పీపీఎఫ్, ఎన్‌పీఎస్.. ఏది ఎంచుకోవాలి? | question with dheerendhra kumar | Sakshi
Sakshi News home page

పీపీఎఫ్, ఎన్‌పీఎస్.. ఏది ఎంచుకోవాలి?

Published Sun, Mar 9 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

పీపీఎఫ్, ఎన్‌పీఎస్.. ఏది ఎంచుకోవాలి?

పీపీఎఫ్, ఎన్‌పీఎస్.. ఏది ఎంచుకోవాలి?

 నా రిటైర్మెంట్ అవసరాల కోసం పన్ను రాయితీలనిచ్చే పథకంలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్), నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)-రెండింటిలో దేనిని ఎంచుకోమంటారు?
 - రామకృష్ణ, అనంతపురం
 
 ఈ రెండు కూడా రిటైర్మెంట్ సంబంధిత పథకాలే. ఈ రెండింటికి కూడా సెక్షన్ 80 సీ కింద పన్ను రాయితీలున్నాయి. కానీ ఇవి రెండూ విభిన్నమైన పథకాలు. పీపీఎఫ్ నుంచి గ్యారంటీడ్ రిటర్న్‌లు పొందవచ్చు. ఎన్‌పీఎస్ ఏమో మార్కెట్‌తో అనుసంధానమై ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. పీపీఎఫ్‌లో మీకు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లుండవు. ఎన్‌పీఎస్ కింద అయితే మాత్రం మీరు ఎంచుకోవడానికి వివిధ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లు ఉంటాయి. ఎన్‌పీఎస్ కింద ఫండ్ మేనేజర్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికమైన పొదుపులను సురక్షితమైన స్థిర ఆదాయం ఇచ్చేలా పీపీఎఫ్ స్కీమ్‌ను రూపొందించారు. పన్ను ప్రయోజనాల విషయంలో ఈ రెండు స్కీమ్‌లు ఒకే విధంగా ఉంటాయి. పన్ను విషయాలను పక్కనబెడితే, ఎన్‌పీఎస్ ఉత్తమమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అని, సంతృప్తికరమైన రాబడులనిస్తుందని చెప్పుకోవచ్చు.
 
 కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేశాను. ఆ స్కీమ్‌లు-క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ, ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200, రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఈక్విటీ, డీఎస్‌పీ బ్లాక్‌రాక్ టాప్ 100. ఈ ఫండ్స్ పనితీరు ఎలా ఉంది?    - మాధవి, హైదరాబాద్
 
 మీరు చాలా మంచి ఫండ్స్‌ను ఎంచుకున్నారు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం కొనసాగించండి. మీరు విభిన్నమైన ఫండ్స్‌ను ఎంచుకున్నారు. కాబట్టి ఈ ఫండ్స్ అన్నీ ఒకే రకమైన పనితీరును కనబరిచే అవకాశాల్లేవు. అంటే మీ పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉందని చెప్పవచ్చు. గత కొంత కాలంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ, మీ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైడ్‌గా ఉన్నందున మీకు ఎలాంటి నష్టాలు రాలేదు. ఈ పథకాల్లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించండి.
 
 నేను కొన్ని గిల్ట్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. కానీ వాటి పనితీరు ఆశించినంతగా లేదు. నన్ను ఏం చేయమంటారు?
 - ఓం ప్రకాశ్ అగర్వాల్, నిజామాబాద్
 
 సాధారణ ఇన్వెస్టర్లు గిల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. వడ్డీరేట్లు పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్స్ నష్టాలపాలవుతుంటాయి. వడ్డీరేట్లు తగ్గినప్పుడు మాత్రమే గిల్డ్ ఫండ్స్ లాభాలను కళ్ల జూస్తాయి. వడ్డీరేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేమని స్వయానా ఆర్‌బీఐ గవర్నర్ రాజనే పేర్కొన్నారు. అందుకని సాధారణ ఇన్వెస్టర్లు ఈ తరహా ఫండ్స్‌కు దూరంగా ఉండడమే మంచిది. 1-2 సంవత్సరాల కాలానికి మాత్రమే వీటిని పరిశీలించాలి.
 
 నేనొక సీనియర్ సిటిజన్‌ను. ఎస్‌బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌లో గతేడాది ఇన్వెస్ట్ చేశాను. అప్పటి నుంచి వడ్డీరేట్లు పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం 2 శాతం మాత్రమే రిటర్న్‌లు వస్తున్నాయి. మరోవైపు బ్యాంక్ ఎఫ్‌డీలో నేను 9.5 శాతం రాబడి పొందుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? తగిన సూచనలివ్వండి.
 - మూర్తి, రాజమండ్రి.
 
 గతేడాది తొలి క్వార్టర్లో డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లందరూ వడ్డీరేట్లు తగ్గుతాయని, తద్వారా ప్రయోజనం పొందవచ్చని  అంచనా వేశారు. ఈ కారణంగానే చాలా మంది ఇన్వెస్టర్లు స్థిరాదాయాన్నిచ్చే ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి తమ రాబడులను ఉపసంహరించి ఇలాంటి డైనమిక్ బాండ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు.  చివరకు ఫండ్ మేనేజర్లూ ఈ విషయంలో తప్పుగా అంచనా వేశారు. వడ్డీరేట్లు తగ్గటానికి బదులు పెరిగాయి. ఇక మీ విషయానికొస్తే, మీరు మరో రెండేళ్లు వేచి చూడగలిగితే వడ్డీరేట్లు తగ్గే అవకాశాలున్నాయి. అలా వేచి చూడలేకపోతే ఈ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని స్థిరాదాయాన్నిచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నిలకడైన రాబడి రావాలనుకుంటే ఇలాంటి ఫండ్స్‌కు దూరంగా ఉండండి.
 
 -ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement