10న టెండర్లు ఖరారు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, మల్కాపురం గ్రామాల పరి ధిలో నిర్మించే తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి రెండు టెండర్లు దాఖలయ్యాయి. ఆరు భవనాలకు సంబంధించిన మూడు ప్యాకేజీలకు ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ-పల్లోంజీ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థల్లో ఎల్1(తక్కువకు కోడ్ చేసిన)గా నిలిచిన సంస్థకు ఈ నెల 10న టెండర్ ఖరారు చేస్తామని, అదేరోజు నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని సీఆర్‌డీఏ అధికారులు స్పష్టం చేశారు.
సచివాలయం నిర్మాణానికి టెండర్లు దాఖలు సమయం బుధవారంతో ముగియడంతో సీఆర్‌డీఏ అధికారులు విజయవాడ కార్యాలయంలో వాటిని తెరిచారు. కాగా, ఈ రెండు సంస్థకు సంబంధించిన సాంకేతిక అర్హతలను ఈ నెల 10లోపు నిర్ధారించనున్నారు. ఈ రెండూ టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధిస్తే పదో తేదీ ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్(ఫైనాన్షియల్ బిడ్)లు తెరుస్తారు. మూడు ప్యాకేజీలున్నాయి కాబట్టి రెండు కంపెనీలూ ఈ పనులను చేజిక్కించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పనులు దక్కించుకున్న సంస్థ ఐదు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఒక శాతం ప్రోత్సాహకం, నాలుగు నెలల్లో పూర్తి చేస్తే రెండు శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. జూన్‌లోపు సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే.
తాత్కాలిక సచివాలయానికి రెండు టెండర్లు
Published Thu, Feb 4 2016 4:13 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM
Advertisement
Advertisement