ఎన్పీఎస్-ఈపీఎఫ్ ఏది మంచిది? | which on good nps- epf? | Sakshi
Sakshi News home page

ఎన్పీఎస్-ఈపీఎఫ్ ఏది మంచిది?

Published Mon, May 30 2016 2:44 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

ఎన్పీఎస్-ఈపీఎఫ్ ఏది మంచిది?

ఎన్పీఎస్-ఈపీఎఫ్ ఏది మంచిది?

విభిన్నమైన ప్రయోజనాలు అందించే నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను (ఎన్‌పీఎస్) ప్రభుత్వం సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చి ఐదేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీంతో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) విత్‌డ్రాయల్స్‌లో కొంత మొత్తంపై పన్నులు విధించే ప్రతిపాదన ద్వారా ఎన్‌పీఎస్‌తో దీన్ని సమం చేసేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను అటువైపు కూడా మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదన విరమించుకోక తప్పలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈపీఎఫ్‌కు, ఎన్‌పీఎస్ లక్షణాలేంటి? వీటి మధ్య ఉన్న తేడాలేంటి? చూద్దాం...

 * ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా చూడొద్దు
 * రెండింటితోనూ వేర్వేరు ప్రయోజనాలు


పెట్టుబడుల విధానం..
 * ఈపీఎఫ్‌కు క్రమం తప్పకుండా బేసిక్ వేతనం నుంచి కొంత మొత్తాన్ని జమచేయాలి. కంపెనీయే ఉద్యోగి జీతం నుంచి ఈ మొత్తాన్ని కట్ చేసి తన ఈపీఎఫ్ ఖాతాకు జమచేస్తుంది. అంతే మొత్తాన్ని కంపెనీ కూడా జోడిస్తుంది.
 * ఎన్‌పీఎస్ మాత్రం పూర్తిగా స్వచ్ఛందం. ఇన్వెస్టర్లు ఏకమొత్తంగానైనా లేదా ఇతరత్రా వాయిదాల పద్ధతిలోనైనా తమ ఇష్టప్రకారం కట్టుకోవచ్చు.
 
కనిష్ట, గరిష్ట పెట్టుబడి..
 * ఈపీఎఫ్‌కు ఉద్యోగి నెలవారీ బేసిక్ జీతంలో కొంత మొత్తం చెల్లించాలి. కంపెనీ కూడా అంతే చెల్లిస్తుంది. ఉద్యోగి స్వచ్ఛందంగా ఎక్కువ కూడా కట్టుకోవచ్చు.
 * ఎన్‌పీఎస్‌కి సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.6,000 కట్టాలి. గరిష్ట పరిమితులేమీ లేవు.
 
అసెట్ కేటాయింపులు..
 * ఇప్పటి దాకా ఈపీఎఫ్ 100 శాతం పెట్టుబడుల్ని రుణ సాధనాల్లోనే పెట్టేది. ఈ మధ్యే పీఎఫ్ నిధిలో 5 శాతం మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్లలో ఈపీఎఫ్‌వో ఇన్వెస్ట్ చేస్తోంది. గరిష్టంగా 15 శాతం దాకా పరిమితి ఉంది.
 * ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్టరే తన పెట్టుబడి మొత్తాన్ని ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏ రకంగా పెట్టుబడి పెట్టాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా డిఫాల్ట్ ఆప్షన్ కింద సదరు ఇన్వెస్టరు రిటైర్మెంట్ వయస్సుకు దగ్గరవుతున్న కొద్దీ.. ఏటా కొంత కొంతగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతుంటాయి. మరో ఆప్షన్‌లో ఈక్విటీలకు గరిష్టంగా యాభై శాతమే కేటాయింపులు జరిపే వీలుంది. దీన్ని ఆరు పెన్షన్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తుం టాయి కనుక మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.
 
ఆశించతగ్గ రాబడులు..
 * ఈపీఎఫ్‌లో చందాదారులందరికీ వడ్డీ ఒకే రకంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.7 శాతం. దేశంలో వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఇది కాస్త తగ్గొచ్చు లేదా అదే స్థాయిలోనూ కొనసాగవచ్చు.
 * ఈక్విటీల్లోనూ పెట్టుబడులు ఉంటా యి కనుక.. ఎన్‌పీఎస్ చందాదారులకు కొంత అధిక రాబడులొచ్చే అవకాశాలున్నాయి. పదేళ్లు ఆపైన దీర్ఘకాలిక పెట్టుబడులు పెడి తే ఈపీఎఫ్ కన్నా ఎన్‌పీఎస్ స్కీము ద్వారా 2-3 శాతం మేర ఎక్కువ రాబడులు రావొచ్చు.
 
అర్హత
 * ఈపీఎఫ్ అనేది ప్రైవేట్ సంస్థల్లోని వేతన జీవులకు మాత్రమే పరిమితం. 20 మంది పైగా ఉద్యోగులున్న సంస్థలకు ఇది తప్పనిసరి.
 * ఎన్‌పీఎఫ్ విషయానికొస్తే.. ఏప్రిల్ 2004 తర్వాత విధుల్లో చేరిన ప్రభుత్వోద్యోగులందరికీ ఇది తప్పనిసరి. వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందే వారు, గృహిణులు, సంఘటిత.. అసంఘటిత రంగాల్లో పనిచేసే సాధారణ ప్రజలు కూడా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. దీంతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి తన రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఇటు ఈపీఎఫ్ అటు ఎన్‌పీఎస్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ, వ్యాపారవేత్తలు లేదా స్వయం ఉపాధి పొందే వారికి ఈపీఎఫ్ ఉండదు. వారు ఎన్‌పీఎస్ లేదా పరిమిత స్థాయిలో పీపీఎఫ్ మాత్రమే వినియోగించుకోగలరు.
 
పన్ను ప్రయోజనాలు..
 * ప్రస్తుత నిబంధనల ప్రకారం సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ. 1.5 లక్షల దాకా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈపీఎఫ్ దీని పరిధిలోకే వస్తుంది. అయితే, పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, బీమా పథకాలు, ట్యూషన్ ఫీజులు, 5 ఏళ్ల కాలపరిమితి బ్యాంకు డిపాజిట్లు అన్నీ సెక్షన్ 80సీ కిందికే వస్తాయి.
 * ఎన్‌పీఎస్ మాత్రం సెక్షన్ 80సీ పరిధిలోకి రాదు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కిందికి వస్తుంది. ఏడాదికి గరిష్టంగా రూ.50,000 దాకా మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 80సీకి అదనమని గుర్తుంచుకోవాలి.
 * రిటైరైనప్పుడు మెచ్యూరిటీ సమయంలో మొత్తం ఈపీఎఫ్‌ను పన్ను ప్రసక్తి లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు.
 * ఎన్‌పీఎస్ నుంచి మొత్తం నిధిని విత్‌డ్రా చేసుకోవటం కుదరదు. నిధిలో 40 శాతాన్ని పన్నుల్లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 60 శాతాన్ని కచ్చితంగా పెన్షన్ ప్లాన్ వంటి యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కావాలనుకుంటే పూర్తి మొత్తాన్ని కూడా యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
 * స్థూలంగా చూస్తే ఎన్‌పీఎస్, ఈపీఎఫ్‌లనేవి ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదు. ఒకదానికి మరొకటి తోడుగా పరిగణించాలి. రెండూ ఉంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటి యాపిల్ అయితే మరొకటి నారింజలాంటిది. రెండిటినీ పోల్చలేం. కానీ ఈ రెండూ ఆరోగ్యానికి మేలే చేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement