సొంతింటికి పెన్షన్‌ రుణం! | Pension debt to own home | Sakshi
Sakshi News home page

సొంతింటికి పెన్షన్‌ రుణం!

Published Mon, Mar 12 2018 12:13 AM | Last Updated on Mon, Mar 12 2018 12:13 AM

Pension debt to own home - Sakshi

ఈ ఏడాది చివరికల్లా జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పీఎస్‌) చందాదారులకు గృహ రుణాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక దేశాల్లో గృహ అవసరాల కోసం ఎన్‌పీఎస్‌లో కొంత నిధులను వినియోగించుకునే వీలుంది. అంతెందుకు! పీఎఫ్‌లోనూ ఈ సౌకర్యం ఉంది. అందుకే ఎన్‌పీఎస్‌లోనూ దీన్ని అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ‘పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ)’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) ఎ.జి.దాస్‌ చెప్పారు.

ఇక్కడ ఎన్‌పీఎస్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ‘సాక్షి’  బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ఎన్‌పీఎస్‌ సభ్యులకు గృహ రుణాలివ్వాలనే ప్రతిపాదనపై కమిటీ ఏర్పాటు చేశాం. అది నివేదిక ఇచ్చింది. ఆర్థిక మంత్రి అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని ఆయన వివరించారు. వివిధ అంశాలపై ఆయన ఏం చెప్పారనేది ఆయన మాటల్లోనే...


మూడేళ్లకే 25 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు
ఈ ఏడాది జనవరి నుంచి ఎన్‌పీఎస్‌లో 25 శాతం సొమ్మును ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తూ పీఎఫ్‌ఆర్‌డీఏ నిబంధనలను సడలించటం తెలిసిందే. అయితే చందాదారులు ఎన్‌పీఎస్‌లో చేరి కనీసం మూడేళ్లు దాటితేనే ఈ వెసులుబాటు ఉంటుంది. గతంలో సభ్యత్వం తీసుకున్న పదేళ్ల తర్వాతే ఈ ఉపసంహరణకు వీలుండేది.

పథకం మొత్తం కాలంలో 3 సార్లు మాత్రమే ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. గృహ అవసరాలకే కాకుండా సొంతిల్లు కొనేందుకు, అనారోగ్య సమస్యలు, ఉన్నత చదువులు, పిల్లల పెళ్లి వంటి వాటికి ఉప సంహరణ చేసుకునే వీలు కల్పించారు. అయితే చందాదారులకు అప్పటికే వ్యక్తిగత, ఉమ్మడి లేదా పూర్వీకుల ఆస్తి ఉంటే ఉపసంహరణకు వీలుండదు.

పెన్షన్‌ పథకాలన్నీ పీఎఫ్‌ఆర్‌డీఏ పరిధిలోకే..
మ్యూచువల్‌ ఫండ్స్, బీమా సంస్థలు సైతం పెన్షన్‌ పథకాలను నిర్వహిస్తున్నాయి. ఇవి సెబీ, ఐఆర్‌డీఏఐ నియంత్రణలో ఉంటాయి. దేశంలోని అన్ని పెన్షన్‌ పథకాలు పీఎఫ్‌ఆర్‌డీఐ పరిధిలోనే ఉండాలనే ప్రభుత్వాన్ని  కోరాం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ప్రస్తుతం దేశంలో 78 డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్స్‌ ఉన్నాయి. గతంలో ఫండ్‌ మేనేజర్ల కోసం టెండర్లు పిలిచాం. 8 మందిని ఖరారు చేశాం కూడా. అయితే గతంలో ఫండ్‌ మేనేజర్లిచ్చిన ఆర్‌ఎఫ్‌పీ దీనికి చెల్లదు. మళ్లీ తాజా టెండర్లు పిలవాలి. కొత్త ఎఫ్‌డీఐ విధానం ఖరారయ్యాక.. మళ్లీ ఫండ్‌ మేనేజర్ల కోసం టెండర్లు పిలుస్తాం.

పెన్షన్‌ పరిశ్రమకు ప్రత్యేక ఎఫ్‌డీఐ..
ప్రస్తుతం పెన్షన్, బీమా పరిశ్రమ రెండింటికీ ఒకే రకమైన ఎఫ్‌డీఐ నిబంధనలున్నాయి. తాజాగా పెన్షన్‌లో ఎఫ్‌డీఐ నిబంధనల్ని మార్చాలంటూ కమిటీ నివేదించింది. బీమాతో సంబంధం లేకుండా పెన్షన్‌ పరిశ్రమకు ప్రత్యేక ఎఫ్‌డీఐ విధానాన్ని ప్రకటించాలని ఆర్ధిక మంత్రిని, పారిశ్రామిక ప్రోత్సాహకాల, విధాన విభాగాన్ని (డీఐపీపీ) కోరాం. అంతిమ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. 2015లో కేంద్రం బీమా, పెన్షన్‌ పరిశ్రమలో 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐలను 49 శాతానికి పెంచింది.

ఉద్యోగుల్లో 14–15 శాతమే పెన్షన్‌లో...
విదేశాలతో పోలిస్తే మన దేశంలో పెన్షన్‌ చందాదారుల సంఖ్య చాలా తక్కువ. పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో ఆర్ధిక భరోసా కోసం ముందే ఆలోచించకపోతే అనేక ఇబ్బందులు పడాలి. ప్రస్తుతం దేశంలో ప్రతి 12 మందిలో ఒకరు 60 ఏళ్లకు పైబడి ఉన్నారు. 2050 నాటికి ఈ సంఖ్య ఐదుగురిలో ఒకరికి చేరుతుంది.

మొత్తంగా దేశంలో 10 కోట్ల మంది 60 ఏళ్లకు పైబడిన వారున్నారు. 2050 నాటికిది 30 కోట్లకు చేరే అవకాశముంది. ప్రస్తుతం జనాభాలోని ఉద్యోగుల్లో 14–15 శాతమే ఏదో ఒక పెన్షన్‌ పథకంలో చేరారు. ప్రతి 8 మందిలో ఒకరే పెన్షన్‌ పథకంలో చందాదారులుగా ఉన్నారు.

2.05 కోట్ల సభ్యులు; రూ.2.25 లక్షల కోట్లు ఆస్తులు..
2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ ఎన్‌పీఎస్‌లో సభ్యులే. ప్రస్తుతం ఎన్‌పీఎస్, అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) రెండు కలిపి 2.05 కోట్ల మంది చందాదారులున్నారు. రెండింటి నిర్వహణ ఆస్తి విలువ (ఏయూఎం) రూ.2.25 లక్షల కోట్లు. ఈ ఏడాది మార్చి 6 నాటికి ఎన్‌పీఎస్‌ సభ్యులు 13.16 లక్షలకు చేరారు.

ఇందులో 6.83 మంది లక్షల సభ్యులు 4,365 కార్పొరేట్‌ కంపెనీలలో నుంచి ఉన్నారు. నిర్వహణ ఆస్తుల్లో అటల్‌ పెన్షన్‌కు రూ.3,500 కోట్ల వాటా ఉంది. ఈ ఏడాది ముగిసే నాటికి ఏపీవై సభ్యుల సంఖ్యను కోటికి చేర్చాలని లకి‡్ష్యంచాం. వచ్చే ఏడాది కాలంలో సభ్యత్వంలో 28 శాతం, ఏయూఎం 47–48 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. గత ఐదేళ్లలో ఎన్‌పీఎస్‌లో 10 శాతం రిటర్న్స్‌ వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement