Long term savings
-
దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి
ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భాగంగా అందుబాటులోకి వచ్చే కొత్త అవకాశాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఇన్వెస్ట్ చేయడం సాధారణ ఇన్వెస్టర్లకు సాధ్యమయ్యేది కాదు. నిపుణులైన ఫండ్ మేనేజర్లు ఇలాంటి అవకాశాలను ముందుగానే గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందుకని ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలం పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బిజినెస్ సైకిల్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. పెట్టుబడుల విధానం ఆర్థిక వ్యవస్థలో భాగంగా వివిధ వ్యాపార సైకిల్స్‌లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. అంటే ఒక్కో కాలంలో కొన్ని రంగాల్లోని కంపెనీలకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వస్తుంటాయి. అలా లాభపడే రంగాలు, స్టాక్స్‌ను గుర్తించి ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది. దీన్నే బిజినెస్ సైకిల్ ఆధారిత పెట్టుబడుల విధానం అంటారు. ఆయా ఆర్థిక వృద్ధి దశల్లో భాగంగా ఎక్కువ లాభపడే కంపెనీలను గుర్తించడంలోనే పథకం రాబడులు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక మాంద్యం సమయంలో చాలా రంగాలు సమస్యలను ఎదుర్కొంటాయి. కానీ, అదే సమయంలో కొన్ని రంగాలకు వృద్ధి అవకాశాలు ఏర్పడతాయి. అలాంటి వాటిని ఫండ్ మేనేజర్ గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. విదేశీ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ సైతం ఈ పథకంలో భాగంగా ఉంటుంది. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 36 శాతం రాబడులను అందించింది. ఇదే కాలంలో బెంచ్ మార్క్రాబడులు 28 శాతంగానే ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో ఏటా 24 శాతం చొప్పున రాబడులను ఈ పథకం తెచ్చిపెట్టింది. 2021 జనవరి 18న ఈ పథకంలో ఏక మొత్తంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, రూ.1.93 లక్షలుగా మారేది. అంటే ఏటా 25 శాతం సీఏజీఆర్ రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. ఈ విభాగంలో ముందు నుంచీ ఉన్న పథకంగా దీనికి గుర్తింపు ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ఫండ్ మేనేజర్లు అనీష్ తవాక్లే, లలిత్ కుమార్, మనీష్ బంతియా తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10,000 సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, 2024 జనవరి 1 నాటికి రూ.5.23 లక్షలు సమకూరి ఉండేది.. ఇందులో పెట్టుబడి భాగం రూ.3.6 లక్షలు. అంటే 26.8 సీఏజీఆర్ రాబడులను అందించింది. పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో రూ.7,616 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 54 శాతం పెట్టుబడులు దేశీయ రంగాలపై దృష్టి సారించే కంపెనీల్లోనే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగం పెట్టుబడులు బ్యాంక్‌లు, ఆటోలు, నిర్మాణ రంగ కంపెనీలు, ఇంధన కంపెనీల్లోనే ఉన్నాయి. నిర్వహణ ఆస్తుల్లో 94.34 శాతం ఈక్విటీలకు కేటాయించగా, డెట్‌లో 0.85 శాతం, మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 85 శాతం మేర పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. అంటే రిస్క్ చాలా తక్కువగా భావించొచ్చు. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 12.52 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.84 శాతం చొప్పున ఉన్నాయి. -
దీర్ఘకాల పెట్టుబడులకు సులభమైన మార్గం - డోంట్ మిస్!
దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసమే ఎవరైనా ఈక్విటీ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు. ఈక్విటీ అంటేనే రిస్క్ ఉంటుంది. స్వల్ప కాలంలో అస్థిరతలు ఉంటుంటాయి. వీటన్నింటినీ అధిగమించి మెరుగైన రాబడులు ఇవ్వాలంటే, ఎంపిక చేసుకునే మ్యూచువల్ ఫండ్ పథకం కూడా కీలకం అవుతుంది. ఎంత లేదన్నా వార్షికంగా 12 శాతానికి పైన రాబడులు ఇచ్చే పథకం వల్లే దీర్ఘకాలంలో కావాల్సినంత సంపద సమకూరుతుంది. ఈ విధంగా చూసుకుంటే దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసం ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. అన్ని రకాల మార్కెట్లలోనూ బలంగా నిలబడి, దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది. రాబడులు అన్ని కాలాల్లోనూ ఈ పథకం పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. ఐదేళ్లు, పదేళ్ల కాలంలో బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే అధిక రాబడులతో ముందుంది. ఐదేళ్లలో వార్షిక సగటు రాబడులు 14.20 శాతం, పదేళ్లలో వార్షిక సగటు రాబడులు 17 శాతం చొప్పున ఉన్నాయి. ఇదే కాలంలో బీఎస్ఐ 500 టీఆర్ఐ రాబడులు 14.15 శాతం, 15.23 శాతం చొప్పున ఉన్నాయి. ఇక గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 17 శాతం రాబడి తెచ్చిపెట్టింది. మూడేళ్ల కాలంలో 21.78 శాతం చొప్పున రాబడినిచ్చింది. ఏడేళ్లలో వార్షిక రాబడి 14.30 శాతంగా ఉంది. 2004 అక్టోబర్ 11న ఈ పథకం ప్రారంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం 18.87 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం ఫోకస్డ్ ఈక్విటీ పథకాల్లో ముందు నుంచి ఉన్న పథకాల్లో ఇదీ ఒకటి. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్ వరకు నిర్వహిస్తుంటుంది. ప్రస్తుతానికి 24 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌లోనే 51 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. మిగిలిన ఈక్విటీ పథకాల మాదిరిగా కాకుండా... ఫోకస్డ్ ఈక్విటీ విభాగంలోని పథకాలు తక్కువ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. విడిగా ఒక్కో స్టాక్‌పై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కనుక, రాబడుల అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని భావించొచ్చు. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల కలయికగా పోర్ట్‌ఫోలియో ఉంది. (ఇదీ చదవండి: పెట్టుబడులు పీపీఎఫ్ నుంచి ఈక్విటీ పథకాల్లోకి ఎలా మళ్లించుకోవాలంటే?) ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.28,990 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 97 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే 62 శాతం వరకు ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్‌లో 36 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు కలిగి ఉంది. తన పోర్ట్‌ఫోలియోలో భాగంగా విదేశీ స్టాక్స్‌కు కూడా కొంత కేటాయింపులు చేస్తుంటుంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, 40 శాతం కేటాయింపులు ఈ రంగాల్లోని కంపెనీలకే కేటాయించింది. ఆ తర్వాత సేవల రంగ కంపెనీల్లో 10 శాతం, కమ్యూనికేషన్ కంపెనీల్లో 9 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 7.70 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. హెల్త్‌కేర్ రంగ కేటాయింపులు 7 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు కేటాయింపులు 6 శాతానికిపైనే ఉన్నాయి. -
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ సుఖ్ సమృద్ధి
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సుఖ్ సమృద్ధి పేరుతో దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. పన్ను రహిత గ్యారంటీ ఇన్‌కం లేదా ఏక మొత్తంలో మెచ్యూరిటీ కార్పస్ పొందవచ్చు. పాలసీ వ్యవధిలో ఏ సమయంలోనైనా ఆదాయాన్ని కూడబెట్టుకోవడానికి, సేకరించిన కార్పస్‌ను ఉపసంహరించుకోవడానికి సేవింగ్స్ వాలెట్ వీలు కల్పిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళా కస్టమర్లకు అధిక మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడంతోపాటు ఆదాయ కాలంతో సహా పాలసీ మొత్తం వ్యవధిలో లైఫ్ కవర్ కొనసాగుతుంది. చదవండి: ‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్..భారీ ఎత్తున తొలగింపు -
హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ వినియోగదారులకు తీపికబురు
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం వల్ల గత కొంత కాలంగా ఎఫ్డీలపై అందించే వడ్డీ రేట్లు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థ(ఎన్బీఎఫ్సి)లు తగ్గించిన విషయం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్లకు తీపికబురు అందించాయి. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు నేడు ప్రకటించాయి. హెచ్డీఎఫ్సీ ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇప్పటి వరకు హెచ్డీఎఫ్సీ 33 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.2 శాతం వడ్డీని అందించేంది. అలాగే, 66 నెలల ఎఫ్డీలపై అందించే వడ్డీ రేటు 6.6 శాతంగా, 99 నెలల డిపాజిట్లపై వడ్డీ రేటు 6.65 శాతంగా వడ్డీని ఉండేది. కానీ, ఇప్పుడు దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. దీంతో 33 నెలల కాలపరిమితితో కూడిన రూ.2 కోట్ల వరకు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. 66 నెలల కాలపరిమితితో రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై 6.7శాతం, 99 నెలల కాలపరిమితికి 6.8 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.25 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. (చదవండి: భారత్‌లో రైతుల ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే..!) బజాజ్ ఫైనాన్స్ ఎఫ్డీ వడ్డీ రేట్లు బజాజ్ ఫైనాన్స్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య కాలవ్యవధి గల ఎఫ్డీలకు ఇచ్చే వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు/0.30% వరకు పెంచింది. అయితే, 12-23 నెలల కాలపరిమితితో కూడిన ఎఫ్డీ వడ్డీరేట్లలో ఎటువంటి మార్పు లేదు. 24 నెలల-35 నెలల మధ్య కాలపరిమితితో రూ.5 కోట్ల వరకు డిపాజిట్ల కోసం సంవత్సరానికి 6.4% వడ్డీ రేటు చెల్లిస్తే, 36 నెలల-60 నెలల మధ్య డిపాజిట్లకు సంవత్సరానికి 6.8% వడ్డీ రేటు చెల్లించనుంది. అయితే, ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షకు ముందు ఈ రెండు సంస్థలు వడ్డీరేట్లు పెంచడం గమనార్హం. -
పన్ను ఆదా.. దీర్ఘకాలంలో మంచి రాబడులు
పన్ను ఆదా కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లోనూ ఇన్వెస్ట్ చేసే వారున్నారు. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఒకటి. రాబడులు..: టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకం స్వల్ప కాలంలో మోస్తరు పనితీరే చూపించగా, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో మాత్రం బెంచ్ మార్క్‌తో పోలిస్తే మెరుగైన రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది. గత ఏడాది కాలంలో ఈ పథకం 14.49 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 14 శాతం వార్షిక రిటర్నులు ఇచ్చింది. ఐదేళ్లలో 12.13 శాతం, పదేళ్లలో 13.28 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. కాకపోతే ఏడాది, మూడేళ్ల కాలంలో మాత్రం బెంచ్ మార్క్ ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐతో పోలిస్తే ఒక శాతం నుంచి రెండు శాతం వరకు తక్కువ రాబడులు ఉన్నాయి. కానీ, ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు 2–5 శాతం వరకు అధిక రాబడులు టాటా ఇండియా ట్యాక్స్సేవింగ్స్లోనే ఉన్నాయి. ఈ పథకానికి 20 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, 2014 చివరి వరకు ఈ పథకంలో గ్రోత్ ఆప్షన్ లేదు. రాబడుల చరిత్రను పరిశీలించే వారు ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి. పెట్టుబడుల వ్యూహాలు మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో దీర్ఘకాలం కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒకింత సురక్షితమనే చెప్పాలి. ఎందుకంటే మూడేళ్ల పాటు ఇందులో చేసే పెట్టుబడులపై లాకిన్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలకు రిడెంప్షన్ (పెట్టుబడులను ఉపసంహరించుకోవడం) ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్మెంట్ విషయంలో దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలంలో రాబడులకూ తోడ్పడుతుంది. ఈ పథకం మల్టీక్యాప్ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను వివిధ మార్కెట్ విలువ కలిగిన (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) స్టాక్స్ మధ్య మార్పులు, చేర్పులు కూడా చేస్తుంది. ఉదాహరణకు 2017లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో ఈ పథకం తన మొత్తం పెట్టుబడుల్లో 40 శాతాన్ని కేటాయించింది. కానీ, చిన్న, మధ్య స్థాయి షేర్లలో అస్థిరతల నేపథ్యంలో 2018 చివరికి మిడ్, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు తోడ్పడుతున్నాయి. పథకం పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 35 స్టాక్స్ ఉండగా, టాప్ 10 స్టాక్స్‌లోనే 58.41 శాతం మేర పెట్టుబడులను కలిగి ఉంది. బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఇంధనం, టెక్నాలజీ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే 44.5 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. -
దీర్ఘకాలిక పొదుపుతో ఆర్థికాభివృద్ధి
సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సులో సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ సాక్షి, తిరుపతి: దీర్ఘకాలికంగా పెట్టుబడులు, పొదుపు చేయడంతోనే ప్రతివ్యక్తికి పరిపూర్ణంగా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి తెలిపారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్ వెనిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో పెట్టుబడి మార్గాలు అసంఖ్యాక రీతిలో వెల్లువెత్తుతున్న తరుణంలో సరైన పెట్టుబడి అవకాశాలను ఎంచుకునే విధానాలను వివరించారు. లాభసాటి పెట్టుబడి అవకాశాలను ఎంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళితే ఆర్థిక సంపదను పెంచుకోవచ్చని తెలిపారు. ఆధునిక సమాజానికి అనుగుణంగా పెట్టుబడి రంగంలో సరికొత్త అవకాశాలు వచ్చాయన్నారు. వాటిపై ప్రతి ఇన్వెస్టర్ అవగాహన పెంచుకుంటే ఆర్థిక పరిపుష్టి సుసాధ్యమన్నారు. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకునే సౌలభ్యం ఉందన్నారు. కొంత కాలం పెట్టుబడులు ఆపేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇంటర్నెట్ అవగాహన ఉంటే నేరుగా సీడీఎస్ఎల్ వెబ్సైట్ ద్వారా ఖాతాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌకర్యం ఉందన్నారు. డీమ్యాట్ ఖాతాలో మొబైల్ నంబరు నమోదు చేసుకుంటే సీడీఎస్ఎల్ నుంచి డిబెట్ జరిగితే తక్షణం మొబైల్‌కు మెసేజ్ వచ్చే విధంగా సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాక యాప్ సదుపాయం ఉండడంతో మొబైల్లోనే ఖాతా వివరాలు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతివ్యక్తి తన సంపాదనలో తొలుత పొదుపుచేసిన తర్వాతే ఖర్చులు చేసుకునే విధానం అలవర్చుకుంటే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తించాలన్నారు. పెట్టుబడులుర, పొదుపుతో పాటు ప్రతివ్యక్తి ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమా, ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని శివప్రసాద్ వెనిశెట్టి సూచించారు.