దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసమే ఎవరైనా ఈక్విటీ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు. ఈక్విటీ అంటేనే రిస్క్ ఉంటుంది. స్వల్ప కాలంలో అస్థిరతలు ఉంటుంటాయి. వీటన్నింటినీ అధిగమించి మెరుగైన రాబడులు ఇవ్వాలంటే, ఎంపిక చేసుకునే మ్యూచువల్ ఫండ్ పథకం కూడా కీలకం అవుతుంది. ఎంత లేదన్నా వార్షికంగా 12 శాతానికి పైన రాబడులు ఇచ్చే పథకం వల్లే దీర్ఘకాలంలో కావాల్సినంత సంపద సమకూరుతుంది. ఈ విధంగా చూసుకుంటే దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసం ఎస్‌బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. అన్ని రకాల మార్కెట్లలోనూ బలంగా నిలబడి, దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది.
రాబడులు
అన్ని కాలాల్లోనూ ఈ పథకం పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. ఐదేళ్లు, పదేళ్ల కాలంలో బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ కంటే అధిక రాబడులతో ముందుంది. ఐదేళ్లలో వార్షిక సగటు రాబడులు 14.20 శాతం, పదేళ్లలో వార్షిక సగటు రాబడులు 17 శాతం చొప్పున ఉన్నాయి. ఇదే కాలంలో బీఎస్‌ఐ 500 టీఆర్‌ఐ రాబడులు 14.15 శాతం, 15.23 శాతం చొప్పున ఉన్నాయి. ఇక గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 17 శాతం రాబడి తెచ్చిపెట్టింది. మూడేళ్ల కాలంలో 21.78 శాతం చొప్పున రాబడినిచ్చింది. ఏడేళ్లలో వార్షిక రాబడి 14.30 శాతంగా ఉంది. 2004 అక్టోబర్ 11న ఈ పథకం ప్రారంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం 18.87 శాతం చొప్పున ఉంది.
పెట్టుబడుల విధానం
ఫోకస్డ్ ఈక్విటీ పథకాల్లో ముందు నుంచి ఉన్న పథకాల్లో ఇదీ ఒకటి. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్ వరకు నిర్వహిస్తుంటుంది. ప్రస్తుతానికి 24 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌లోనే 51 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. మిగిలిన ఈక్విటీ పథకాల మాదిరిగా కాకుండా... ఫోకస్డ్ ఈక్విటీ విభాగంలోని పథకాలు తక్కువ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. విడిగా ఒక్కో స్టాక్‌పై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కనుక, రాబడుల అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని భావించొచ్చు. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల కలయికగా పోర్ట్‌ఫోలియో ఉంది.
(ఇదీ చదవండి: పెట్టుబడులు పీపీఎఫ్ నుంచి ఈక్విటీ పథకాల్లోకి ఎలా మళ్లించుకోవాలంటే?)
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.28,990 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 97 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే 62 శాతం వరకు ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్‌లో 36 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు కలిగి ఉంది. తన పోర్ట్‌ఫోలియోలో భాగంగా విదేశీ స్టాక్స్‌కు కూడా కొంత కేటాయింపులు చేస్తుంటుంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, 40 శాతం కేటాయింపులు ఈ రంగాల్లోని కంపెనీలకే కేటాయించింది. ఆ తర్వాత సేవల రంగ కంపెనీల్లో 10 శాతం, కమ్యూనికేషన్ కంపెనీల్లో 9 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 7.70 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. హెల్త్‌కేర్ రంగ కేటాయింపులు 7 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు కేటాయింపులు 6 శాతానికిపైనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment