ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కీలక శాఖల్లో మహిళా అధికారులు
సొంత నిర్ణయాలతో తమదైన ముద్ర
పథకాలను ప్రజలకు చేరుస్తూ, సమస్యల పరిష్కారం
పురుష అధికారులతో సమానంగా విధులు నిర్వహిస్తూ ఆదర్శం
ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు మహిళా అధికారులు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉంటున్నారు. పురుష అధికారులతో సమానంగా విధులు నిర్వహిన్నారు. కిందిస్థాయి నుంచి మొదలుకొని జిల్లాస్థాయి అధికారిగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్, న్యాయ, రెవెన్యూ, విద్య, వైద్యం, మెప్మా, వ్యవసాయశాఖ తదితర శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. – సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్ అర్బన్
కీలక స్థానాల్లో వారే..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు శాఖల్లోని కీలకమైన స్థానాల్లో మహిళా అధికారులే ఉన్నారు. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ, జగిత్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నీలిమ, కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి, పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా అరుణశ్రీ, పెద్దపల్లి డీసీపీగా డాక్టర్ చేతన, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రినిరెడ్డి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పేయ్, కరీంనగర్ డీఎంహెచ్‌వోగా సుజాత, డీఏవోగా భాగ్యలక్ష్మి, జగిత్యాల డీఏవోగా వాణి, కరీంనగర్ సంక్షేమ అధికారిగా సరస్వతి, ఆర్టీసీ ఆర్‌ఎంగా సుచరిత, రామగుండం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా హిమబిందు సింగ్, పెద్దపల్లి సహకార శాఖ అధికారి శ్రీమాల, పెద్దపల్లి డీఈవోగా మాధవి, ఇంటరీ్మడియట్ నోడల్ అధికారిగా కల్పన, ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌గా నాయిని సుప్రియ.. ఇలా.. వివిధ శాఖల్లో మహిళా అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఆలోచనా విధానం మారాలి
జీవితంలో అనేక పాత్రలు పోషిస్తున్నా.. మహిళలపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. ఈ అనాగరిక ధోరణి నుంచి మనిషి ఆలోచనా విధానం మారాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజకీయ రంగంలోనూ మహిళలు దూసుకెళ్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో వారి ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఏ సంస్థలోనైనా, ఏ రంగంలోనైనా తగిన శిక్షణ, సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే వారు అనూహ్య ఫలితాలు సాధిస్తారు.
మహిళల ప్రాతినిధ్యం పెరిగింది
అటెండర్ నుంచి అంతరిక్షం వరకు ప్రతీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. నాకు అదనపు కలెక్టర్‌గా సేవలందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మహిళలు రాజకీయాల్లో వెనకబడి ఉన్నారు. సివిల్ సర్వీసులోకి వచ్చేవారు 7 శాతమే. విజయానికి ఆడ, మగ అనే తేడా లేదు. లక్ష్యాలను నిర్దేశించుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆడపిల్లలను ప్రోత్సహించేవారి సంఖ్య పెరుగుతోంది. అది వంద శాతానికి చేరాలి.
– లక్ష్మీకిరణ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), కరీంనగర్
యువతుల్లో చైతన్యం కనిపిస్తోంది
పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. జిల్లాలో చైతన్యం ఎక్కువ. ఆడపిల్లలంటే ఒకప్పుడు వివక్ష ఉండేది. ఇప్పుడు మార్పు వచ్చింది. వ్యవసాయశాఖకు జిల్లా అధికారిగా పని చే యడం సంతోషంగా ఉంది. పల్లెల్లో సమావేశాల్లో పాల్గొన్నప్పుడు యువతుల్లో చైతన్యం కనిపిస్తోంది. స్వయం ఉపాధి పొందేవారు, ఉన్నత విద్యనభ్యసిస్తున్నవారిని చూస్తే గర్వంగా అనిపిస్తోంది.
– భాగ్యలక్ష్మి, డీఏవో, కరీంనగర్
చదువుతోనే సాధికారత
చదువుతోనే మహిళా సాధికారిత సాధ్యమవుతుంది. ఎంచుకున్న రంగంలో ప్రతిభ చాటేందుకు ఇష్టంగా ముందుకుసాగాలి. ఎవరి జీవితం అనతికాలంలో ఉన్నతస్థానానికి చేరదు. కఠోర శ్రమ అవసరం. లక్ష్య సాధనకు నిర్విరామ కృషి ఉండాలి. ఆడవాళ్లు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు పోటీపడాలి. ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో పరిపూర్ణత సాధించాలి.
– అరుణశ్రీ, అదనపు కలెక్టర్, పెద్దపల్లి
చట్టాలపై అవగాహన ఉండాలి
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆత్మనిర్భరత, నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉండాలి. విద్య, వృత్తి, వివాహం, కుటుంబ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వాలు మహిళల కోసం చేసిన చట్టాలు, న్యాయ సేవలపై ప్రతీ ఒక్కరికి అవగా హన ఉండాలి. పోలీస్‌శాఖలో గతంతో పోలిస్తే మహిళా సిబ్బంది ప్రాతినిధ్యం పెరిగింది.
– డాక్టర్ చేతన, డీసీపీ, పెద్దపల్లి
ఆడపిల్లలను ప్రోత్సహించాలి
ఆడపిల్లలకు వయసు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. అలా కాకుండా, వారు ఎంచుకున్న లక్ష్యాలు సాధించేవరకు ప్రోత్సహించాలి. లక్ష్యసాధనకు తోడ్పాటునందించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆడవారిని ఎలా గౌరవించాలో నేర్పించాలి. మగ, ఆడ అనే తేడా లేకుండా అందరూ సమానమేనన్న భావన కలిగించాలి.
– మాధవి, డీఈవో, పెద్దపల్లి
చాలెంజ్‌గా తీసుకుంటా
కోల్‌సిటీ(రామగుండం): కొన్ని రంగాల్లో మహిళలు చిన్నచూపునకు గురవుతున్నారు. వాటిని పట్టించుకోకుండా ప్రతీ పనిని చాలెంజ్‌గా తీసుకోవాలి. నేను చాలెంజ్‌తో ముందుకు సాగుతున్నా. పురుషుల కన్నా మహిళకు ఇల్లు, ఫ్యామిలీ, ఉద్యోగం, అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. లీడర్‌షిప్ క్వాలిటీస్ విషయంలో సపోర్ట్ దొరకదు. నిలోఫర్ ఆస్పత్రిలో హెచ్‌వోడీగా చేస్తున్న నన్ను, ప్రభుత్వం అడిషనల్ డీఎంఈ క్యాడర్ హోదా కల్పిస్తూ ప్రమోషన్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన రామగుండంలోని సిమ్స్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా రెండున్నరేళ్ల క్రితం బాధ్యతలు అప్పగించారు. తొలి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన కొంతకాలం ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రొఫెషనల్ ఒత్తిళ్లతో బిజీగా ఉన్నా కుటుంబానికీ సమయం కేటాయిస్తా.
– డాక్టర్ హిమబిందు సింగ్, ప్రిన్సిపాల్, సిమ్స్, గోదావరిఖని
Comments
Please login to add a commentAdd a comment