ఉండవల్లి కృష్ణా కరకట్ట వెంట నిర్మించిన ప్రజావేదిక
సాక్షి, అమరావతి: రాజధానిలో కృష్ణా కరకట్ట వెంట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలంటూ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజావేదిక సాధారణ నిర్మాణమైతే దాని గురించి పెద్దగా చర్చకు ఆస్కారం ఉండేది కాదు. అయితే కృష్ణా కరకట్ట వెంట నిర్మించిన అక్రమ కట్టడాన్ని తనకు కేటాయించాలని కోరుతూ చంద్రబాబు లేఖ రాయడం పట్ల అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాలుగేళ్ల పాటు నివసించిన భవనమే అక్రమ కట్టడం కాగా దాని పక్కనే అక్రమంగా ప్రజావేదికను నిర్మించి ఇప్పుడు ఆ రెండూ తనకే కావాలని డిమాండ్ చేస్తుండడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణా కరకట్ట వెంట మాజీ సీఎం చంద్రబాబు అక్రమ కట్టడాలు
నాడు ఆగమేఘాలపై నిర్మాణం
చంద్రబాబు సీఎంగా ఉండగా ఉండవల్లిలోని తన నివాసం పక్కనే పార్టీ, అధికారిక కార్యకలాపాల కోసం ఒక పెద్ద హాలు, ఆఫీసు గదులు ఉండే భవనం ఉండాలని ఆదేశించడంతో సీఆర్‌డీఏ ఆగమేఘాల మీద ప్రజావేదికను నిర్మించింది. కనీసం టెండర్లు కూడా పిలవకుండా సీఆర్‌డీఏ కమిషనర్ నోటి మాటతో రూ.5 కోట్ల వ్యయంతో ఎన్‌సీసీ దీన్ని నిర్మించింది. ఇది పూర్తయిన చాలా రోజుల తర్వాత పేరుకు టెండర్లు పిలిచినట్లు చూపించి బిల్లులు చెల్లించారు.
చట్టాలకు తూట్లు పొడిచి..
వాస్తవానికి నదీ పరిరక్షణ చట్టం, పర్యావరణ చట్టాల ప్రకారం కృష్ణానది కరకట్ట వెంట ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. చంద్రబాబు అధికారంలో ఉండగా తన అవసరాలే తప్ప చట్టాలను పట్టించుకోకపోవడంతో సీఆర్‌డీఏ అధికారులు నిబంధనలను గాలికి వదిలేసి ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు. నీటిపారుదల శాఖ సైతం అభ్యంతరం చెప్పలేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రజావేదికను టీడీపీ కార్యాలయం మాదిరిగా మార్చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ నిధులతో కట్టిన భవనాన్ని యధేచ్చగా వాడుకున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజావేదికను నారా లోకేష్ పార్టీ కార్యకలాపాల కోసం వినియోగిస్తుండడం గమనార్హం. బుధవారం కూడా చంద్రబాబు ప్రజావేదికలోనే పార్టీ నాయకులను కలవడం, రంజాన్ వేడుకలు నిర్వహించడం చేశారు.
కృష్ణా నది పక్కన చంద్రబాబు నివాసం
ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని బొంకి...
మాజీ సీఎం చంద్రబాబు నివాసంగా ఉపయోగిస్తున్న భవనం నిర్మాణమే అక్రమమని గతంలోనే తేలిపోయింది. నదీ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా నిర్మించిన ఈ భవనాన్ని కూల్చేయాలని నీటిపారుదల శాఖ, తాడేపల్లి పంచాయతీలు గతంలో భవనం యజమాని లింగమనేని రమేష్‌కు నోటీసులిచ్చాయి. అయితే చంద్రబాబుకు రమేష్ సన్నిహితుడు కావడంతో అక్రమంగా నిర్మించిన నిర్మాణం సక్రమంగా మారిపోవడమేగాక ఏకంగా ఆయన నివాసమైపోయింది. అక్రమ కట్టడంలో సీఎం నివాసం ఉండడం ఏమిటని పర్యావరణవాదులు, పార్టీలు ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు లెక్క చేయలేదు. అక్రమంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు ఎలా ఉంటారని నాడు అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీయటంతో ఈ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, దాన్నే తాను నివాసంగా వినియోగిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. అయితే చంద్రబాబు తాజాగా సీఎం వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో మాత్రం తన నివాసం ప్రైవేట్ భవనమని, దాని పక్కనే ఉన్న ప్రజావేదికను తనకు ఇవ్వాలని కోరడం గమనార్హం. ఎక్కడైనా ఓ భవనాన్ని స్వాధీనం చేసుకుంటే అది ప్రభుత్వానికే చెందుతుంది. చంద్రబాబు అది ప్రైవేట్‌దని పేర్కొనడంతో గతంలో తాను అబద్ధమాడినట్లు స్పష్టమవుతోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు ప్రజావేదిక అవసరమని సీఎం వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే చంద్రబాబు టీడీపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు తప్ప ఇంకా ఆ పదవి అధికారికంగా ఆయనకు దఖలు పడలేదు. ప్రతిపక్ష నేత హోదా కూడా రాకుండానే అక్రమంగా నిర్మించిన భవనాలను తనకు కేటాయించాలని కోరడం చర్చనీయాంశమైంది.
ప్రజావేదిక నాకివ్వండి
సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు కేటాయించాలని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. తాను సీఎంగా ఉన్న సమయంలో తన నివాసం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సమావేశాల నిర్వహణ, సందర్శకులను కలిసేందుకు ప్రజావేదికను ఉపయోగించామని తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో తాను సీఎం కార్యాలయాన్ని వదిలేశాక, తానుంటున్న ప్రైవేటు ఇంటిలోనే ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్న దృష్ట్యా తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికలో ఎమ్మెల్యేలు, సందర్శకులు, ప్రజలను కలిసేందుకు ఉపయోగించుకుంటానని తెలిపారు. తన విన్నపంపై సానుకూలంగా స్పందించి సంబంధించి అధికారులకు అందుకనుగుణంగా తగు సూచనలు ఇవ్వాలని కోరారు.
బాబు విదేశీ పర్యటన వాయిదా
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో చంద్రబాబు తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలని ఆయన భావించారు. తొలి అసెంబ్లీ సమావేశాలకు గైరుహాజరైతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment