పెన్షన్‌ ఇచ్చే ఫండ్స్‌ | Details of Solution Oriented Schemes to Invest in 2020 | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ ఇచ్చే ఫండ్స్‌

Published Mon, Sep 28 2020 5:10 AM | Last Updated on Mon, Sep 28 2020 5:22 AM

Details of Solution Oriented Schemes to Invest in 2020  - Sakshi

రిటైర్మెంట్‌ తర్వాతి జీవనం కోసం కొంత నిధిని ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మందికి సామాజిక భద్రత లేదు. కరెన్సీ విలువను హరించే ద్రవ్యోల్బణానికితోడు.. జీవన అవసరాలు, వ్యయాలు కాలక్రమంలో పెరుగుతూ వెళుతుంటాయి. ఆయుర్ధాయం సైతం గతంతో పోలిస్తే పెరిగింది. కనుక 60 ఏళ్లు వచ్చే నాటికి ప్రతి ఒక్కరి దగ్గర తగినంత నిధి లేకపోతే.. అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాలి.

  ఏదో నామమాత్రపు పొదుపు నిధిని సమకూర్చుకున్నా వృద్ధాప్య అవసరాలను ఎక్కువ కాలం తీర్చలేకపోవచ్చు. అందుకే ముందు నుంచీ భవిష్యత్తుపై ప్రణాళికతో విశ్రాంత జీవనానికి అవసరమైనంత నిధిని సమకూర్చుకోవాలి. ఇందుకోసం ఎన్నో సాధనాలు ఉన్నాయి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌), నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)కు తోడు మ్యూచువల్‌ ఫండ్స్‌ అందించే పెన్షన్‌ ఫండ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సొల్యూషన్‌ ఓరియంటెడ్‌ రిటైర్మెంట్‌ విభాగం కూడా ఒకటి. ఈ ఫండ్స్‌ పనితీరు గురించి తెలియజేసే ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం ఇది.

సొల్యూషన్‌ ఓరియంటెడ్‌ రిటైర్మెంట్‌ కేటగిరీలో.. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్, యాక్సిస్, ఫ్రాంక్లిన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎల్‌ఐసీ, నిప్పన్‌ ఇండియా, ప్రిన్సిపల్, టాటా, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఈక్విటీ, డెట్‌ ఆప్షన్లతో ఎన్నో రకాల రిటైర్మెంట్‌ ప్లాన్లను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిల్లో ఏక మొత్తంలో చేసే పెట్టుబడులు లేదా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో చేసే ప్రతీ పెట్టుబడికి ఐదేళ్లపాటు లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే పెట్టుబడులను ఐదేళ్ల పాటు వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉండదు. ఒకవేళ ఐదేళ్లలోపే రిటైర్మెంట్‌ వయసు వచ్చేస్తే అప్పుడు ఉపసంహరణకు చాన్స్‌ ఉంటుంది.  

పన్ను ప్రయోజనం...
ఈ ఫండ్స్‌ అన్నింటిలోనూ కేవలం ఐదు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు.. ఫ్రాంక్లిన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ, నిప్పన్‌ ఇండియా, యూటీఐ పథకాలకు పెన్షన్‌ ప్లాన్లుగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉంది. అంటే ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనం వీటి ద్వారా పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. మిగిలిన పథకాలకు ఈ ప్రయోజనం లేదు.  

ఎంపికలు ఎన్నో..
పెన్షన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్లాన్లలో రాబడులు ఇన్వెస్టర్ల రిస్క్‌ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయి. ఇవి ఈక్విటీల్లో, డెట్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఎల్‌ఐసీ, ఫ్రాంక్లిన్, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఒక్కొక్క ప్లాన్‌ను మాత్రమే ఆఫర్‌ చేస్తుంటే, మిగిలినవి ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా భిన్నమైన ఆప్షన్లతో ప్లాన్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌ పథకం ప్రోగ్రెస్సివ్, మోడరేట్, కన్జర్వేటివ్‌  పేరుతో మూడు ప్లాన్లను ఆఫర్‌ చేస్తోంది. పేరుకు తగినట్టు ఇవి వరుసగా.. 94 శాతం, 82 శాతం, 28 శాతం చొప్పున ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. యుక్తవయసులోని వారు, మధ్యస్థ వయసు, రిటర్మెంట్‌ వయసులోని వారికి నప్పే విధంగా వీటిని సంస్థ రూపొందించింది. ఈ విభాగంలో మొత్తం 25 పెన్షన్‌ పథకాలు ఉన్నాయి. ఎక్కువ పథకాలకు సంబంధించి ట్రాక్‌ రికార్డు తక్కువ కాలమే అందుబాటులో ఉంది. ఎందుకంటే ఇవన్నీ గత పదేళ్ల కాలంలో వచ్చినవే. అంతేకాకుండా పెట్టుబడులకు సంబంధించి భిన్నమైన సాధనాలను అవి అనుసరిస్తుండడంతో వాటి మధ్య పనితీరును పోల్చడం అంత సరైనది అనిపించుకోదు. ఈక్విటీలకు చేసే కేటాయింపుల ఆధారంగా వీటిని నాలుగు ఉప విభాగాలుగా విభజించి చూడొచ్చు.  

ఈక్విటీలకు 85–100 శాతం
ఈ విభాగంలో ఆరు పథకాలు కనీసం 85 శాతం ఈక్విటీల్లో పెట్టుబడి ఆప్షన్‌తో పనిచేస్తున్నాయి. అధిక రిస్క్‌ తీసుకునే, చిన్న వయసులోని వారికి ఇవి అనుకూలం. ఈ విభాగంలో టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ప్రోగ్రెస్సివ్‌ ప్లాన్‌ ఇతర పథకాల కంటే పనితీరు విషయంలో మెరుగ్గా ఉంది. ఐదేళ్ల పాటు లాకిన్‌ ఉంటుంది. కనుక ఐదేళ్ల కాలంలో ఈ పథకంలో రాబడులను గమనించినట్టయితే వార్షికంగా 11 శాతానికి పైనే ఉన్నాయి. ఏడేళ్లలో వార్షిక రాబడులు 15 శాతానికి పైగా ఉండడం గమనార్హం. ఈ విభాగంలోనే మరో పథకం హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఈక్విటీ ప్లాన్‌ 2016లో ప్రారంభమైంది. కనుక మూడేళ్లలో చూసుకుంటే రాబడులు వార్షికంగా 2 శాతం చొప్పునే ఉన్నాయి. నిప్పన్‌ ఇండియా రిటైర్మెంట్‌ వెల్త్‌ క్రియేషన్‌ ఐదేళ్ల కాలంలో వార్షికంగా ఇచ్చిన రాబడి కేవలం 2.75 శాతంగానే ఉంది. ప్రిన్సిపల్‌ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ప్రోగ్రెస్సివ్‌ ప్లాన్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ రిటైర్మెంట్‌–30, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ రిటైర్మెంట్‌ ఫండ్‌ ప్యూర్‌ ఈక్విటీ పథకాల పనితీరు కూడా అంత మెరుగ్గా లేదు. ముఖ్యంగా ఇటీవలి మార్కెట్‌ పతనంతో రాబడుల తీరు మారిపోయింది. కనుక దీర్ఘకాలంలో ఈ పథకాలు మెరుగైన పనితీరు చూపించే అవకాశం లేకపోలేదు. ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలనుకునే వారు ఈ విభాగంలో టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ప్రోగ్సెస్సివ్‌ ప్లాన్‌ను పరిశీలించొచ్చు.  

ఈక్విటీలకు 65–85 శాతం
ఈ విభాగంలో 9 పథకాలు 65 నుంచి 85 శాతం మేర  ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఆప్షన్‌తో ప్లాన్లలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఒకవైపు అధిక రాబడులకు తోడు కొంత శాతాన్ని డెట్‌కు కేటాయించడం ద్వారా రిస్క్‌ను తగ్గించే విధంగా పనిచేస్తాయి. రిస్క్‌ కొంచెం తక్కువ ఉండాలనుకునే మధ్య వయసు వారికి ఇవి అనుకూలం. ఈ విభాగంలోనూ టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ మోడరేట్‌ ప్లాన్‌ రాబడుల పరంగా ముందున్నది. ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10 శాతం చొప్పున, ఏడేళ్ల కాలంలో వార్షికంగా 15.68 శాతం చొప్పున ఇన్వెస్టర్ల పెట్టుబడులను వృద్ధి చేసింది. ఐదేళ్ల పది నెలల కాలంలో పెట్టుబడులను రెట్టింపు చేసింది. ఈ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ప్లాన్‌ 2016 ఫిబ్రవరిలో మొదలైంది కనుక.. మూడేళ్ల కాలంలో వార్షికంగా ఇచ్చిన రాబడులు 4 శాతంగా ఉన్నాయి. ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ యులిప్స్, ప్రిన్సిపల్‌ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ మోడరేట్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ రిటైర్మెంట్‌ 40, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ హైబ్రిడ్‌ అగ్రెస్సివ్, యాక్సిస్‌ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ డైనమిక్, యాక్సిస్‌ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ అగ్రెస్సివ్, ప్రిన్సిల్‌ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ కన్జర్వేటివ్‌ ప్లాన్లు కూడా ఈ విభాగం కిందకే వస్తాయి.  

హైబ్రిడ్‌ విభాగం..
ఈక్విటీలకు గరిష్టంగా 40 శాతం పెట్టుబడులను కేటాయించే పథకాలు ఇవి. మిగిలిన 60 శాతం నిధులను డెట్‌ విభాగంలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. దీంతో రిస్క్‌ ఎక్కువ శాతం తగ్గుతుంది. తక్కువ రిస్క్‌ ఉండాలనుకునే వారు ఈ విభాగంలోని పథకాలను ఎంచుకోవచ్చు. దీర్ఘకాలంలో అచ్చమైన ఈక్విటీ పథకాలు ఇచ్చినంత రాబడులు వీటిల్లో ఉండవు.   ఈ విభాగంలో టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ కన్జర్వేటివ్‌ ప్లాన్‌ మంచి పనితీరు చూపిస్తోంది. ఐదేళ్ల లో 8 %, ఏడేళ్ల కాలంలో 10% చొప్పున వార్షిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ హైబ్రిడ్‌ డెట్, ఫ్రాంక్లిన్‌ ఇండియా పెన్షన్, నిప్పన్‌ ఇండియా రిటైర్మెంట్‌ ఇన్‌కమ్‌ జనరేషన్, యూటీఐ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ పెన్షన్, యాక్సిస్‌ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ కన్జర్వేటివ్, ఐసీఐసీఐ ప్రు. రిటైర్మెంట్‌ హైబ్రిడ్‌ కన్జర్వేటివ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ రిటైర్మెంట్‌ ఫండ్స్‌–50 ఈ విభాగం కిందకువస్తాయి.

పూర్తి డెట్‌ ఫండ్స్‌
నూరు శాతం పెట్టుబడులను డెట్‌ విభాగంలోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. కనుక ఓ మోస్తరు రాబడులను ఆశించొచ్చు. ఈ విభాగంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ రిటైర్మెంట్‌ 50ప్లస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ రిటైర్మెంట్‌ ప్యూర్‌ డెట్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ రిటైర్మెంట్‌ 50ప్లస్‌ ప్లాన్‌ 2019లోనే ప్రారంభమైంది. ఏడాది కాలంలో రాబడులు 6.63 శాతంగా ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ రిటైర్మెంట్‌ ప్యూర్‌ డెట్‌ ప్లాన్‌ కూడా 2019లోనే ప్రారంభం కాగా, ఏడాది కాలంలో 9.77 శాతం రాబడులను చూపించింది.

ఏవైనా ప్రత్యేకతలు ఉన్నాయా..?
మ్యూచువల్‌ ఫండ్స్‌ పెన్షన్‌ పథకాలకు అదనంగా ఇన్వెస్టర్లు తమ రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకునేందుకు ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాలను కూడా పరిశీలించొచ్చు. కాకపోతే రిటర్మెంట్‌ పేరుతో ఉన్న ప్లాన్లలో ఐదేళ్ల లాకిన్‌ ఉంటుంది. ఏదైనా అవసరమొచ్చినా నిధిని ఖాళీ చేసేయడానికి వీలుండదు. ఇది ఒక విధంగా ప్రయోజనకరమే. అదే ఎన్‌పీఎస్, యూఎల్‌పీపీ ప్లాన్లలో మెచ్యూరిటీ తర్వాత నిర్ణీత మొత్తంతో యాన్యుటి ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెన్షన్‌ ప్లాన్లలో ఇటువంటి నిబంధన లేదు. పెట్టుబడులను ఐదేళ్ల లాకిన్‌ తర్వాత ఎప్పుడైనా లేదా రిటైర్మెంట్‌ సమయంలోనూ పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసేసుకోవచ్చు. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌ పెన్షన్‌ పథకాల్లో సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.. అదే విధంగా సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ రూపంలో కోరుకున్నంత ప్రతీ నెలా వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉంది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, యాక్సిస్, నిప్పన్‌ ఇండియా అయితే ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఇన్వెస్టర్‌కు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ నెలవారీ సిప్‌ మొత్తానికి 100 రెట్లు బీమా కవరేజీని అందిస్తోంది. ఇందుకు రూ.50 లక్షల గరిష్ట పరిమితి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement