారు. హైటెక్ సిటీలోని స్పేస్‌ను కంపెనీలకు ఎల్‌అండ్‌టీయే విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం చేసిన విషయం తెలిసిందే. ఏపీ రాజధాని నిర్మాణానికి ఆ విధానాన్నే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. సింగపూర్‌కు చెందిన కంపెనీనే మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయనున్నారు. తరువాత ఆ కంపెనీయే సింగపూర్‌కు చెందిన నిర్మాణ సంస్థలను తీసుకురానుంది. మాస్టర్ డెవలపర్‌తో ఎల్‌అండ్‌టీ తరహాలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఎవరికి ఎంత వాటా అనే అంశం ఇంకా ప్రాథమిక చర్చల్లోనే ఉందని, దీనిపై ఒక నిర్ణయానికి రాలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిర్మాణం పూర్తి చేసిన తరువాత ఆ భవనాల్లోకి సంస్థలను తీసుకొచ్చే బాధ్యతను సింగపూర్ కంపెనీలకే అప్పగిస్తారని వెల్లడించారు.
భవనాల్లోని స్థలాలను కంపెనీలకు విక్రయించడం లేదా 99 ఏళ్లకు లీజుకు ఇచ్చే అధికారం సింగపూర్‌కు చెందిన మాస్టర్ డెవలపర్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. రాజధానిలో ఏది ఎక్కడ? అనే వివరాలను సింగపూర్ కంపెనీలు ఇవ్వాల్సి ఉంది. నూతన రాజధాని ప్రాంతంలో ఏ నిర్మాణాలను ఎక్కడ చేపట్టాలనే వివరాలతో కూడిన డేటాను సింగపూర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. ఆ వివరాలు వచ్చిన తరువాత రాజధాని ప్రాంత మాస్టర్ ప్రణాళికను నోటిఫై చేయాల్సి ఉందని తెలిపారు. రాజధాని ప్రాంత మాస్టర్ ప్రణాళికకు రూపకల్పన చేసిన సంస్థలు స్విస్ చాలెంజ్‌లో పాల్గొనకూడదనే నిబంధన ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వాన్ని దరఖాస్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు వివరించాయి.
సింగపూర్ కంపెనీలకే పెత్తనం!
Published Wed, Jul 22 2015 1:37 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement