భారతదేశం దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఈ తరుణంలో సింగపూర్ & భారతదేశం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో ఏకంగా 35.6 బిలియన్ డాలర్లకు (రూ. 2.96 లక్షల కోట్లు) చేరింది. ఇది గత ఏడాది కంటే 18.2 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది.
సింగపూర్‌లో జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) మూడో అంతర్జాతీయ సదస్సులో హైకమిషన్‌లోని మొదటి కార్యదర్శి (కామర్స్) టీ ప్రభాకర్ మాట్లాడుతూ.. సింగపూర్ భారతదేశానికి ఎనిమిదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.. 2022-23లో మొత్తం వాణిజ్యంలో దేశం వాటా 3.1 శాతంగా ఉందని అన్నారు.
2022-23లో సింగపూర్ నుంచి దిగుమతులు 23.6 బిలియన్ డాలర్లకు చేరి 24.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎగుమతుల పరంగా భారత్‌కు సింగపూర్ ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు బాగున్నాయి. దీంతో భారతదేశంలోకి ఎఫ్‌డిఐ పెట్టుబడులు కూడా 17.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ప్రభాకర్ పేర్కొన్నారు.
టెక్నాలజీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త రంగాలలో రెండు దేశాల మధ్య విస్తృతమైన వ్యూహాత్మక సహకారాన్ని గురించి కూడా ప్రభాకర్ హైలైట్ చేశారు. రెండు రోజులు జరిగిన సదస్సులో వాణిజ్యం, సాంకేతిక సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment