Oldage pension
-
పెన్షన్ ఇచ్చే ఫండ్స్
రిటైర్మెంట్ తర్వాతి జీవనం కోసం కొంత నిధిని ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మందికి సామాజిక భద్రత లేదు. కరెన్సీ విలువను హరించే ద్రవ్యోల్బణానికితోడు.. జీవన అవసరాలు, వ్యయాలు కాలక్రమంలో పెరుగుతూ వెళుతుంటాయి. ఆయుర్ధాయం సైతం గతంతో పోలిస్తే పెరిగింది. కనుక 60 ఏళ్లు వచ్చే నాటికి ప్రతి ఒక్కరి దగ్గర తగినంత నిధి లేకపోతే.. అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాలి. ఏదో నామమాత్రపు పొదుపు నిధిని సమకూర్చుకున్నా వృద్ధాప్య అవసరాలను ఎక్కువ కాలం తీర్చలేకపోవచ్చు. అందుకే ముందు నుంచీ భవిష్యత్తుపై ప్రణాళికతో విశ్రాంత జీవనానికి అవసరమైనంత నిధిని సమకూర్చుకోవాలి. ఇందుకోసం ఎన్నో సాధనాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు తోడు మ్యూచువల్ ఫండ్స్ అందించే పెన్షన్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సొల్యూషన్ ఓరియంటెడ్ రిటైర్మెంట్ విభాగం కూడా ఒకటి. ఈ ఫండ్స్ పనితీరు గురించి తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది. సొల్యూషన్ ఓరియంటెడ్ రిటైర్మెంట్ కేటగిరీలో.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్, యాక్సిస్, ఫ్రాంక్లిన్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎల్ఐసీ, నిప్పన్ ఇండియా, ప్రిన్సిపల్, టాటా, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈక్విటీ, డెట్ ఆప్షన్లతో ఎన్నో రకాల రిటైర్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ఏక మొత్తంలో చేసే పెట్టుబడులు లేదా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో చేసే ప్రతీ పెట్టుబడికి ఐదేళ్లపాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే పెట్టుబడులను ఐదేళ్ల పాటు వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉండదు. ఒకవేళ ఐదేళ్లలోపే రిటైర్మెంట్ వయసు వచ్చేస్తే అప్పుడు ఉపసంహరణకు చాన్స్ ఉంటుంది. పన్ను ప్రయోజనం... ఈ ఫండ్స్ అన్నింటిలోనూ కేవలం ఐదు మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. ఫ్రాంక్లిన్, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ, నిప్పన్ ఇండియా, యూటీఐ పథకాలకు పెన్షన్ ప్లాన్లుగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉంది. అంటే ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం వీటి ద్వారా పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. మిగిలిన పథకాలకు ఈ ప్రయోజనం లేదు. ఎంపికలు ఎన్నో.. పెన్షన్ మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్లలో రాబడులు ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయి. ఇవి ఈక్విటీల్లో, డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఎల్ఐసీ, ఫ్రాంక్లిన్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఒక్కొక్క ప్లాన్‌ను మాత్రమే ఆఫర్ చేస్తుంటే, మిగిలినవి ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా భిన్నమైన ఆప్షన్లతో ప్లాన్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ పథకం ప్రోగ్రెస్సివ్, మోడరేట్, కన్జర్వేటివ్ పేరుతో మూడు ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. పేరుకు తగినట్టు ఇవి వరుసగా.. 94 శాతం, 82 శాతం, 28 శాతం చొప్పున ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. యుక్తవయసులోని వారు, మధ్యస్థ వయసు, రిటర్మెంట్ వయసులోని వారికి నప్పే విధంగా వీటిని సంస్థ రూపొందించింది. ఈ విభాగంలో మొత్తం 25 పెన్షన్ పథకాలు ఉన్నాయి. ఎక్కువ పథకాలకు సంబంధించి ట్రాక్ రికార్డు తక్కువ కాలమే అందుబాటులో ఉంది. ఎందుకంటే ఇవన్నీ గత పదేళ్ల కాలంలో వచ్చినవే. అంతేకాకుండా పెట్టుబడులకు సంబంధించి భిన్నమైన సాధనాలను అవి అనుసరిస్తుండడంతో వాటి మధ్య పనితీరును పోల్చడం అంత సరైనది అనిపించుకోదు. ఈక్విటీలకు చేసే కేటాయింపుల ఆధారంగా వీటిని నాలుగు ఉప విభాగాలుగా విభజించి చూడొచ్చు. ఈక్విటీలకు 85–100 శాతం ఈ విభాగంలో ఆరు పథకాలు కనీసం 85 శాతం ఈక్విటీల్లో పెట్టుబడి ఆప్షన్‌తో పనిచేస్తున్నాయి. అధిక రిస్క్ తీసుకునే, చిన్న వయసులోని వారికి ఇవి అనుకూలం. ఈ విభాగంలో టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ప్రోగ్రెస్సివ్ ప్లాన్ ఇతర పథకాల కంటే పనితీరు విషయంలో మెరుగ్గా ఉంది. ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. కనుక ఐదేళ్ల కాలంలో ఈ పథకంలో రాబడులను గమనించినట్టయితే వార్షికంగా 11 శాతానికి పైనే ఉన్నాయి. ఏడేళ్లలో వార్షిక రాబడులు 15 శాతానికి పైగా ఉండడం గమనార్హం. ఈ విభాగంలోనే మరో పథకం హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఈక్విటీ ప్లాన్ 2016లో ప్రారంభమైంది. కనుక మూడేళ్లలో చూసుకుంటే రాబడులు వార్షికంగా 2 శాతం చొప్పునే ఉన్నాయి. నిప్పన్ ఇండియా రిటైర్మెంట్ వెల్త్ క్రియేషన్ ఐదేళ్ల కాలంలో వార్షికంగా ఇచ్చిన రాబడి కేవలం 2.75 శాతంగానే ఉంది. ప్రిన్సిపల్ రిటైర్మెంట్ సేవింగ్స్ ప్రోగ్రెస్సివ్ ప్లాన్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ రిటైర్మెంట్–30, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ఫండ్ ప్యూర్ ఈక్విటీ పథకాల పనితీరు కూడా అంత మెరుగ్గా లేదు. ముఖ్యంగా ఇటీవలి మార్కెట్ పతనంతో రాబడుల తీరు మారిపోయింది. కనుక దీర్ఘకాలంలో ఈ పథకాలు మెరుగైన పనితీరు చూపించే అవకాశం లేకపోలేదు. ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలనుకునే వారు ఈ విభాగంలో టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ప్రోగ్సెస్సివ్ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. ఈక్విటీలకు 65–85 శాతం ఈ విభాగంలో 9 పథకాలు 65 నుంచి 85 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్‌తో ప్లాన్లలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవైపు అధిక రాబడులకు తోడు కొంత శాతాన్ని డెట్‌కు కేటాయించడం ద్వారా రిస్క్‌ను తగ్గించే విధంగా పనిచేస్తాయి. రిస్క్ కొంచెం తక్కువ ఉండాలనుకునే మధ్య వయసు వారికి ఇవి అనుకూలం. ఈ విభాగంలోనూ టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ మోడరేట్ ప్లాన్ రాబడుల పరంగా ముందున్నది. ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10 శాతం చొప్పున, ఏడేళ్ల కాలంలో వార్షికంగా 15.68 శాతం చొప్పున ఇన్వెస్టర్ల పెట్టుబడులను వృద్ధి చేసింది. ఐదేళ్ల పది నెలల కాలంలో పెట్టుబడులను రెట్టింపు చేసింది. ఈ విభాగంలో హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ 2016 ఫిబ్రవరిలో మొదలైంది కనుక.. మూడేళ్ల కాలంలో వార్షికంగా ఇచ్చిన రాబడులు 4 శాతంగా ఉన్నాయి. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ యులిప్స్, ప్రిన్సిపల్ రిటైర్మెంట్ సేవింగ్స్ మోడరేట్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ రిటైర్మెంట్ 40, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హైబ్రిడ్ అగ్రెస్సివ్, యాక్సిస్ రిటైర్మెంట్ సేవింగ్స్ డైనమిక్, యాక్సిస్ రిటైర్మెంట్ సేవింగ్స్ అగ్రెస్సివ్, ప్రిన్సిల్ రిటైర్మెంట్ సేవింగ్స్ కన్జర్వేటివ్ ప్లాన్లు కూడా ఈ విభాగం కిందకే వస్తాయి. హైబ్రిడ్ విభాగం.. ఈక్విటీలకు గరిష్టంగా 40 శాతం పెట్టుబడులను కేటాయించే పథకాలు ఇవి. మిగిలిన 60 శాతం నిధులను డెట్ విభాగంలో ఇన్వెస్ట్ చేస్తాయి. దీంతో రిస్క్ ఎక్కువ శాతం తగ్గుతుంది. తక్కువ రిస్క్ ఉండాలనుకునే వారు ఈ విభాగంలోని పథకాలను ఎంచుకోవచ్చు. దీర్ఘకాలంలో అచ్చమైన ఈక్విటీ పథకాలు ఇచ్చినంత రాబడులు వీటిల్లో ఉండవు. ఈ విభాగంలో టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ కన్జర్వేటివ్ ప్లాన్ మంచి పనితీరు చూపిస్తోంది. ఐదేళ్ల లో 8 %, ఏడేళ్ల కాలంలో 10% చొప్పున వార్షిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ డెట్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, నిప్పన్ ఇండియా రిటైర్మెంట్ ఇన్కమ్ జనరేషన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్, యాక్సిస్ రిటైర్మెంట్ సేవింగ్స్ కన్జర్వేటివ్, ఐసీఐసీఐ ప్రు. రిటైర్మెంట్ హైబ్రిడ్ కన్జర్వేటివ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ రిటైర్మెంట్ ఫండ్స్–50 ఈ విభాగం కిందకువస్తాయి. పూర్తి డెట్ ఫండ్స్ నూరు శాతం పెట్టుబడులను డెట్ విభాగంలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక ఓ మోస్తరు రాబడులను ఆశించొచ్చు. ఈ విభాగంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ రిటైర్మెంట్ 50ప్లస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ప్యూర్ డెట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ రిటైర్మెంట్ 50ప్లస్ ప్లాన్ 2019లోనే ప్రారంభమైంది. ఏడాది కాలంలో రాబడులు 6.63 శాతంగా ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ప్యూర్ డెట్ ప్లాన్ కూడా 2019లోనే ప్రారంభం కాగా, ఏడాది కాలంలో 9.77 శాతం రాబడులను చూపించింది. ఏవైనా ప్రత్యేకతలు ఉన్నాయా..? మ్యూచువల్ ఫండ్స్ పెన్షన్ పథకాలకు అదనంగా ఇన్వెస్టర్లు తమ రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునేందుకు ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాలను కూడా పరిశీలించొచ్చు. కాకపోతే రిటర్మెంట్ పేరుతో ఉన్న ప్లాన్లలో ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. ఏదైనా అవసరమొచ్చినా నిధిని ఖాళీ చేసేయడానికి వీలుండదు. ఇది ఒక విధంగా ప్రయోజనకరమే. అదే ఎన్పీఎస్, యూఎల్‌పీపీ ప్లాన్లలో మెచ్యూరిటీ తర్వాత నిర్ణీత మొత్తంతో యాన్యుటి ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ పెన్షన్ ప్లాన్లలో ఇటువంటి నిబంధన లేదు. పెట్టుబడులను ఐదేళ్ల లాకిన్ తర్వాత ఎప్పుడైనా లేదా రిటైర్మెంట్ సమయంలోనూ పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసేసుకోవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ పెన్షన్ పథకాల్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.. అదే విధంగా సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ రూపంలో కోరుకున్నంత ప్రతీ నెలా వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉంది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, యాక్సిస్, నిప్పన్ ఇండియా అయితే ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఇన్వెస్టర్‌కు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నెలవారీ సిప్ మొత్తానికి 100 రెట్లు బీమా కవరేజీని అందిస్తోంది. ఇందుకు రూ.50 లక్షల గరిష్ట పరిమితి ఉంది. -
‘డబుల్’ పింఛన్లపై వేటు!
సాక్షి, హైదరాబాద్: ఆసరా వృద్ధాప్య పింఛన్లలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా 14,975 మంది పింఛన్లను కాజేసినట్లు తేలింది. పండుటాకులకు ఆపన్నహస్తం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో దంపతుల్లో ఒకరు మాత్రమే పింఛన్‌కు అర్హులు కాగా, అధికారుల కళ్లుగప్పి ఇరువురు పింఛన్ పొందుతున్నట్లు అంతర్గత విచారణలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తేల్చింది. ఈ మేరకు మే నెలకు సంబంధించి దాదాపు 30 వేల (దంపతుల) మంది పింఛన్లను నిలిపివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇన్నాళ్లూ పొందిన పింఛన్ సొమ్మును రికవరీ కూడా చేయాలని నిర్ణయించింది. అక్రమంగా పింఛన్ తీసుకున్నవారి జాబితాను తయారుచేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిçషనర్లకు పంపింది. లబ్ధిదారుల జాబితాను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి అర్హులు/అనర్హుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. ఈ నివేదిక అనంతరం అర్హులుగా తేలితే వారి పింఛన్‌ను విడుదల చేయాలని, అనర్హులుగా గుర్తిస్తే సొమ్మును రికవరీ చేయాలని స్పష్టం చేసింది. సామాజిక భద్రత చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్ బాధితులకు రూ.2,016, వికలాంగులకు ప్రతి నెలా రూ.3,016 పింఛన్‌ను అందజేస్తోంది. అయితే ఈ పథకానికి కుటుంబసభ్యుల్లో ఒకరు మాత్రమే అర్హులు కాగా.. చాలాచోట్ల భార్యాభర్తలు లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన సెర్ప్ యంత్రాంగం జాబితాను తయారు చేసింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1,766, నల్లగొండ 763, మంచిర్యాల 756, కరీంనగర్ 674, రంగారెడ్డి 643, జగిత్యాల 626, నారాయణపేట 623, మేడ్చల్ 585, ఖమ్మం 558, వరంగల్ అర్బన్ జిల్లాలో 546 మంది ఉన్నారు. ఈ మేరకు మే నెలకు సంబంధించి డబుల్ పింఛన్లను ఆపేసింది. ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు కూడా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులెవరైనా వృద్ధాప్య పింఛన్ తీసుకున్నట్లు తేలితే తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబసభ్యులు పింఛన్ పొందేందుకు అనర్హులు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేయడంతో నెలానెలా వచ్చే పింఛన్ సొమ్మే వారికి ఆసరా అవుతోంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల పోçషణాభారం భరించని ఉద్యోగుల వేతనాల నుంచి కట్ చేసి.. నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని చట్టం చెబుతుంది. ఈ నేపథ్యంలో వృద్ధుల పింఛన్ కట్ అయిన పక్షంలో నెలవారీ కొంత మొత్తాన్ని ఉద్యోగులు తమ తల్లిదండ్రులకు ఇచ్చేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించింది. అదేవిధంగా ఇప్పటివరకు అక్రమంగా పొందిన పింఛన్ సొమ్మును ఆయా ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు పొందుతున్న లబ్ధిదారుల జాబితాను స్వయంగా తనిఖీ చేసి నివేదికలు పంపాలని ఎంపీడీవోలు, పురపాలకసంఘాల కమిషనర్లను ఆదేశించింది. -
సీనియర్ సిటిజన్లకు మరో చాన్స్
ఎల్ఐసీ ఆఫర్ చేస్తున్న పెన్షన్ పథకమే ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై). ఇందులో చేసిన పెట్టుబడులపై పదేళ్ల పాటు క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది. పదవీ విరమణ తీసుకున్న వారికి.. వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న మెరుగైన పథకాల్లో ఇది కూడా ఒకటి. దీనిని 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. తొలుత ఏడాది పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం ఇవ్వగా, ఈ గడువును 2020 మార్చి వరకు పొడిగించారు. తాజాగా దీనిని మరో మూడేళ్ల పాటు 2023 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కనుక ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయని వారికి మరో మూడేళ్ల పాటు ఇది అందుబాటులో ఉన్నట్టే. 60 ఏళ్లు, అంతకుపైన వయసున్న ప్రతీ ఒక్కరూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అర్హులే. ఇన్వెస్ట్మెంట్ కాల వ్యవధి 10 ఏళ్లు. ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల పాటు పెన్షన్ అందుకోవచ్చు. గడువు తీరిన తర్వాత పెట్టుబడి మొత్తం(చార్జీలు పోను) తిరిగి వస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో మరణం చోటు చేసుకుంటే నామినికీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి కానీ, లేదా ఎల్ఐసీ ఆన్లైన్ పోర్టల్ నుంచి కానీ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెన్షన్ చెల్లింపులు ఇలా.. ఇన్వెస్ట్ చేసి, ప్రతీ నెలా నిర్ణీత మొత్తం పెన్షన్‌గా అందుకోవాలని ఆశించే వారి ముందున్న స్థిరాదాయ పథకాల్లో.. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌తోపాటు పీఎంవీవీవై కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై 2020–21 ఆర్థిక సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000. గరిష్ట నెలవారీ పెన్షన్ రూ.10,000. త్రైమాసికం వారీగా అయితే కనీసం రూ.3,000, గరిష్టంగా రూ.30,000, ఆరు నెలలకోసారి అయితే కనీసం రూ.6,000, గరిష్టంగా రూ.60,000.. వార్షికంగా అయితే కనీసం రూ.12,000, గరిష్టంగా రూ.1,20,000 పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంది. నెలవారీగా కనీసం రూ.1,000 పెన్షన్ తీసుకోవాలని భావిస్తే చేయాల్సిన పెట్టుబడి రూ.1,62,162. వార్షికంగా ఒకే విడత రూ.12,000 పెన్షన్ కోసం రూ.1,56,658ని ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ పాలసీలో గరిష్టంగా ఒక వ్యక్తి రూ.15లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెఫ్ట్ లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ రూపంలో పెన్షన్ చెల్లింపులు అందుకోవచ్చు. రాబడులు.. వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం పీఎంవీవీవైపైనా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 8 శాతం రాబడి రేటు ఉండగా, దీనికి 7.40 శాతానికి కేంద్రం తగ్గించింది. పైగా 2020–21 సంవత్సరానికే ఈ రేటు వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో సంబంధిత సంవత్సరానికి రేటును నిర్ణయిస్తారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరే పీఎంవీవీవై పథకం రేట్లను కూడా సవరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడం గమనార్హం. పైగా గరిష్ట రేటు 7.75 శాతానికే పరిమితం చేశారు. ఈ ఏడాది మార్చి వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.6 శాతం వడ్డీ రేటుతో అత్యంత ఆకర్షణీయమైన సాధనంగా ఉండేది. కానీ, ఇటీవలే కేంద్రం ఈ రేటును 7.4 శాతానికి తగ్గించేసింది. దీనికి తగినట్టుగానే పీఎంవీవీవై పథకంలో రేటును గతంలో ఉన్న 8 శాతం నుంచి 7.4 శాతానికి సవరించినట్టు అర్థం చేసుకోవాలి. దీంతో రాబడుల పరంగా రెండు పథకాల మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు కొనసాగించుకోవచ్చు. పీఎంవీవీవైతో పోలిస్తే తక్కువ కాల వ్యవధి ఉండడం ఇందులోని సౌలభ్యం. పన్ను బాధ్యతలు.. పీఎంవీవీవైలో పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు లేవని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో అయినా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అయినా అందుకునే రాబడి వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎవరికి వారే తమ వ్యక్తిగత ఆదాయ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే అందుకునే ఆదాయం మొత్తం రూ.50వేలు మించకపోతే సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పన్ను రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు పెట్టుబడుల్లో రూ.1.50 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ రెండింటిలో ఏ పథకంలో అయినా గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలుగానే ఉంది. కనుక ఒక పథకంలో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయగా, ఇంకా అదనంగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే రెండో పథకాన్ని ఎంచుకోవచ్చు. ముందుగా వైదొలగాలంటే.. పీఎంవీవీవై పదేళ్ల కాల వ్యవధి పథకం. అసాధారణ పరిస్థితుల్లో పదేళ్లకు ముందుగానే పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉంది. ఉదాహరణకు.. ప్రాణాంతక, తీవ్ర వ్యాధుల్లో చికిత్సల కోసం పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. పాలసీదారు, ఆమె లేదా అతని జీవిత భాగస్వామి చికిత్సల ఖర్చుల కోసం ఇం దుకు అనుమతిస్తారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 98% సరెండర్ వ్యా ల్యూగా లభిస్తుంది. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాత నుంచి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడి మొత్తం విలువలో 75% వరకు రుణ అర్హత ఉంటుంది. ఎల్ఐసీయే రుణ సదుపాయం కల్పిస్తుంది. ఇచ్చిన రుణానికి చెల్లించాల్సిన మొ త్తాన్ని పెన్షన్ చెల్లింపుల నుంచి మినహాయించుకుంటుంది. గడువు తీరే వరకు ఆ రుణం బకాయిలు మిగిలి ఉంటే.. చివరిగా చేసే చెల్లిం పుల మొత్తం నుంచి ఆ మేరకు మినహాయించుకోవడం జరుగుతుంది. లుకప్ పీరియడ్.. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన వారు తమకు పథకం వివరాలు నచ్చకపోతే 15 రోజుల్లోపు (ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసిన వారికి 30 రోజులు) వెనక్కిచ్చేయవచ్చు. దీన్నే లుకప్ పీరియడ్‌గా పేర్కొంటారు. స్టాంప్ చార్జీల మేరకు నష్టపోవాల్సి వస్తుంది. చార్జీలు ఉన్నాయ్.. పీఎంవీవీవైలో పెట్టుబడులపై తొలి ఏడాది 0.50 శాతాన్ని వ్యయాల కింద కోసుకునేందుకు వీలుంది. రెండో ఏడాది నుంచి తదుపరి తొమ్మిదేళ్లు ఈ చార్జీ 0.3 శాతంగా అమలవుతుంది. అయితే, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఈ విధమైన చార్జీలు ఏవీ ఉండవు. కనుక రెండింటిలో ఒకటే కోరుకునేట్టు అయితే.. మూడు నెలలకు ఓసారి పెన్షన్ వచ్చినా ఇబ్బంది లేదనుకునే వారికి.. పీఎంవీవీవైతో పోలిస్తే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ బెటర్. పూర్తి భద్రత.. ఈ పథకంలో పెట్టుబడులు, రాబడులకు పూర్తి భద్రత ఉంటుంది. ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది. -
మృతుల పేరుతో పింఛన్ స్వాహా చేసిన జన్మభూమి కమిటీలు
అధికారం ఉన్న ఐదేళ్లూ సంపాదన కోసం అడ్డమైన గడ్డీ తిన్న టీడీపీ నేతలు ఆఖరుకు మృతులను వదల్లేదు. దాదాపు 59 మంది మృతుల పేరుతో రూ.14.20 లక్షలు స్వాహా చేసినట్లు వెలుగుచూసింది. ఇందులో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యుల ఘనకార్యమే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి అక్రమాలకు సహకరించిన ఎనిమిది మందిపై కమిషనర్ వేటు వేశారు. సాక్షి, అనంతపురం న్యూసిటీ: టీడీపీ ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ ఛోటా నాయకులు అందినకాడికి దోచుకున్నారు. సంపాదనే పరమావధిగా అధికారులనూ పక్కదారి పట్టించారు. చివరకు మరణించిన వారి పేరుతోనూ పింఛన్లు తీసుకుని రూ.లక్షలు స్వాహా చేశారు. ఎమ్మెల్యే ‘అనంత’ చొరవతో ... ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నగరంలోని అక్రమ పింఛన్లు తొలగించి అర్హులకు పింఛన్లు అందించాలని కమిషనర్ పి. ప్రశాంతిని కోరారు. దీంతో ఆమె ఈ నెల 18 నుంచి 21 వరకు 9 మంది కూడిన సోషల్ ఆడిట్ బృందం సభ్యులు నగరంలోని 18 డివిజన్లలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. వారు 638 మంది పింఛన్లను (పీడీఓ అథెంటికేషన్) తనిఖీ చేయగా అందులో 273 పింఛన్‌దారుల ఆధార్, రేషన్‌కార్డు తదితర వివరాలు సరిగా నమోదు కాలేదు. ఈ క్రమంలోనే మృతి చెందిన 56 మంది పేరున పింఛన్లు డ్రా చేస్తున్నట్లు తేల్చారు. ఇలా మృతి చెందిన వారు పేరుతో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు రూ.14,20,800 స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఎనిమిది మందిపై వేటు ... అక్రమ పింఛన్ల బాగోతంపై ఇప్పటికే కమిషనర్ ప్రశాంతికి కొన్ని ఫిర్యాదులందాయి. వాటిపై విచారణ జరిపిన కమిషనర్ అక్రమాలు నిజమని తేలడంతో ఎనిమిదిమంది నగరపాలక సంస్థ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా సోషల్ ఆడిట్లో 56 మంది మృతుల పేరుతో పింఛన్లు తీసుకున్నట్లు స్పష్టంగా తెలిసింది. ఈ అక్రమ పింఛన్లలో టీడీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అప్పటి ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూపలకు తెలిసే ఈ అక్రమ బాగోతం జరిగిందని నగరపాలక సంస్థ అధికారులు వాపోతున్నారు. దీంతో అక్రమ బాగోతానికి సహకరించిన వారిపైనా వేటుపడే అవకాశం ఉంది. ఇప్పటికి కేవలం 18 డివిజన్లలోనే సోషల్ ఆడిట్ జరగ్గా...మిగతా డివిజన్లలోనూ ఆడిట్ జరిగితే భారీగా అక్రమ పింఛన్లు తేలే అవకాశం ఉందని, అదే జరిగితే ఇంకా ఎంతమందిపై వేటు పడుతుందోనని అధికారుల్లో వణుకు పుడుతోంది. రికవరీ చేస్తాం బీకేఎస్ సోషల్ ఆడిట్ టీం ద్వారా సర్వే చేసేలా చర్యలు తీసుకున్నాం. 56 మంది మృతుల పేరుతో పింఛన్ సొమ్మును అక్రమంగా డ్రా చేశారు. పీడీఓల నుంచి డ్రా చేసిన మొత్తాన్ని రికవరీ చేయిస్తాం. దీంతో పాటుగా క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తా. ఇంకా రెండ్రోజుల పాటు ఆడిట్ జరుగుతుంది. అన్ని డివిజన్లలో సోషల్ ఆడిట్ చేసి అక్రమ పింఛన్లుంటే వెలికితీస్తాం. – పి. ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ -
‘కరుప్పాయి.. సిగ్గుతో ఉరేసుకోవాలనిపిస్తుంది’
చెన్నై: బహిరంగ మరుగుదొడ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవసరం నిమిత్తం ఓ పది నిమిషాలు వెళ్లాల్సి వస్తేనే.. ఏదో నరకంలోకి అడుగుపెడుతున్నట్లు భావిస్తాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా 19 సంవత్సరాల నుంచి ఆ మరుగుదొడ్డిలోనే నివసిస్తుంది. వినడానికే జుగుప్సాకరంగా ఉంటే.. అక్కడే జీవనం సాగిస్తున్న సదరు మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఈ హృదయవిదారక సంఘటన తమిళనాడులోని మధురైలో వెలుగు చూసింది. వివరాలు.. కరుప్పాయి(65) అనే వృద్ధురాలు గత 19 ఏళ్లుగా మదురై రామ్నాద్ ప్రాంతంలో బహిరంగ మరుగుదొడ్లో నివాసం ఉంటుంది. టాయిలెట్ వినియోగించుకోవడానికి వచ్చే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ.. మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ అక్కడే జీవనం సాగిస్తుంది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కరుప్పాయి దీనగాథ గురించి ప్రచురించడంతో ఆమె అవస్థ గురించి జనాలకు తెలిసింది. ఏఎన్ఐ కథనం ప్రకారం.. కరుప్పాయి భర్త మరణించాడు. ఓ కూతురు ఉంది కానీ ఆమె తల్లిని పట్టించుకోవడం మానేసింది. ఈ క్రమంలో ఎవరూ లేని కరుప్పాయి గత 19 ఏళ్లుగా బహిరంగ మరుగుదొడ్లను తన నివాసంగా చేసుకుని దాని మీద వచ్చే అతి తక్కువ ఆదాయంతో రోజులు వెళ్లదీస్తుంది. కరుప్పాయికి కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా లభించడం లేదు. Madurai: 65-year-old Karuppayi has been living in a public toilet in Ramnad for past 19 years, & earning her livelihood by cleaning the toilets & charging a meager amount from public for using it. #TamilNadu pic.twitter.com/UA1Zmo0pNS — ANI (@ANI) August 22, 2019 ఈ విషయం గురించి కరుప్పాయిని ప్రశ్నించగా.. ‘వృద్ధాప్య పెన్షన్‌కు అప్లై చేశాను. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నాకొక ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా ఎందరో అధికారులను కలిశాను. కానీ ఎవరు నా మొర ఆలకించలేదు. దాంతో ఈ మరుగుదొడ్లోనే ఒక దాన్ని నా నివాసంగా మార్చుకుని ఇక్కడే కాలం వెళ్లదీస్తున్నాను. వీటి మీద రోజుకు నాకు రూ.70-80 ఆదాయం లభిస్తుంది.అదే నా జీవనాధారం. నాకు ఓ కుమార్తె ఉంది కానీ తను నన్ను పట్టించుకోదు’ అంటూ కరుప్పాయి వాపోయింది. ప్రస్తుతం కరుప్పాయి కథనం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొందరు నెటిజన్లు ఈ కథనాన్ని నరేంద్రమోదీకి ట్యాగ్ చేస్తూ.. ఆమెకు ఇంటిని, పెన్షన్‌ను మంజూరు చేసి ఆదుకోమ్మని కోరుతుండగా.. మరి కొందరు ‘నీలాంటి పేదలు, వృద్ధులను సరిగా పట్టించుకోని ఈ సమాజం సిగ్గుతో ఉరి వేసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుంది’.. ‘ఈ దేశం పేదలకోసం కాదు’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దీనురాలి మొర ఆలకిస్తుందో లేదో చూడాలి. -
‘ఆసరా’గా నిలిచిన సాక్షి
‘జనపథం’లో 10 మంది వృద్ధులకు పింఛన్ మంజూరు అక్కడికక్కడే పరిష్కారం చూపిన మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు: ‘సాక్షి’ జనపథం వృద్ధులకు అండగా నిలిచింది. అర్హులై ఉండి జాబితాలో పేర్లురాక పింఛన్ కోల్పోయి దిగాలుచెందుతున్న పండుటాకులకు ‘సాక్షి’ నిర్వహించిన జనపథం ‘ఆసరా’ కల్పించింది. తాండూరు ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చొరవతో 10 మంది వృద్ధులకు పింఛను మంజూరైంది. సమగ్ర కుటుంబ సర్వేలో కొందరి వృద్ధుల డేటా లేకపోవడం, సర్వేలో వయసు తక్కువగా నమోదు కావడం, సాంకేతిక కారణాలతో కొందరు వృద్ధులు పింఛను కోసం పెట్టుకున్న అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి. అలాంటి అర్హులకు ‘ఆసరా’ కల్పించేందుకు శుక్రవారం యాలాల మండలం రాస్నం గ్రామంలో ‘సాక్షి’ జనపథం కార్యక్రమం నిర్వహించింది. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ ముక్తిపాడు సాయన్నగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్, ఎంపీడీఓ సౌజన్య, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామారావు, సర్పంచ్ పద్మలత, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, నాయకులు సురేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనంతయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు 65 ఏళ్లు నిండినా పింఛనుకు ఎంపిక చేయలేదని కొందరు వృద్ధులు, గతంలో పింఛను అందుకున్నామని, ఇప్పుడు తీసేశారని మరికొందరు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆధార్, రేషన్ కార్డులు వెంట తెచ్చుకుని చూపించారు. అక్కడే ఉన్న పింఛన్ల వెరిఫికేషన్ ఆఫీసర్ శేఖర్‌తో మాట్లాడిన మంత్రి.. పింఛన్ల రద్దుకు గల కారణాలను తెలుసుకున్నారు. కంప్యూటర్లో సాంకేతికలోపం వల్ల ఇలా జరిగిందని సమాధానం రావడంతో.. అప్పటికప్పుడు పది మంది వృద్ధులకు చెందిన డేటాను పరిశీలించి వారందరినీ అర్హులుగా తేల్చారు. ‘సాక్షి’ కృషి అభినందనీయం: మంత్రి మహేందర్‌రెడ్డి మాది పేదల ప్రభుత్వమని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. నిజమైన అర్హులను గుర్తించి వారికి అన్యాయం జరగకుండా చూస్తున్న ‘సాక్షి’ కృషి అభినందనీయమన్నారు.అప్పటికప్పుడు పింఛన్లకు ఎంపికైన వృద్ధుల వివరాలు 1. వడ్ల బక్కప్ప (తండ్రి పేరు వీరప్ప) : ఎస్కేఎస్ డేటాలో వయస్సు తక్కువుండి ఆధార్ పరిశీలన ద్వారా ఎంపిక 2. కోటం అనసూజమ్మ (భర్త పేరు బాల్‌రెడ్డి): ఎస్కేఎస్ డేటాలో వయసు తక్కువ ఉండి ఆధార్ పరిశీలన ద్వారా మంజూరు 3. దోమ పుష్య మాణెమ్మ (భర్త పేరు సంగప్ప): గ్రామస్తుల ద్వారా వాకబు చేసి వితంతు పింఛను మంజూరు 4. ఎన్కెపల్లి లక్ష్మయ్య (తండ్రిపేరు అనంతి): ఎస్కేఎస్ డేటాలో వయసు తక్కువగా ఉండటంతో, ఓటరు ఐడీ, రేషన్ కార్డు ఆధారంగా పింఛను మంజూరు 5. గాండ్ల వీరన్న (తండ్రిపేరు గాండ్ల వీరప్ప): ఎస్కేఎస్ డేటాలో వయసు తక్కువుండటంతో ఓటరు ఐడీ, రేషన్ కార్డు ద్వారా పింఛను మంజూరు 6. ఆకుల లింగం (తండ్రి పేరు ఆకుల శివప్ప): ధ్రువపత్రం ఆధారంగా వయసు లేకపోయినా ఫిజికల్ అప్పిరీయన్స్ ద్వారా ఎంపిక 7. కుమ్మరి రాములు (తండ్రి పేరు పాపయ్య): ఎస్కేఎస్ డేటాలో వివరాలు లేకపోవడంతో వైకల్యం సర్టిఫికెట్ ఆధారంగా పింఛను మంజూరు 8. సంగెం అనంతయ్య: ఎస్కేఎస్ డేటాలో వివరాలు లేకపోవడంతో వైకల్యం సర్టిఫికెట్ ఆధారంగా.. 9. సబిత: ఎస్కేఎస్ డేటాలో వివరాలు లేకపోవడంతో వైకల్యం సర్టిఫికెట్ ఆధారంగా.. 10. పసుల చంద్రయ్య (తండ్రి పేరు రాజప్ప): ఎస్కేఎస్ డేటాలో వయసు తక్కువగా ఉండటంతో ఓటరు ఐడీ, రేషన్ కార్డు ఆధారంగా పింఛను మంజూరు. పండుటాకులకు అండగా నిలుస్తాం నిస్సహాయులకు చేదోడుగా నిలిచిన ‘సాక్షి’ జనపథంలో మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు/యాలాల: పండుటాకులకు అండగా ఉంటామని మంత్రి మహేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పింఛన్ రాలేదని ఆందోళన చెందవద్దని చెప్పారు. శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో రాస్నం గ్రామంలో నిర్వహించిన జనపథంలో పాల్గొన్న మంత్రి ఎదుట పింఛను కోల్పోయిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గోడు వెళ్లబోసుకున్నారు. వారి నుంచి వివరాలు తీసుకున్న మంత్రి జాబితాను సరిచేసి పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నారని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సాయన్న గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రామారావు, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ సౌజన్య, సర్పంచ్ పద్మలత, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి పాల్గొన్నారు. వారికి పింఛన్లు ఇవ్వండి.. ‘సారూ.. నా పేరు దోమ పుష్య మాణెమ్మ.. భర్త శానేండ్ల కిందనే చనిపోయిండు. కొడుకులు లేరు. ఓ కూతురు ఉంది. నాకు పింఛన్ రావడం లేదు. గతంలో నాకు వితంతు పింఛన్ డబ్బులు వచ్చేవి. లిస్టు నా పేరు లేదు’. అంటూ ఓ మహిళ మంత్రి ఎదుట ఆవేదన వెలిబుచ్చింది. దీంతో మంత్రి స్పందిస్తూ.. ఆమె పేరు లిస్టులో ఎందుకు రాలేదని దరఖాస్తుల పరిశీలన అధికారి శేఖర్‌ను ప్రశ్నించారు. కొన్ని సాంకేతిక కారణాలతో పేరు రాలేకపోయి ఉండవచ్చని ఆయన సమాధానమిచ్చారు. దీంతో మాణెమ్మ పేరును జాబితాలో చేర్చాలని ఎంపీడీఓను మంత్రి ఆదేశించారు. ఇలా.. కోటం అనసూజమ్మ, దోమ పుష్య మాణెమ్మ, ఎన్కెపల్లి లక్ష్మయ్య, గాండ్ల వీర న్న, ఆకుల లింగం, కుమ్మరి రాములు, సబిత, పసుల చంద్రయ్య తదితరులకు పింఛన్ ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా.. పింఛన్లు రాక ఆందోళన చెందుతున్న వారికి భరోసా కల్పించే దిశగా ‘సాక్షి’ జనపథం సాగింది. -
ఆసరా పోయిందని కుప్పకూలారు
* ఏడుగురు మృతి * మృతుల్లో హైదరాబాద్‌వాసి సాక్షి నెట్వర్క్: ఇంతకాలం తమ జీవితాలను ఆసరాగా ఉన్న పింఛన్లు ఇక రావనే బెంగతో వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు మరణించారు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన కొయ్యడ కొంరయ్య(80)కి గతంలో వృద్ధ్యాప్య పింఛన్ వచ్చేది. తాజా జాబితాలో కొంరయ్య పేరు లేదు. దీంతో మనస్తాపానికి చెంది బుధవారం గుండెపోటుకు గురయ్యాడు. ఇదే మండలం కిష్టంపల్లెకు చెం దిన బొనాల రాజయ్య(85) పేరూ జాబితాలో లేకపోవడంతో మనస్తాపం చెంది మరణించా డు. ఇదే జిల్లా హుజూరాబాద్ మండలం వెంకట్రావ్‌పల్లిగ్రామానికి చెందిన అట్ల ఎల్లయ్య(80)కు గతంలో పింఛన్ వచ్చేది. ఇటీవల గ్రామంలో కొందరికి పింఛన్లు పంపిణీ చేశారు. ఎల్లయ్యకు సదరు జాబితాలో పింఛన్ రాలేదు. దీంతో తనకు పింఛన్ వస్తుందో రాదోనని ఆందోళనకు గురైన ఎల్లయ్య గుండెపోటుకు గురై మృతి చెందాడు. అయితే, ఎల్లయ్య పింఛన్ మంజూ రైందని తహశీల్దార్ నాగేశ్వరరావు తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ గ్రామానికి చెందిన మేతరి సాయిలు(45) వికలాంగుడు. ఎకరం భూమి ఉంది. సాగునీటి వసతి లేకపోవడంతో అప్పు చేసి రెండేళ్ల క్రితం బోరు వేయగా, నీరు పడలేదు. దీంతో ఆరుతడి పంటలే వేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి వేయగా, వర్షాభావ పరిస్థితుల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. ఇదే క్రమంలో సాయిలుకు వస్తున్న పింఛన్ సైతం ఆగిపోయింది. వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగిన సాయిలు మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన సదరం క్యాంపునకు హాజరయ్యాడు. ఇంటికి వచ్చిన సాయిలు అప్పులు ఎలా తీర్చాలోనని, పింఛన్ వస్తుందో రాదోనని మదనపడ్డాడు. బుధవారం వేకువ జామున మనోవేదనతో గుండెపోటుకు గురయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దూరుకు చెందిన సంగిశెట్టి చెన్నమ్మ(75) పదేళ్లుగా పింఛన్ పొందుతోంది. తాజా జాబితాలో చెన్నమ్మ పేరు లేదు. దీంతో వారం రోజులుగా బెంగపట్టుకుంది. మూడు రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరిగింది. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయింది. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం ఖానాపురం గ్రామానికి చంఎదిన బచ్చలి వెంకటయ్య పింఛన్ జాబితాలో పేరులేకపోవడంతో మనస్తాపంతో మృతి చెందాడు. ఇదిలా ఉండ గా, హైదరాబాద్‌లోని కార్వాన్ తాళ్లగడ్డకు చెం దిన గోనెల నారాయణ(68)కు గతంలో పింఛ న్ వచ్చేది. ఈసారి రాకపోవడంతో పింఛన్ ఇచ్చే కేంద్రానికి, తహసీల్దార్ కార్యాల యానికి వారం రోజులపాటు తిరిగాడు. మంగళవారం కూడా ఈ రెండు చోట్లకు వెళ్లాడు. పింఛన్ రాలేదనే బెం గతో ఇంటికి చేరాడు. ఒంట్లో నలతగా ఉండ డంతో బుధవారం కుటుంబసభ్యులు ఉస్మాని యా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు.