కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా! | Senior Citizens harassmentand missing cases, Help Line special story | Sakshi
Sakshi News home page

కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా!

Published Fri, Nov 22 2024 10:54 AM | Last Updated on Fri, Nov 22 2024 11:09 AM

Senior Citizens  harassmentand missing cases, Help Line special story

కొడుకుల ఆదరణ కరువై.. వేధింపులు పెరిగి 

ఇంటిని వదిలి వెళ్తున్న కొందరు..

ఆత్మహత్య చేసుకుంటున్న మరికొందరు..  ప్రజావాణి, ఠాణాల్లో పలువురి ఫిర్యాదు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న వృద్ధుల మిస్సింగ్‌ కేసులు  చట్టాలపై అవగాహన లేక ఇబ్బందులు

కనిపెంచిన బిడ్డల్ని,కంటికి రెప్పలా కాపాడి,  ఎన్నో కష్టాలకోర్చి వారిని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. కానీ  రెక్కలు వచ్చిన బిడ్డలు కన్నతండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఆస్తుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు.  హృదయాల్ని  కదిలించే ఇలాంటి ఉదంతాలపై  స్పెషల్‌ స్టోరీ..

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.


ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.

జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు.

సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్‌ లైన్‌–14567కు ఫోన్‌ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్‌ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్‌ ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.


సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.

చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చు
పండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఒక ట్రిబ్యునల్‌ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్‌ కలెక్టర్‌ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్‌ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. 

ఆస్తిని తిరిగి పొందే హక్కు
నిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్‌ డీడ్‌ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్‌ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్‌ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్‌ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్‌ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.

వేధిస్తే కఠిన చర్యలు 
వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్‌లైన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, సీపీ రామగుండం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement