dheerendhra kumar
-
పెట్టుబడులను ఎప్పుడు మార్చుకోవాలి?
మ్యూచువల్ ఫండ్స్ పథకాల మధ్య పెట్టుబడులను ఎటువంటి సందర్భాల్లో మార్చుకోవాలి? – సుఖ్‌దేవ్ భాటియా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను రెండు రకాల కారణాల వల్ల మార్చాల్సి రావచ్చు. మొదట మీ లక్ష్యాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు పెట్టుబడులను వాటికి అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లక్ష్యాలను చేరుకున్నప్పుడు కూడా ఈ అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నతవిద్య కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుంటే.. నిర్ణీత కాలవ్యవధికి ముందే మీకు కావాల్సిన మొత్తం సమకూరితే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఏదైనా ఒక పథకంలో కొన్ని కారణాలను చూసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అవన్నీ మారిపోయినట్టయితే పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఫండ్ మేనేజర్ మారిపోవడం పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి సరైన కారణం కాబోదు. గతంలో మంచి రాబడులను ఇచ్చిన పథకం కొత్త ఫండ్ మేనేజర్ నిర్వహణలో అంత మంచి పనితీరు చూపించకపోతే అప్పుడు వేరే పథకానికి మారిపోయే ఆలోచన చేయవచ్చు. అలాగే, నిలకడగా మంచి రాబడులను ఇస్తుందన్న కారణంతో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. మీరు ఆశించిన విధంగా పనితీరు లేకపోయినా దాని నుంచి తప్పుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ ఈక్విటీలు అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోవడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కలి్పంచుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకూడదు. ఇందుకోసం అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు మంచి పెట్టుబడుల అవకాశాలు అవుతాయి. తక్కువ రేట్లకే కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లలో దిద్దుబాట్లకు భయయపడి, మరింత పడిపోతాయేమోనన్న ఆందోళనతో పెట్టుబడి పెట్టకుండా ఉంటే, మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్స్ విలీనంతో ఇన్వెస్టర్లపై భారం పడుతుందా?
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లోగడ రెండు పథకాలను విలీనం చేసింది, కొత్త పథకం యూనిట్లను ఇన్వెస్టర్లకు కేటాయించింది. మూలధన లాభాల కోణంలో దీన్ని ఎలా చూడాలి? – బ్రిజ్ మోహన్‌లాల్ గత ఆర్థిక సంవత్సరంలో పలు మ్యూచువల్ ఫండ్స్ పథకాల విలీనాన్ని చూశాం. చాలా వరకు ఒక ఏఎంసీని మరో ఏఎంసీ కొనుగోలు చేయడం వల్లే ఇలా జరిగింది. ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్‌ను 2021 డిసెంబర్లో సుందరం మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. బీఎన్పీ పారిబాస్‌లో బరోడా ఏఎంసీ విలీనం అయింది. అలాగే, ఒక మ్యూచువల్ ఫండ్‌కు చెందిన పలు పథకాల విలీనాన్ని కూడా గతంలో చూశాం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలో తెలియక అయోమయం చెందుతుంటారు. 2021-22 ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేయాల్సిన వారు ఆందోళన చెందడం సహజం. మ్యూచువల్ ఫండ్స్ విలీనం వల్ల ఇన్వెస్టర్లు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. వారు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విలీనం తర్వాత కొత్త పథకంలో పెట్టుబడులు కొనసాగించాలని అనుకుంటే అవి ఆటోమేటిక్‌గా బదిలీ అవుతాయి. కనుక అటువంటి సందర్భంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఉదాహరణకు ఫండ్ ఏ, ఫండ్ బీని తీసుకుందాం. ఫండ్ ఏను తీసుకెళ్లి ఫండ్ బీలో విలీనం చేశారు. ఫండ్ ఏలో ఆరు నెలల క్రితం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, విలీనం నాటికి అది రూ.2 లక్షలు అయింది. ఫండ్ బీ ఎన్ఏవీ రూ.160గా ఉంది. అప్పుడు రూ.2 లక్షలను 160తో భాగిస్తే 1,250 యూనిట్లు వస్తాయి. ఈ యూనిట్లను మరో ఆరు నెలల తర్వాత విక్రయించారు. అప్పుడు మొత్తం హోల్డింగ్ పీరియడ్ ఏడాది అవుతుంది. ముందు పథకంలో ఆరు నెలలు, విలీనం పథకంలో ఆరు నెలలు. ఏడాదికి మించిన కాలానికి ఈక్విటీ లాభాలు దీర్ఘకాల మూలధన లాభాల కిందకు వస్తాయి. ఆ ప్రకారం పన్ను చెల్లించాలి. పిల్లల ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనువైన వేదికలు ఏవి? – వెంకట్రావ్ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా అడిగే ప్రశ్న. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్ల వరకు కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరతంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గిస్తుంది. మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
1992 స్కామ్ పరిస్థితులు మళ్లీ వస్తాయా?
నా పోర్ట్‌ఫోలియోలో ఒక బ్యాంకింగ్ ఫండ్ (ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్), ఒక ఐటీ ఫండ్ (టాటా డిజిటల్ ఇండియా ఫండ్)లు ఉన్నాయి. వీటిల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఐదేళ్ల పాటు సిప్ల ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి వీటిల్లో అనూహ్య లాభాలే వస్తున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ లాభాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయా? వీటిల్లో సిప్‌లు కొనసాగించమంటారా ? - పరశురామ్, విజయవాడ ఈ ఫండ్స్‌లో ర్యాలీ కొనసాగే వరకూ మీ సిప్‌లు కూడా కొనసాగించవచ్చు. అయితే మీరు రిస్క్ ఎక్కువగా తీసుకుంటున్నారనుకుంటున్నాను. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందడం కోసమే ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పెద్దగా లభించవు. మీరు ఇన్వెస్ట్ చేసిన రెండు సెక్టోరియల్ ఫండ్స్ ప్రస్తుతం మంచి రాబడులను ఇవ్వడం...ఒక విధంగా మీ అదృష్టమేనని చెప్పాలి. మార్కెట్లో కరెక్షన్ మొదలైతే మాత్రం ఇతర ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్స్ బాగా పతనమవుతాయి. ఈ ఫండ్స్ రాబడులను మదింపు చేస్తే, మార్కెట్ అధ్వానంగా ఉన్నప్పుడు ఈ ఫండ్స్ చెప్పుకోదగ్గ రాబడులనివ్వలేకపోయాయి. మీరు ఇప్పటికే భారీగా లాభాలను కళ్లజూస్తే, ఈ ఫండ్స్ నుంచి వైదొలగండి. భవిష్యత్తులో ప్రస్తుత లాభాలు కరిగిపోయి, నష్టాలు వచ్చినా భరించగలను అని మీరు భావిస్తే, ఈ ఫండ్స్‌ల్లో సిప్‌లను కొనసాగించండి. ఇటీవలే 1992 స్కామ్ వెబ్ సిరీస్‌ను చూశాను. 1992 నాటి పరిస్థితులే(ఫండమెంటల్స్ మెరుగుపడకపోయినా, షేర్ల వేల్యుయేషన్లు అధికంగా ఉండటం, సూచీలు గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతుండటం) నేడు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? -భవానీ, విశాఖపట్టణం 1992కు, ప్రస్తుత పరిస్థితులకు చాలా తేడా ఉంది. అప్పుడు హర్షద్ మెహతా బ్యాంక్ డబ్బులను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి షేర్ల విలువలను బాగా పెంచేశాడు. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారి పోయాయి. 1992కు ముందు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, యూటీఐ మినహా ఇతర మ్యూచువల్ ఫండ్స్...లేవు. అసలు 1992 స్కామ్ కారణంగానే సెబీని ఏర్పాటు చేశారు. అప్పటితో పోలిస్తే, ఇప్పుడు ఇన్వెస్టర్ల సంఖ్య, మ్యూచువల్ ఫండ్స్ సంఖ్య బాగా పెరిగాయి. ఈ ఫండ్స్ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు, ఫండ్స్ భారీగా డబ్బులను వెనక్కి తీసుకుంటే తప్ప స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలు లేవు. ప్రస్తుతం నియంత్రణా వ్యవస్థలు, నిఘా యంత్రాంగం పటిష్టంగా ఉన్నాయి. సబ్‌ప్రైమ్ సంక్షోభం వచ్చినప్పుడు 2008లో, కరోనా వైరస్ కల్లోలం వెలుగు చూసినప్పుడు ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ కొన్ని సెషన్లలోనే 40 శాతం మేర పతనమయ్యాయి. ఇలాంటి పతనాలు చాలా అరుదు. ఈ రెండు సందర్భాల్లో కూడా స్టాక్ మార్కెట్ త్వరగానే రికవరీ అయింది. 1992లో వచ్చిన పతనం కారణంగా చాలా ఏళ్ల పాటు స్టాక్ మార్కెట్ స్తబ్దుగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కొత్త శిఖరాలకు చేరినా, బ్యాంక్‌లు, కొన్ని తయారీ కంపెనీల షేర్లు ఇంకా అండర్ వేల్యుయేషన్లలోనే ఉన్నాయి. కొన్ని షేర్లు మాత్రమే మీరు చెప్పినట్లుగా అధిక వేల్యుయేషన్లతో ఉన్నాయి. ఫండమెంటల్స్ బలంగా ఉండి, ఇంకా పుంజుకోని షేర్లు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పీపీఎఫ్, ఎన్పీఎస్.. ఏది ఎంచుకోవాలి?
నా రిటైర్మెంట్ అవసరాల కోసం పన్ను రాయితీలనిచ్చే పథకంలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్), నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)-రెండింటిలో దేనిని ఎంచుకోమంటారు? - రామకృష్ణ, అనంతపురం ఈ రెండు కూడా రిటైర్మెంట్ సంబంధిత పథకాలే. ఈ రెండింటికి కూడా సెక్షన్ 80 సీ కింద పన్ను రాయితీలున్నాయి. కానీ ఇవి రెండూ విభిన్నమైన పథకాలు. పీపీఎఫ్ నుంచి గ్యారంటీడ్ రిటర్న్‌లు పొందవచ్చు. ఎన్పీఎస్ ఏమో మార్కెట్‌తో అనుసంధానమై ఉన్న ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. పీపీఎఫ్‌లో మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లుండవు. ఎన్పీఎస్ కింద అయితే మాత్రం మీరు ఎంచుకోవడానికి వివిధ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉంటాయి. ఎన్పీఎస్ కింద ఫండ్ మేనేజర్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికమైన పొదుపులను సురక్షితమైన స్థిర ఆదాయం ఇచ్చేలా పీపీఎఫ్ స్కీమ్‌ను రూపొందించారు. పన్ను ప్రయోజనాల విషయంలో ఈ రెండు స్కీమ్‌లు ఒకే విధంగా ఉంటాయి. పన్ను విషయాలను పక్కనబెడితే, ఎన్పీఎస్ ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని, సంతృప్తికరమైన రాబడులనిస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేశాను. ఆ స్కీమ్‌లు-క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ, ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ టాప్ 200, రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఈక్విటీ, డీఎస్పీ బ్లాక్‌రాక్ టాప్ 100. ఈ ఫండ్స్ పనితీరు ఎలా ఉంది? - మాధవి, హైదరాబాద్ మీరు చాలా మంచి ఫండ్స్‌ను ఎంచుకున్నారు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం కొనసాగించండి. మీరు విభిన్నమైన ఫండ్స్‌ను ఎంచుకున్నారు. కాబట్టి ఈ ఫండ్స్ అన్నీ ఒకే రకమైన పనితీరును కనబరిచే అవకాశాల్లేవు. అంటే మీ పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉందని చెప్పవచ్చు. గత కొంత కాలంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ, మీ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైడ్‌గా ఉన్నందున మీకు ఎలాంటి నష్టాలు రాలేదు. ఈ పథకాల్లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. నేను కొన్ని గిల్ట్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. కానీ వాటి పనితీరు ఆశించినంతగా లేదు. నన్ను ఏం చేయమంటారు? - ఓం ప్రకాశ్ అగర్వాల్, నిజామాబాద్ సాధారణ ఇన్వెస్టర్లు గిల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. వడ్డీరేట్లు పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్స్ నష్టాలపాలవుతుంటాయి. వడ్డీరేట్లు తగ్గినప్పుడు మాత్రమే గిల్డ్ ఫండ్స్ లాభాలను కళ్ల జూస్తాయి. వడ్డీరేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేమని స్వయానా ఆర్బీఐ గవర్నర్ రాజనే పేర్కొన్నారు. అందుకని సాధారణ ఇన్వెస్టర్లు ఈ తరహా ఫండ్స్‌కు దూరంగా ఉండడమే మంచిది. 1-2 సంవత్సరాల కాలానికి మాత్రమే వీటిని పరిశీలించాలి. నేనొక సీనియర్ సిటిజన్‌ను. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌లో గతేడాది ఇన్వెస్ట్ చేశాను. అప్పటి నుంచి వడ్డీరేట్లు పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం 2 శాతం మాత్రమే రిటర్న్‌లు వస్తున్నాయి. మరోవైపు బ్యాంక్ ఎఫ్డీలో నేను 9.5 శాతం రాబడి పొందుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? తగిన సూచనలివ్వండి. - మూర్తి, రాజమండ్రి. గతేడాది తొలి క్వార్టర్లో డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లందరూ వడ్డీరేట్లు తగ్గుతాయని, తద్వారా ప్రయోజనం పొందవచ్చని అంచనా వేశారు. ఈ కారణంగానే చాలా మంది ఇన్వెస్టర్లు స్థిరాదాయాన్నిచ్చే ఇన్వెస్ట్మెంట్ల నుంచి తమ రాబడులను ఉపసంహరించి ఇలాంటి డైనమిక్ బాండ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. చివరకు ఫండ్ మేనేజర్లూ ఈ విషయంలో తప్పుగా అంచనా వేశారు. వడ్డీరేట్లు తగ్గటానికి బదులు పెరిగాయి. ఇక మీ విషయానికొస్తే, మీరు మరో రెండేళ్లు వేచి చూడగలిగితే వడ్డీరేట్లు తగ్గే అవకాశాలున్నాయి. అలా వేచి చూడలేకపోతే ఈ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని స్థిరాదాయాన్నిచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నిలకడైన రాబడి రావాలనుకుంటే ఇలాంటి ఫండ్స్‌కు దూరంగా ఉండండి. -ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్