సాక్షి, అమరావతి: కృష్ణా కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశ వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు స్వయంగా అక్రమ కట్టడంలో నివాసం ఉండడమే కాకుండా అధికారంలో ఉండగా దానిపక్కనే నిబంధనలకు విరుద్ధంగా మరో భవనాన్ని నిర్మించడంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా లెక్క చేయలేదు. పర్యావరణవాదుల అభ్యంతరాలను బుట్టదాఖలు చేశారు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తూ ముందుకెళ్లిన చంద్రబాబు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ అక్రమ కట్టడాన్ని తనకు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసి చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించారు. ప్రజావేదిక నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనలు, అవకతవకలను కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వమే వ్యవస్థలను దిగజార్చేలా అక్రమ కట్టడాలు నిర్మించడం సరికాదంటూ దాన్ని కూల్చివేయాలని ఆదేశించడం సంచలనం సృష్టించింది. పేదవాడికో నిబంధన, ప్రభుత్వానికో నిబంధన ఉండదని స్పష్టం చేసి తన చిత్తశుద్ధి, ప్రభుత్వ పారదర్శకతను తేటతెల్లం చేయడంపై అందరిలోనూ సంతృప్తి వ్యక్తమవుతోంది.
అడుగడుగునా ఉల్లంఘనలే
ప్రజావేదిక నిర్మాణం నుంచి నిర్వహణ వరకూ లెక్కలేనన్ని ఉల్లంఘనలు, అవకతవకలు చోటుచేసుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం, నీటిపారుదలశాఖ నిబంధనలు, లోకాయుక్త ఆదేశాలకు భిన్నంగా సీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడి చేసి చంద్రబాబు దీన్ని నిర్మించారు. భవన నిర్మాణ సమయంలో కనీస నిబంధనలను సైతం పాటించలేదు. ఒక పంచాయతీలో భవనం కట్టుకోవడానికైనా ప్లాన్‌కు పంచాయతీ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలాంటిదేమీ లేకుండానే ప్రజావేదికను నిర్మించారు. భవన నిర్మాణాలకు అనుమతులివ్వాల్సిన సీఆర్‌డీఏతోనే నిబంధనలను తుంగలో తొక్కి మరీ దీన్ని నిర్మించారు. బిల్డింగ్ ప్లాన్‌లో చిన్న లోపాలుంటేనే కూలగొడుతున్న సీఆర్‌డీఏ అసలు ప్లాన్ లేకుండా తానే స్వయంగా ప్రజావేదికను కట్టి రాజభవనంగా తీర్చిదిద్దింది. కృష్ణా కరకట్టపై నిర్మాణాలు ఉండకూడదని గరిష్ట వరద స్థాయి సూచికలు, నీటిపారుదల శాఖ స్పష్టం చేసినా చంద్రబాబు పట్టించుకోకుండా తన నివాసం పక్కన దీన్ని కట్టించారు.
కార్యకలాపాలన్నీ టీడీపీవే..
ముఖ్యమంత్రి ప్రజలను కలుసుకునేందుకే దీన్ని నిర్మించినట్లు టీడీపీ చెప్పినా ఏనాడూ ప్రజలను అందులోకి రానివ్వలేదు. టీడీపీ కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యకలాపాల కోసమే దీన్ని నిర్మింపజేశారు. నిర్మించిన నాటి నుంచి టీడీపీ కార్యాలయం మాదిరిగానే ప్రజావేదిక పనిచేసింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఉద్యోగులు, పార్టీ నేతలంతా ఇక్కడి నుంచే పనిచేశారు. రెండేళ్లుగా పార్టీ సమావేశాలన్నీ ఇక్కడే జరిగాయి. చంద్రబాబు పలుసార్లు ఇందులోనే పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో యనమల రామకృష్ణుడి నేతృత్వంలో టీడీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశాలు, పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు, చేరికలు కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఇక్కడే జరిగాయి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్, ముఖ్య నాయకులు ప్రజావేదికను పార్టీ కార్యాలయంగానే వినియోగిస్తూ వచ్చారు. నాలుగు రోజుల క్రితం టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రజావేదికలోనే మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా అన్ని రకాలుగా దుర్వినియోగం చేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు దాన్ని కూల్చివేస్తామనగానే నీతి సూత్రాలు వల్లిస్తుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
మంత్రి నోటిమాటతో రెట్టింపైన అంచనాలు
ప్రజావేదికను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడమే కాకుండా టెండర్లు, అంచనాల రూపకల్పనలోనూ అవకతవకలకు పాల్పడ్డారు. కాగితాల్లో మూడుసార్లు టెండర్లు పిలిచినట్లు చూపించి చివరికి తమకు కావాల్సిన ఎన్‌సీసీ సంస్థకు ఆ పని అప్పగించారు. చివరికి చూపించిన టెండర్‌ను కూడా తుంగలో తొక్కారు. టెండర్ విలువ ప్రకారం రూ.4.34 కోట్ల పనిని అప్పటి మంత్రి నారాయణ తన నోటి మాటతో రూ.8.90 కోట్లకు పెంచేయడం గత ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ ఎలా సాగిందో రుజువు చేస్తోంది. కాంట్రాక్టు విలువ కంటే రెట్టింపు మొత్తాన్ని మంత్రి నోటి మాటతో పెంచడాన్ని బట్టి గత ప్రభుత్వం టెండర్ల పద్ధతిని ఏ స్థాయికి దిగజార్చిందో స్పష్టమవుతోంది. వాస్తవానికి టెండర్లు పిలవకుండానే ఎన్‌సీసీతో ప్రజావేదికను కట్టించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత కాగితాలపై టెండర్లు పిలిచినట్లు చూపించి పాత తేదీలతో మాయ చేసినట్లు చెబుతున్నారు.
ప్రజావేదిక నిర్మాణం – పూర్వాపరాలు
- ఉండవల్లిలో నాటి సీఎం క్యాంపు కార్యాలయం సర్వే నెంబరు 272/2 ఏ వద్దగ్రీవెన్స్ హాల్ నిర్మాణానికి అంచనా కంటే 4.3 శాతం అదనంతో (రూ.4,34,61,919.52) ఎన్‌సీసీ దాఖలు చేసిన బిడ్‌కు అర్హత ఉందని ధృవీకరించి ఆమోదించిన సీఆర్‌డీఏ. 2017 అక్టోబర్ 4న ఆ సంస్థతో నిర్మాణానికి ఒప్పందం
- గ్రీవెన్స్ హాల్ నిర్మాణానికి అనుమతి కోరుతూ 2017 సెప్టెంబర్ 6వ తేదీన అందిన విజ్ఞప్తిని తిరస్కరించిన కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. కృష్ణానదికి వచ్చే గరిష్ట వరద, సాంకేతిక కారణాల రీత్యా గ్రీవెన్స్ హాలు నిర్మాణానికి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టీకరణ.
- కృష్ణానది ఎడమ కరకట్టపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ఆక్రమణలన్నింటినీ ఆరు నెలల్లోపు తొలగించాలని
2017 ఫిబ్రవరి 1న లోకాయుక్త ఆదేశించింది. ఈ నిర్మాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అనుమతి నిరాకరించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.
- గ్రీవెన్స్ హాలు నిర్మాణానికి (ప్లాన్) అనుమతి ఇవ్వాలని 2017 జూన్ 13వ తేదీన సీఆర్‌డీఏ సీఈ (హౌస్ అండ్ బిల్డింగ్స్) పంపిన లేఖపై సీఆర్‌డీఏగానీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంగానీ అనుమతి ఇవ్వలేదు
- అనంతరం నాటి మంత్రి నారాయణ నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించి రూ.4.43 కోట్లకు ఇచ్చిన పరిపాలనాపరమైన మంజూరును రూ.8.90 కోట్లకు పెంచాలని మౌఖికంగా ఆదేశించారు. అందుకనుగుణంగా 2017 డిసెంబర్ 15వతేదీన సవరించిన అంచనాలను ఆమోదించిన సీఆర్‌డీఏ సీఈ. 2018 ఫిబ్రవరిలో గ్రీవెన్స్ హాల్ నిర్మాణం పూర్తి.
Comments
Please login to add a commentAdd a comment