ఎల్‌ఐసీ ఆఫర్ చేస్తున్న పెన్షన్ పథకమే ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై). ఇందులో చేసిన పెట్టుబడులపై పదేళ్ల పాటు క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది. పదవీ విరమణ తీసుకున్న వారికి.. వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న మెరుగైన పథకాల్లో ఇది కూడా ఒకటి. దీనిని 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. తొలుత ఏడాది పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం ఇవ్వగా, ఈ గడువును 2020 మార్చి వరకు పొడిగించారు. తాజాగా దీనిని మరో మూడేళ్ల పాటు 2023 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కనుక ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయని వారికి మరో మూడేళ్ల పాటు ఇది అందుబాటులో ఉన్నట్టే.
60 ఏళ్లు, అంతకుపైన వయసున్న ప్రతీ ఒక్కరూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అర్హులే. ఇన్వెస్ట్‌మెంట్ కాల వ్యవధి 10 ఏళ్లు. ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల పాటు పెన్షన్ అందుకోవచ్చు. గడువు తీరిన తర్వాత పెట్టుబడి మొత్తం(చార్జీలు పోను) తిరిగి వస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో మరణం చోటు చేసుకుంటే నామినికీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి కానీ, లేదా ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్ నుంచి కానీ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పెన్షన్ చెల్లింపులు ఇలా..
ఇన్వెస్ట్ చేసి, ప్రతీ నెలా నిర్ణీత మొత్తం పెన్షన్‌గా అందుకోవాలని ఆశించే వారి ముందున్న స్థిరాదాయ పథకాల్లో.. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌తోపాటు పీఎంవీవీవై కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై 2020–21 ఆర్థిక సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000. గరిష్ట నెలవారీ పెన్షన్ రూ.10,000. త్రైమాసికం వారీగా అయితే కనీసం రూ.3,000, గరిష్టంగా రూ.30,000, ఆరు నెలలకోసారి అయితే కనీసం రూ.6,000, గరిష్టంగా రూ.60,000.. వార్షికంగా అయితే కనీసం రూ.12,000, గరిష్టంగా రూ.1,20,000 పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంది. నెలవారీగా కనీసం రూ.1,000 పెన్షన్ తీసుకోవాలని భావిస్తే చేయాల్సిన పెట్టుబడి రూ.1,62,162. వార్షికంగా ఒకే విడత రూ.12,000 పెన్షన్ కోసం రూ.1,56,658ని ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ పాలసీలో గరిష్టంగా ఒక వ్యక్తి రూ.15లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెఫ్ట్ లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ రూపంలో పెన్షన్ చెల్లింపులు అందుకోవచ్చు.
రాబడులు..
వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం పీఎంవీవీవైపైనా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 8 శాతం రాబడి రేటు ఉండగా, దీనికి 7.40 శాతానికి కేంద్రం తగ్గించింది. పైగా 2020–21 సంవత్సరానికే ఈ రేటు వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో సంబంధిత సంవత్సరానికి రేటును నిర్ణయిస్తారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరే పీఎంవీవీవై పథకం రేట్లను కూడా సవరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడం గమనార్హం. పైగా గరిష్ట రేటు 7.75 శాతానికే పరిమితం చేశారు. ఈ ఏడాది మార్చి వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.6 శాతం వడ్డీ రేటుతో అత్యంత ఆకర్షణీయమైన సాధనంగా ఉండేది. కానీ, ఇటీవలే కేంద్రం ఈ రేటును 7.4 శాతానికి తగ్గించేసింది. దీనికి తగినట్టుగానే పీఎంవీవీవై పథకంలో రేటును గతంలో ఉన్న 8 శాతం నుంచి 7.4 శాతానికి సవరించినట్టు అర్థం చేసుకోవాలి. దీంతో రాబడుల పరంగా రెండు పథకాల మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు కొనసాగించుకోవచ్చు. పీఎంవీవీవైతో పోలిస్తే తక్కువ కాల వ్యవధి ఉండడం ఇందులోని సౌలభ్యం.
పన్ను బాధ్యతలు..
పీఎంవీవీవైలో పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు లేవని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో అయినా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అయినా అందుకునే రాబడి వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎవరికి వారే తమ వ్యక్తిగత ఆదాయ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే అందుకునే ఆదాయం మొత్తం రూ.50వేలు మించకపోతే సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పన్ను రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు పెట్టుబడుల్లో రూ.1.50 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ రెండింటిలో ఏ పథకంలో అయినా గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలుగానే ఉంది. కనుక ఒక పథకంలో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయగా, ఇంకా అదనంగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే రెండో పథకాన్ని ఎంచుకోవచ్చు.
ముందుగా వైదొలగాలంటే..
పీఎంవీవీవై పదేళ్ల కాల వ్యవధి పథకం. అసాధారణ పరిస్థితుల్లో పదేళ్లకు ముందుగానే పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉంది. ఉదాహరణకు.. ప్రాణాంతక, తీవ్ర వ్యాధుల్లో చికిత్సల కోసం పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. పాలసీదారు, ఆమె లేదా అతని జీవిత భాగస్వామి చికిత్సల ఖర్చుల కోసం ఇం దుకు అనుమతిస్తారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 98% సరెండర్ వ్యా ల్యూగా లభిస్తుంది. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాత నుంచి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడి మొత్తం విలువలో 75% వరకు రుణ అర్హత ఉంటుంది. ఎల్‌ఐసీయే రుణ సదుపాయం కల్పిస్తుంది. ఇచ్చిన రుణానికి చెల్లించాల్సిన మొ త్తాన్ని పెన్షన్ చెల్లింపుల నుంచి మినహాయించుకుంటుంది. గడువు తీరే వరకు ఆ రుణం బకాయిలు మిగిలి ఉంటే.. చివరిగా చేసే చెల్లిం పుల మొత్తం నుంచి ఆ మేరకు మినహాయించుకోవడం జరుగుతుంది.
లుకప్ పీరియడ్..
పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన వారు తమకు పథకం వివరాలు నచ్చకపోతే 15 రోజుల్లోపు (ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి 30 రోజులు) వెనక్కిచ్చేయవచ్చు. దీన్నే లుకప్ పీరియడ్‌గా పేర్కొంటారు. స్టాంప్ చార్జీల మేరకు నష్టపోవాల్సి వస్తుంది.
చార్జీలు ఉన్నాయ్..
పీఎంవీవీవైలో పెట్టుబడులపై తొలి ఏడాది 0.50 శాతాన్ని వ్యయాల కింద కోసుకునేందుకు వీలుంది. రెండో ఏడాది నుంచి తదుపరి తొమ్మిదేళ్లు ఈ చార్జీ 0.3 శాతంగా అమలవుతుంది. అయితే, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఈ విధమైన చార్జీలు ఏవీ ఉండవు. కనుక రెండింటిలో ఒకటే కోరుకునేట్టు అయితే.. మూడు నెలలకు ఓసారి పెన్షన్ వచ్చినా ఇబ్బంది లేదనుకునే వారికి.. పీఎంవీవీవైతో పోలిస్తే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ బెటర్.
పూర్తి భద్రత..
ఈ పథకంలో పెట్టుబడులు, రాబడులకు పూర్తి భద్రత ఉంటుంది. ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది.
సీనియర్ సిటిజన్లకు మరో చాన్స్
Published Mon, May 25 2020 1:48 AM | Last Updated on Mon, May 25 2020 4:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment