‘ఆసరా’గా నిలిచిన సాక్షి
‘జనపథం’లో 10 మంది వృద్ధులకు పింఛన్ మంజూరు
అక్కడికక్కడే పరిష్కారం చూపిన మంత్రి మహేందర్‌రెడ్డి
తాండూరు: ‘సాక్షి’ జనపథం వృద్ధులకు అండగా నిలిచింది. అర్హులై ఉండి జాబితాలో పేర్లురాక పింఛన్ కోల్పోయి దిగాలుచెందుతున్న పండుటాకులకు ‘సాక్షి’ నిర్వహించిన జనపథం ‘ఆసరా’ కల్పించింది. తాండూరు ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చొరవతో 10 మంది వృద్ధులకు పింఛను మంజూరైంది. సమగ్ర కుటుంబ సర్వేలో కొందరి వృద్ధుల డేటా లేకపోవడం, సర్వేలో వయసు తక్కువగా నమోదు కావడం, సాంకేతిక కారణాలతో కొందరు వృద్ధులు పింఛను కోసం పెట్టుకున్న అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి.
అలాంటి అర్హులకు ‘ఆసరా’ కల్పించేందుకు శుక్రవారం యాలాల మండలం రాస్నం గ్రామంలో ‘సాక్షి’ జనపథం కార్యక్రమం నిర్వహించింది. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ ముక్తిపాడు సాయన్నగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్, ఎంపీడీఓ సౌజన్య, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామారావు, సర్పంచ్ పద్మలత, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, నాయకులు సురేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనంతయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తమకు 65 ఏళ్లు నిండినా పింఛనుకు ఎంపిక చేయలేదని కొందరు వృద్ధులు, గతంలో పింఛను అందుకున్నామని, ఇప్పుడు తీసేశారని మరికొందరు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆధార్, రేషన్ కార్డులు వెంట తెచ్చుకుని చూపించారు. అక్కడే ఉన్న పింఛన్ల వెరిఫికేషన్ ఆఫీసర్ శేఖర్‌తో మాట్లాడిన మంత్రి.. పింఛన్ల రద్దుకు గల కారణాలను తెలుసుకున్నారు. కంప్యూటర్‌లో సాంకేతికలోపం వల్ల ఇలా జరిగిందని సమాధానం రావడంతో.. అప్పటికప్పుడు పది మంది వృద్ధులకు చెందిన డేటాను పరిశీలించి వారందరినీ అర్హులుగా తేల్చారు.
‘సాక్షి’ కృషి అభినందనీయం: మంత్రి మహేందర్‌రెడ్డి
మాది పేదల ప్రభుత్వమని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. నిజమైన అర్హులను గుర్తించి వారికి అన్యాయం జరగకుండా చూస్తున్న ‘సాక్షి’ కృషి అభినందనీయమన్నారు.అప్పటికప్పుడు పింఛన్లకు ఎంపికైన వృద్ధుల వివరాలు
1. వడ్ల బక్కప్ప (తండ్రి పేరు వీరప్ప) : ఎస్‌కేఎస్ డేటాలో వయస్సు తక్కువుండి ఆధార్ పరిశీలన ద్వారా ఎంపిక
2. కోటం అనసూజమ్మ (భర్త పేరు బాల్‌రెడ్డి): ఎస్‌కేఎస్ డేటాలో వయసు తక్కువ ఉండి ఆధార్ పరిశీలన ద్వారా మంజూరు
3. దోమ పుష్య మాణెమ్మ (భర్త పేరు సంగప్ప): గ్రామస్తుల ద్వారా వాకబు చేసి వితంతు పింఛను మంజూరు
4. ఎన్కెపల్లి లక్ష్మయ్య (తండ్రిపేరు అనంతి): ఎస్‌కేఎస్ డేటాలో వయసు తక్కువగా ఉండటంతో, ఓటరు ఐడీ, రేషన్ కార్డు ఆధారంగా పింఛను మంజూరు
5. గాండ్ల వీరన్న (తండ్రిపేరు గాండ్ల వీరప్ప): ఎస్‌కేఎస్ డేటాలో వయసు తక్కువుండటంతో ఓటరు ఐడీ, రేషన్ కార్డు ద్వారా పింఛను మంజూరు
6. ఆకుల లింగం (తండ్రి పేరు ఆకుల శివప్ప): ధ్రువపత్రం ఆధారంగా వయసు లేకపోయినా ఫిజికల్ అప్పిరీయన్స్ ద్వారా ఎంపిక
7. కుమ్మరి రాములు (తండ్రి పేరు పాపయ్య): ఎస్‌కేఎస్ డేటాలో వివరాలు లేకపోవడంతో వైకల్యం సర్టిఫికెట్ ఆధారంగా పింఛను మంజూరు
8. సంగెం అనంతయ్య: ఎస్‌కేఎస్ డేటాలో వివరాలు లేకపోవడంతో వైకల్యం సర్టిఫికెట్ ఆధారంగా..
9. సబిత: ఎస్‌కేఎస్ డేటాలో వివరాలు లేకపోవడంతో వైకల్యం సర్టిఫికెట్ ఆధారంగా..
10. పసుల చంద్రయ్య (తండ్రి పేరు రాజప్ప): ఎస్‌కేఎస్ డేటాలో వయసు తక్కువగా ఉండటంతో ఓటరు ఐడీ, రేషన్ కార్డు ఆధారంగా పింఛను మంజూరు.
పండుటాకులకు అండగా నిలుస్తాం
నిస్సహాయులకు చేదోడుగా నిలిచిన ‘సాక్షి’ జనపథంలో మంత్రి మహేందర్‌రెడ్డి
తాండూరు/యాలాల: పండుటాకులకు అండగా ఉంటామని మంత్రి మహేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పింఛన్ రాలేదని ఆందోళన చెందవద్దని చెప్పారు. శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో రాస్నం గ్రామంలో నిర్వహించిన జనపథంలో పాల్గొన్న మంత్రి ఎదుట పింఛను కోల్పోయిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గోడు వెళ్లబోసుకున్నారు.
వారి నుంచి వివరాలు తీసుకున్న మంత్రి జాబితాను సరిచేసి పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నారని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సాయన్న గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రామారావు, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ సౌజన్య, సర్పంచ్ పద్మలత, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి పాల్గొన్నారు.
వారికి పింఛన్‌లు ఇవ్వండి..
‘సారూ.. నా పేరు దోమ పుష్య మాణెమ్మ.. భర్త శానేండ్ల కిందనే చనిపోయిండు. కొడుకులు లేరు. ఓ కూతురు ఉంది. నాకు పింఛన్ రావడం లేదు. గతంలో నాకు వితంతు పింఛన్ డబ్బులు వచ్చేవి. లిస్టు నా పేరు లేదు’. అంటూ ఓ మహిళ మంత్రి ఎదుట ఆవేదన వెలిబుచ్చింది. దీంతో మంత్రి స్పందిస్తూ.. ఆమె పేరు లిస్టులో ఎందుకు రాలేదని దరఖాస్తుల పరిశీలన అధికారి శేఖర్‌ను ప్రశ్నించారు.
కొన్ని సాంకేతిక కారణాలతో పేరు రాలేకపోయి ఉండవచ్చని ఆయన సమాధానమిచ్చారు. దీంతో మాణెమ్మ పేరును జాబితాలో చేర్చాలని ఎంపీడీఓను మంత్రి ఆదేశించారు. ఇలా.. కోటం అనసూజమ్మ, దోమ పుష్య మాణెమ్మ, ఎన్కెపల్లి లక్ష్మయ్య, గాండ్ల వీర న్న, ఆకుల లింగం, కుమ్మరి రాములు, సబిత, పసుల చంద్రయ్య తదితరులకు పింఛన్ ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా.. పింఛన్‌లు రాక ఆందోళన చెందుతున్న వారికి భరోసా కల్పించే దిశగా ‘సాక్షి’ జనపథం సాగింది.