మ్యూచువల్ ఫండ్స్ పథకాల మధ్య పెట్టుబడులను ఎటువంటి సందర్భాల్లో మార్చుకోవాలి?
– సుఖ్‌దేవ్ భాటియా
మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను రెండు రకాల కారణాల వల్ల మార్చాల్సి రావచ్చు. మొదట మీ లక్ష్యాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు పెట్టుబడులను వాటికి అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లక్ష్యాలను చేరుకున్నప్పుడు కూడా ఈ అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నతవిద్య కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుంటే.. నిర్ణీత కాలవ్యవధికి ముందే మీకు కావాల్సిన మొత్తం సమకూరితే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.
ఏదైనా ఒక పథకంలో కొన్ని కారణాలను చూసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అవన్నీ మారిపోయినట్టయితే పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఫండ్ మేనేజర్ మారిపోవడం పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి సరైన కారణం కాబోదు. గతంలో మంచి రాబడులను ఇచ్చిన పథకం కొత్త ఫండ్ మేనేజర్ నిర్వహణలో అంత మంచి పనితీరు చూపించకపోతే అప్పుడు వేరే పథకానికి మారిపోయే ఆలోచన చేయవచ్చు. అలాగే, నిలకడగా మంచి రాబడులను ఇస్తుందన్న కారణంతో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. మీరు ఆశించిన విధంగా పనితీరు లేకపోయినా దాని నుంచి తప్పుకోవచ్చు.
ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా?
– శ్రవణ్
ఈక్విటీలు అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోవడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కలి్పంచుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకూడదు. ఇందుకోసం అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు.
ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు మంచి పెట్టుబడుల అవకాశాలు అవుతాయి. తక్కువ రేట్లకే కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లలో దిద్దుబాట్లకు భయయపడి, మరింత పడిపోతాయేమోనన్న ఆందోళనతో పెట్టుబడి పెట్టకుండా ఉంటే, మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది.
సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment