ప్రజావేదిక భవనాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం విదితమే. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ విజయకృష్ణన్ నేతృత్వంలో అధికారుల బృందం మంగళవారం సాయంత్రం ప్రజావేదిక వద్దకు చేరుకుని కూల్చివేతకు అవసరమైన సూచనలు జారీ చేశారు.
అందులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు, మైక్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సామగ్రి, పూల మొక్కలు కుండీలు సహా అన్నింటి వివరాలు నమోదు చేసుకుని ఆ తర్వాత కూల్చివేత పనులు మొదలు పెట్టారు. పూల కుండీలన్నింటినీ రాయపూడి సమీపంలోని సీఆర్‌డీఏ నర్సరీకి, మిగిలిన వస్తువులన్నింటినీ సచివాలయానికి తరలించారు. ఆ తర్వాత జేసీబీలతో క్యాంటీన్, వంట షెడ్, ప్రహరీని కూలగొట్టారు. తెల్లారే సరికి మొత్తం ప్రజావేదిక భవనాన్ని కూల్చేందుకు సీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఉండవల్లి చేరుకున్న చంద్రబాబునాయుడు
విదేశీ పర్యటన ముగించుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి 11.30 గంటలకు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఉండవల్లిలోని ప్రజావేదికను సీఆర్‌డీఏ అధికారులు కూలగొడుతుండతుండడంతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు విజయవాడకు చేరుకోవడంతో విమానాశ్రయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హడావుడి చేశారు. చంద్రబాబుతో పాటు కార్యకర్తలు, నేతలు కూడా ఉండవల్లికి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు కృష్ణా కరకట్ట వద్ద వారిని అడ్డుకున్నారు. కరకట్టపైన చంద్రబాబు కాన్వాయ్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment