నా పోర్ట్‌ఫోలియోలో ఒక బ్యాంకింగ్ ఫండ్ (ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్), ఒక ఐటీ ఫండ్ (టాటా డిజిటల్ ఇండియా ఫండ్)లు ఉన్నాయి. వీటిల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఐదేళ్ల పాటు సిప్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి వీటిల్లో అనూహ్య లాభాలే వస్తున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ లాభాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయా? వీటిల్లో సిప్‌లు కొనసాగించమంటారా ? - పరశురామ్, విజయవాడ
ఈ ఫండ్స్‌లో ర్యాలీ కొనసాగే వరకూ మీ సిప్‌లు కూడా కొనసాగించవచ్చు. అయితే మీరు రిస్క్ ఎక్కువగా తీసుకుంటున్నారనుకుంటున్నాను. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందడం కోసమే ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పెద్దగా లభించవు. మీరు ఇన్వెస్ట్ చేసిన రెండు సెక్టోరియల్ ఫండ్స్ ప్రస్తుతం మంచి రాబడులను ఇవ్వడం...ఒక విధంగా మీ అదృష్టమేనని చెప్పాలి. మార్కెట్లో కరెక్షన్ మొదలైతే మాత్రం ఇతర ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్స్ బాగా పతనమవుతాయి. ఈ ఫండ్స్ రాబడులను మదింపు చేస్తే, మార్కెట్ అధ్వానంగా ఉన్నప్పుడు ఈ ఫండ్స్ చెప్పుకోదగ్గ రాబడులనివ్వలేకపోయాయి. మీరు ఇప్పటికే భారీగా లాభాలను కళ్లజూస్తే, ఈ ఫండ్స్ నుంచి వైదొలగండి. భవిష్యత్తులో ప్రస్తుత లాభాలు కరిగిపోయి, నష్టాలు వచ్చినా భరించగలను అని మీరు భావిస్తే, ఈ ఫండ్స్‌ల్లో సిప్‌లను కొనసాగించండి.
ఇటీవలే 1992 స్కామ్ వెబ్ సిరీస్‌ను చూశాను. 1992 నాటి పరిస్థితులే(ఫండమెంటల్స్ మెరుగుపడకపోయినా, షేర్ల వేల్యుయేషన్లు అధికంగా ఉండటం, సూచీలు గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతుండటం) నేడు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? -భవానీ, విశాఖపట్టణం
1992కు, ప్రస్తుత పరిస్థితులకు చాలా తేడా ఉంది. అప్పుడు హర్షద్ మెహతా బ్యాంక్ డబ్బులను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి షేర్ల విలువలను బాగా పెంచేశాడు. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారి పోయాయి. 1992కు ముందు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, యూటీఐ మినహా ఇతర మ్యూచువల్ ఫండ్స్...లేవు. అసలు 1992 స్కామ్ కారణంగానే సెబీని ఏర్పాటు చేశారు. అప్పటితో పోలిస్తే, ఇప్పుడు ఇన్వెస్టర్ల సంఖ్య, మ్యూచువల్ ఫండ్స్ సంఖ్య బాగా పెరిగాయి. ఈ ఫండ్స్ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు, ఫండ్స్ భారీగా డబ్బులను వెనక్కి తీసుకుంటే తప్ప స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలు లేవు. ప్రస్తుతం నియంత్రణా వ్యవస్థలు, నిఘా యంత్రాంగం పటిష్టంగా ఉన్నాయి. సబ్‌ప్రైమ్ సంక్షోభం వచ్చినప్పుడు 2008లో, కరోనా వైరస్ కల్లోలం వెలుగు చూసినప్పుడు ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ కొన్ని సెషన్లలోనే 40 శాతం మేర పతనమయ్యాయి. ఇలాంటి పతనాలు చాలా అరుదు. ఈ రెండు సందర్భాల్లో కూడా స్టాక్ మార్కెట్ త్వరగానే రికవరీ అయింది. 1992లో వచ్చిన పతనం కారణంగా చాలా ఏళ్ల పాటు స్టాక్ మార్కెట్ స్తబ్దుగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కొత్త శిఖరాలకు చేరినా, బ్యాంక్‌లు, కొన్ని తయారీ కంపెనీల షేర్లు ఇంకా అండర్ వేల్యుయేషన్లలోనే ఉన్నాయి. కొన్ని షేర్లు మాత్రమే మీరు చెప్పినట్లుగా అధిక వేల్యుయేషన్లతో ఉన్నాయి. ఫండమెంటల్స్ బలంగా ఉండి, ఇంకా పుంజుకోని షేర్లు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి.
ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment