పశ్చిమగోదావరి, నిడమర్రు : జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్) ఖాతాదారులు తాము జమ చేసిన నగదులో కొంత మొత్తాన్ని ఇకపై మూడేళ్ల తర్వాతే తీసుకునేలా ఇటీవల నిబంధనలను సవరించారు. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) జనవరిలో ఓ నోటీసులో పేర్కొంది. ఇప్పటివరకూ చందాదారులు భవిష్యత్తు కోసం దాచుకోవడం ప్రారంభించిన సొమ్మును, ఎంత అత్యవసరమైనా సుదీర్ఘ కాలం పాటు తీసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పటివరకూ పదేళ్లు పథకంలో కొనసాగిన తర్వాత మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతించేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పథకంలో చేరిన మూడేళ్ల తర్వాత నిర్దిష్ట అవసరాల కోసం ఎన్‌పీఎస్ నుంచి సొమ్ము తీసుకునేందుకు ఇకపై అనుమతిస్తారు. గత నెల 10వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ తాజా నిబంధనలు తెలుసుకుందాం.
పాక్షిక ఉపసంహరణకు గరిష్ట మొత్తం 25 శాతం..
పాక్షిక వాపసు తీసుకునేందుకు అనుమతించే గరిష్ట మొత్తం 25 శాతం మాత్రమే. ఎన్‌పీఎస్ ఖాతాలు రెండు రకాలు టైర్ 1 ఖాతాలో జమ చేసే సొమ్మును 60 ఏళ్ల వయసు వచ్చేవరకు ఉపసంహరించుకునే వీల్లేదు. టైర్ 2 ఖాతా తెరిచిన వారికి సేవింగ్స్ ఖాతా మాదిరి ఎప్పుడైనా ఉనసంహరణకు అనుమతిస్తారు. అంటే చందాదా రుడు చెల్లించిన మొత్తానికి 25 శాతం మించిన మొత్తాన్ని మాత్రమే అనుమతిస్తారు. ప్రభుత్వ వాటాగా చెల్లించవలసిన 10 శాతం మొత్తం నుంచి పాక్షిక ఉనసంహరణకు అనుమతించరు. మొదటి తరహా ఖాతా విషయంలోనే ఉపసంహరణ నిబంధనలు ఇప్పుడు సవరించారు.
నిబంధనలు ఇలా
♦ చందాదారునికి పిల్లలు/చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి
♦ చందాదారుని పిల్లలు/చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల వివాహం కోసం
♦ చందాదారుడు సొంతంగా కాని/జీవిత భాగస్వామితో గాని కలిపి నివాసగృహం/ప్లాట్ కొనుగోలు/నిర్మాణం కోసం
(పూర్వీకుల ఆస్తి కాకుండా చందాదారుడు వ్యక్తిగతంగా కానీ ఉమ్మడిగా గాని గృహం/ప్లాట్ కలిగిఉంటే ఉపసంహరణకు అనుమతించరు)
♦ చందాదారుడు/జీవిత భాగస్వామి, పిల్లలు, దత్తత పిల్లలు, ఆధారిత తల్లిదండ్రులు పలు వ్యాధులతో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నప్పుడు వైద్య చికిత్సల కోసం
అనుమతించే వ్యాధులు
క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్రైమరీ, పల్మనరీ ఆర్టిరియల్ హైపర్ టెన్సన్, మల్టిపుల్ స్లి్కరోసిస్, మేజర్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, ఆర్టోగ్రాఫ్ సర్జరీ, హార్ట్ వాల్వ్ సర్జరీ, స్ట్రోక్, మయోకార్టియల్ ఆంఫోరష్కన్, కోమా, అంధత్వం, పక్షవాతం, యాక్సిడెంట్, ప్రాణాంతక ఇతర వ్యాధులు
ఉపసంహరణకు పరిమితులు
♦ పాక్షిక ఉపసంహరణ చందాదారుడు ఈ పరిమితులకు లోబడి అనుమతిస్తారు.
♦ చందాదారుడు జాతీయ పెన్షన్ పథకంలో చేరిన తేదీ నుంచి మూడేళ్లు పూర్తి అయి ఉండాలి.
♦ చందాదారుడు దరఖాస్తు చేసిన నాటికి చందాదారుడు చెల్లించిన మొత్తానికి 25 శాతం మించిన మొత్తాన్ని మాత్రమే అనుమతిస్తారు.
గరిష్ట కాలపరిమితి
జాతీయ పెన్షన్ పథకం కాలపరిమితి ముగిసేలోపు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పాక్షిక ఉనసంహరణకు అనుమతిస్తారు.
పాక్షిక ఉపసంహరణకు చందాదారుడు సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ(సీఆర్‌ఏ) లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌కు తగిన ధ్రువీకరణ పత్రాలతో నోడల్ అధికారి ద్వారా దరఖాస్తు చేయాలి. చందాదారుడు ఏదేని అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయవచ్చు.
పాక్షిక ఉపసంహరణ విధానం
చందాదారులు తమ పాక్షిక ఉపసంహరణ (పార్షియల్ విత్ డ్రాయల్) కోసం ఫారం 601పీడబ్లూ ఉపయోగించాలి. గత సర్క్యులర్‌లో ఉపసంహరణ దరఖాస్తు పంపుటకు వర్తించు మార్గదర్శకాలే పాక్షిక ఉపసంహరణ దరఖాస్తు పంపుటకు వర్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment