సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లోని గండిపేట మండలం మంచిరేవులలో గ్రేహౌండ్స్ దళాల శిక్షణ కోసం సర్వే నంబర్ 391/1 నుంచి 391/20ల్లో 2007లో కేటాయించిన 142.39 ఎకరాల భూమి సర్కారుదేనని హైకోర్టు స్పష్టం చేసింది. నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అసైన్‌మెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించిన నేపథ్యంలో.. ఆ అసైన్‌మెంట్‌ను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చిచెప్పింది. ఈ భూమిని అసైన్‌మెంట్ ద్వారా పొందిన వారికి హక్కులున్నాయని, వారికి పరిహారం చెల్లిం చి భూములు స్వాధీనం చేసుకోవాలంటూ 2010లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం అనుమతిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ధర్మాసనం తీర్పుతో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ భూమిని కాపాడినట్‌లైంది.
లావుని నిబంధనలు పాటించలేదు
‘‘లావుని నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదన్న అసైన్‌మెంట్‌దారుల తరఫు న్యాయవాదుల వాదన సరికాదు. లావుని నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములను వేలం ద్వారా కేటాయించాలి. వేలంలో భూమిని పొందిన వ్యక్తులు 25 శాతం డబ్బును వెంటనే చెల్లించాలి. మిగిలిన 75 శాతం 15 రోజుల్లో చెల్లించాలి. అయితే ఈ భూములను భూమిలేని నిరుపేదలకు అసైన్‌మెంట్ విధానంలో కేటాయించారు. ఇతరులకు విక్రయించరాదనే షరతు కూడా ఉంది. అయితే వీరు భూమిని విక్రయించేందుకు ప్రైవేట్ వ్యక్తులతో ఒప్పందం చేసు కున్నారు. 1991లో ఎంఎ.భక్షికి జీపీఏ ఇచ్చారు. ఆ భూమిని అభివృద్ధి చేసిన భక్షి అసైన్‌మెంట్‌దారులకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇది అసైన్‌మెంట్ భూమిని విక్రయించరాదన్న నిబంధనను ఉల్లంఘించడమే. తర్వాత భక్షికి చేసిన జీపీఏను అసైన్‌మెంట్‌దారులు రద్దు చేసినా అప్పటికే అసైన్‌మెంట్ నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది.ఈ నేపథ్యంలో వీరికి చేసిన అసైన్‌మెం ట్‌ను రద్దు చేసే అధికారం రెవెన్యూ అధికారులకు ఉంది’అని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది.
‘గ్రేహౌండ్స్’శిక్షణ కోసం కేటాయించారు.. ‘అసైన్‌మెంట్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రజోపయోగమైన పనుల కోసం ప్రభుత్వం కేటాయించింది. నక్సల్స్‌ను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ దళాలకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ కమాండోలతోపాటు కేంద్ర పారామిలిటరీ బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నక్సలిజం నిర్మూలన కోసం వినియోగిస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం 2003లో స్వాధీనం చేసుకుంది. 2006 డిసెంబర్‌లో ప్రజోపయోగమైన పనులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. 1961లో అసైన్‌మెంట్ కింద కేటాయించిన ఈ ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులపరం కాకుండా డీజీపీ, గ్రేహౌండ్స్ అదనపు డీజీ, రంగారెడ్డి కలెక్టర్, ఆర్‌డీవో, గండిపేట తహసీల్దార్‌లు కృషి చేశారని ధర్మాసనం అభినందింది. ఇదిలా ఉం డగా, ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి వెంచర్లు వేసిన కబ్జాదారులపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment