ఎంఓయూలన్నీ వాస్తవ రూపం దాల్చాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల ద్వారా 15 శాతం వృద్దిరేటు సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో కుదిరిన అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)ను కార్యరూపంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ సీఐఐ సదస్సులో కుదిరిన 664 ఎంఓయూలను అమల్లోకి తీసుకురావడానికి అధికారులంతా కృషి చేయాలన్నారు. ఈ ఒప్పందాలపై ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎకనామిక్ సిటీకి 5,000 ఎకరాలు: రాష్ట్రంలో మరో భారీ భూసమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.అమరావతి రింగ్‌రోడ్డు సమీపంలో కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల పరిసరాల్లో 5వేల ఎకరాలకు భూసమీకరణ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అక్కడ ఎకనామిక్ సిటీని అభివృద్ధి చేయవచ్చన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై చంద్రబాబు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.