నిధి రాత మార్చుకోవచ్చిలా..! | Panel studying plan to hike minimum pension under EPF | Sakshi
Sakshi News home page

నిధి రాత మార్చుకోవచ్చిలా..!

Published Sun, Nov 17 2013 2:44 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

నిధి రాత మార్చుకోవచ్చిలా..! - Sakshi

నిధి రాత మార్చుకోవచ్చిలా..!

అంతకంతకూ పెన్షన్ భారం పెరిగిపోతూ ఉండటంతో కొంతైనా తగ్గించుకోవటానికి కేంద్రం కొన్ని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈపీఎఫ్ పెన్షన్ ఫండ్ కేటాయింపులపై పరిమితులు విధించింది. ఇక నుంచి ఈపీఎఫ్-95 స్కీంలో చేరే సభ్యులకు గరిష్ట బేసిక్ జీతాన్ని రూ.6,500కు పరిమితం చేసింది. అంటే మీ బేసిక్ జీతం ఎంత ఉన్నా దానితో సంబంధం లేకుండా కేవలం రూ.6,500 బేసిక్ జీతం ప్రకారం ఈపీఎఫ్ పెన్షన్ ఫండ్‌కి కేటాయించాలి. దీని ప్రకారం ఉద్యోగం చేసే సంస్థ 12 శాతం అంటే రూ.780 ఈపీఎఫ్‌కి జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో 8.33 శాతం అంటే రూ.541లు పెన్షన్ ఫండ్‌కి మిగిలిన మొత్తం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోకి వెళుతుంది. ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే రూ.780లు పూర్తిగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోకి వెళుతుంది.

ఇంతకంటే అధిక మొత్తం కేటాయించాలంటే ఈపీఎఫ్ సంస్థ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే రిటైర్ అయిన తర్వాత నెలకు కనీసం రూ.1,000 పెన్షక్ కూడా లభించే అవకాశం ఉండదు. దీంతో పెన్షన్ అవసరాల కోసం ఇంతకాలం అధిక మొత్తాలను కేటాయిస్తున్న వారు ఇతర పథకాల కేసి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
 ప్రస్తుతం వివిధ రకాల పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నా... వాటిలో ప్రధానమైనది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన న్యూ పెన్షన్ స్కీమే (ఎన్‌పీఎస్). వీటితో పాటు బీమా, మ్యూచువల్ ఫండ్‌లు అందించే పెన్షన్ పథకాలు ఎటూ ఉన్నాయి. వాటిని ఒక్కసారి చూస్తే...
 ఎన్‌పీఎస్
 ఉద్యోగస్తులకే కాకుండా అందరికీ పెన్షన్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో 2009లో కేంద్రం న్యూ పెన్షన్ స్కీంను (ఎన్‌పీఎస్) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త పెన్షన్ పథకంలో చేరాలనుకునే వారు సంవత్సరానికి కనీసం రూ.6,000 లేదా నెలకు రూ.500 చొప్పున జమచేయాల్సి ఉంటుంది. పీఎఫ్‌ఆర్‌డీఏ పర్యవేక్షణలో నడిచే ఈ కొత్త పెన్షన్ పథకాన్ని ప్రస్తుతం ఎస్‌బీఐ, యూటీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, రిలయన్స్, ఐడీఎఫ్‌సీ సంస్థలు నిర్వహిస్తున్నాయి. 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయసున్న వారు చేరొచ్చు. ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యం ఆధారంగా వివిధ రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.

గరిష్టంగా ఈక్విటీల్లో 50 శాతం వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ అనుమతిస్తోంది. ఈ పథకాన్ని దాదాపు అన్ని ప్రభుత్వ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఏడాదికి గరిష్టంగా లక్ష రూపాయల వరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌ను ఆరు ఫండ్ హౌస్‌లు నిర్వహిస్తుండగా, గడిచిన నాలుగేళ్లలో  వీటి సగటు రాబడి 7.6 శాతం నుంచి 8.6 శాతంగా ఉంది.
 మ్యూచువల్ ఫండ్స్
 వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా రిటైర్మెంట్ పథకాలను అందిస్తున్నాయి. కొంచెం రిస్క్ చేయగలిగేవారికి ఈ రిటైర్మెంట్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. ఇవి ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనక మిగిలిన వాటిపై కాస్త అధిక రాబడిని ఆశించవచ్చు.  కానీ ఇవి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటి రాబడిపై ఎలాంటి హామీ ఉండదు. అందుకని ఆ మేరకు రిస్క్ కూడా ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో అన్నిటికంటే ఈక్విటీలే అధిక రాబడినిస్తాయన్నది నిపుణుల సూచన. యూటీఐ, టాటా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రిటైర్మెంట్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి.
 బీమా పథకాలు...
 దాదాపు బీమా కంపెనీలన్నీ రిటైర్మెంట్ పాలసీల్ని అందిస్తున్నాయి. చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులుంటాయి. వీట్లో పరిమిత కాలానికి ఇన్వెస్ట్ చేస్తే తర్వాత మనం ఎంచుకున్న సంవత్సరం నుంచి పెన్షన్ వస్తుంది. ఈ పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్ సమయం ముగిశాక పాలసీ విలువలో కావాలంటే ఒకేసారి 20-30 శాతం వెనక్కి తీసుకోవచ్చు కూడా. మిగిలిన మొత్తాన్ని తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఒకేసారి వెనక్కి తీసుకున్న మొత్తంపై ఆదాయపు పన్ను కూడా ఉండదు.
 తక్షణం పెన్షన్ కోసం..
 కాస్త వయసు పైబడ్డవారు, రిటైర్మెంట్‌కు దగ్గరయిన వారు, తక్షణం పెన్షన్ కావాలనుకునే వారికి అలా అందించే పథకాలూ ఉన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతినెలా పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్-6 పథకాన్నే తీసుకుంటే 30 ఏళ్ళకే పెన్షన్ తీసుకోవచ్చు. ఇందులో కనిష్టంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. 30 ఏళ్ల వ్యక్తి జీవన్ అక్షయ్‌లో రూ.20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అతనికి జీవితాంతం ప్రతి నెలా దాదాపు రూ.12,000 పెన్షన్‌గా లభిస్తుంది. వీటినే ఇమీడియట్ యాన్యుటీ ప్లాన్స్ అంటారు. ఎల్‌ఐసీతో పాటు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, బజాజ్ అలియంజ్, టాటా ఏఐజీ వంటి దాదాపు అన్ని జీవిత బీమా కంపెనీలు ఇమీడియట్ యాన్యుటీ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి.
  - ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement