ఇది పింఛనా.. ఇగ పెంచరా?  | Troubles of Retired coal mine Workers with Less Pension | Sakshi
Sakshi News home page

ఇది పింఛనా.. ఇగ పెంచరా? 

Published Thu, Oct 6 2022 12:00 PM | Last Updated on Thu, Oct 6 2022 2:49 PM

Troubles of Retired coal mine Workers with Less Pension - Sakshi

గనిలో రూఫ్‌ సపోర్టింగ్‌ చేస్తున్న సింగరేణి కార్మికులు

గోదావరిఖనికి చెందిన ఎర్రం నర్సయ్య సింగరేణిలో పనిచేసి రిటైరయ్యాడు. ఆయన నెలనెలా వస్తున్న పింఛన్‌ రూ.600 మాత్రమే. భార్యాభర్తలిద్దరూ ఇదే పింఛన్‌తో గడపాలి. 1997లో పనిలోంచి దిగిపోయాడు. కాలుకు దెబ్బతగిలి గాయమవడం, షుగర్‌ కారణంగా అది పెద్దదవడంతో మోకాలి వరకు తొలగించారు. రెండో కాలు విరగడంతో రాడ్‌ వేశారు. రెండు కాళ్లూ పనిచేయని దుస్థితి. అయినా ఇదే పింఛన్‌తో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి. 

గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌కు చెందిన మట్ట లింగయ్య 28ఏళ్లపాటు సింగరేణిలో పనిచేసి 2002లో రిటైరయ్యాడు. అప్పటి నుంచీ ఆయనకు రూ.580 పింఛన్‌ మాత్రమే వస్తోంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ఆయన.. మందులు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నట్టు వాపోతున్నాడు. 

.. ఇది కేవలం నర్సయ్య, లింగయ్యల గాథ మాత్రమేకాదు. బొగ్గుగనుల్లో పనిచేసి రిటైర్‌ అయిన వేలాది మంది కార్మికుల గోస ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్‌ కంటే కూడా తమకు వచ్చే కార్మిక పింఛన్‌ చాలా తక్కువని.. కార్మిక పింఛన్‌ ఉందని ఆసరా పెన్షన్‌ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. 

(సాక్షిప్రతినిధి, కరీంనగర్‌) 
ఏళ్లపాటు సేవలు చేసినా.. 
రిటైరైన తర్వాత సుఖంగా విశ్రాంత జీవితం గడుపుతామని కలలు కన్న బొగ్గుగని కార్మికుల జీవితాలు తలకిందులు అవుతున్నాయి. నామమాత్రపు పింఛన్‌తో బతుకీడుస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి కోసం కష్టపడిన కార్మికులు వయసు మీదపడ్డాక కీళ్ల అరుగుదల, శ్వాసకోస సంబంధ వ్యాధులతో సతమతం అవుతున్నారు. పింఛన్‌ సొమ్ము ఎటూ సరిపోక అప్పులపాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఆసరా పథకం కింద రూ.2,016 పింఛన్‌ ఇస్తోంది. కానీ రిటైర్డ్‌ కార్మికులు సీఎంపీఎఫ్‌ పింఛన్‌ అందుకుంటుండటంతో వారికి ఆసరా పథకానికి అర్హత లేకుండా పోయింది. కానీ ఆసరా కన్నా చాలా తక్కువగా కేవలం రూ.500, వెయ్యిలోపే సీఎంపీఎఫ్‌ పింఛన్‌ వస్తుండటం గమనార్హం. 

ఏళ్లుగా పోరాడుతున్నా..
పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోలిండియా వ్యాప్తంగా 2011లో పెన్షనర్ల అసోసియేషన్‌ ఏర్పడింది. నాలుగేళ్లపాటు పోరాడిన అసోసియేషన్‌ అప్పటి ప్రధాని మన్మోహన్‌ను కలిసి గోడు వినిపించుకున్నా స్పందన రాలేదు. దీనితో తమకు న్యాయం చేయాలంటూ.. 2015 జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ అంశాన్ని కిందికోర్టులో తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. ఏడేళ్లు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై నిర్ణయం వెలువడలేదు. ఈ కేసు వచ్చే నెల 11న తిరిగి విచారణకు రానున్నట్టు నాయకులు తెలిపారు. 

పెన్షన్‌ లోటుపై పట్టింపేది? 
మొత్తం పెన్షన్‌దారులు ఎంతమంది? మూలనిధి ఎంత ఉంది? రిటైర్‌ అవుతున్న బొగ్గు గని కార్మికులకు ఎంత పెన్షన్‌ చెల్లించాలనే అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయించాల్సిన ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ కనీసం ప్రతి మూడేళ్లకోసారి సమావేశం కావాలి. ఫండ్‌లో లోటు లేకుండా చర్యలు చేపట్టాలి. దీనితో ఇప్పటివరకు రూ.45 వేలకోట్ల లోటు ఏర్పడినట్టు సమాచారం. దీనిని పూడ్చేందుకు ఇటీవలే చర్యలు చేపట్టారు. కోలిండియా యాజమాన్యంతో మేనేజ్‌మెంట్‌ కమిటీ చర్చించి టన్ను బొగ్గుపై రూ.15 లెక్కన సీఎంపీఎఫ్‌ ట్రస్ట్‌కు చెల్లించేందుకు అంగీకరించేలా చేసినట్టు తెలిసింది. 

10న సీఎంపీఎఫ్‌ కార్యాలయాల ముందు ధర్నా
బొగ్గు గని కార్మికుల పెన్షన్‌ పెంచాలని కోరుతూ ఈనెల 10న కోలిండియా స్థాయిలోని సీఎంపీఎఫ్‌ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో రిటైర్డ్‌ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా.. 
బొగ్గు గని కార్మికుల పెన్షన్‌ పెంచాలని 2011లో కోలిండియా అధ్యక్షుడితో కలిసి పోరాటం ప్రారంభించాం. అప్పటి ప్రధాని మన్మోహన్‌ను కలిసి సమస్య వివరించాం. సానుకూల స్పందన రాలేదు. ఐదేళ్లపాటు అనేక రూపాల్లో పోరాటం చేసి.. చివరికి సుప్రీంకోర్టులో కేసు వేశాం. వచ్చేనెల 11న విచారణ జరగనుంది. 
– కేఆర్‌సీ రెడ్డి, రిటైర్డ్‌ జీఎం, కోల్‌మైన్స్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి 
మా సమస్యపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కొంత చలనం వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో చేసిన చట్టంలో లోపాలతో ఇబ్బంది పడుతున్నాం. తక్కువ పెన్షన్‌తో చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. 
– మడిపెల్లి బాబురావు, ప్రధాన కార్యదర్శి, కోల్‌మైన్స్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement