కోదాడ : పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల అసైన్డ్ భూమిని అమ్మకానికి సిద్ధం చేశారు. విలువైన ఈ భూమిని కొద్ది రోజులుగా శుభ్రం చేసి ప్లాట్లుగా విభజించడం వెనుక ఓ రాజకీయ నేత కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు ఎంతకు తెగించారంటే కోదాడ పెద్దచెరువు మునక భూమిలో కూడా రాళ్లు పాతి ప్లాట్లు చేయడం గమనార్హం.
ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు రెవెన్యూ, ఐబీ అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో వారు వచ్చి అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. దీంతో ప్లేటు ఫిరాయించిన సదరు నేత భూమి అమ్మడం లేదని ప్రభుత్వం 14 మందికి కేటాయించడంతో వారందరికీ పంచి ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వడానికి ఆయనెవ్వరని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే...
కోదాడకు చెందిన తమ్మర వెంకట సీతరామారావు కోదాడ రెవెన్యూ పరిధిలో రామిరెడ్డిపాలెం వెళ్లే దారిలో ఉన్న సర్వే నంబర్ 55లో సీలింగ్ కింద ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఈ భూమిని అధికారులు కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్‌జంగ్ పేటకు చెందిన 14 మంది దళితులు, మైనార్టీలకు అసైన్డ్ చేశారు. వారు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుని జీవించాల్సి ఉంది. అమ్మకం, కొనుగోళ్లు చెయ్యరాదు. కానీ ఈ భూమిని 1990లో కోదాడకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశారు. దానిని తన తండ్రి పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కొందరు నాయకులు నాడు సదరు భూమిలో పార్టీ జెండాలను పాతి తిరిగి పేదలకు కేటాయించాలని ఉద్యమం కూడా చేశారు. ఈ తరువాత విషయం హైకోర్టు వరకు చేరింది. దీంతో కోర్టు రిజస్ట్రేషన్ రద్దు చేసి తిరిగి పేదలకు అప్పగించాలని చెప్పడంతో అధికారులు తిరిగి వారికే కేటాయించారు. ఇది జరిగి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఈ భూమి అలాగే ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పట్టణం విస్తరించడంతో భూమి విలువ ఎకరం కోటి రూపాయలకు చేరింది.
దీంతో నాడు భూములను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఓ నేత తెర వెనకుండి ఈభూమిని శుభ్రం చేయించి ప్లాట్లుగా పెట్టి అమ్మకానికి సిద్ధం చేశాడు. పనిలో పనిగా పెద్ద చెరువు నీరు ఉండే ప్రాంతంలో కూడా రాళ్లు పెట్టి ప్లాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు రెండు రోజుల క్రితం రెవెన్యూ అధికారులకు, పెద్ద చెరువు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో వారు వచ్చి పనులను అడ్డుకున్నారు.
అసైన్డ్ భూమి..అమ్మకానికి సిద్ధం!
Published Wed, Jun 22 2016 8:16 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement