సాక్షి, అమరావతి : చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కాంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా అంటూ సీఎం చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం అని మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ? అంటూ నిప్పులు చెరిగారు. ఈదురుగాలులు వీస్తున్నందువల్ల తాత్కాలిక సచివాలయం వైపు వెళ్లటం అత్యంత ప్రమాదకరం అంటూ సెటైరిగ్గా ఉన్న ఓ ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు.
#SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/bWRqFSnEjN
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 8, 2019
భారీ వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతం చిగురుటాకులా వణికిపోయిన విషయం తెలిసిందే. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. బలమైన గాలులతో కూడిన వర్షం రావడంతో రాజధానిలో నిర్మాణ దశలో ఉన్న భవనాల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. తాత్కాలిక సచివాలయం వద్ద రూ.25 లక్షల వ్యయంతో ఇటీవలే ఏర్పాటు చేసిన స్మార్ట్‌పోల్ గాలుల ధాటికి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సచివాలయంలోని బ్లాకులపై ఏర్పాటు చేసిన రేకులు ఎగిరిపోయాయి. సచివాలయం ప్రవేశ మార్గం వద్ద పోలీసుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లు నేలకూలాయి. భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పోల్స్ కూడా నేలకొరిగాయి. కేవలం పది నిమిషాల పాటు కురిసిన గాలివానకే తాత్కాలిక సచివాలయం వద్ద భారీగా ఆస్తినష్టం వాటిల్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment