న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం వల్ల గత కొంత కాలంగా ఎఫ్‌డీలపై అందించే వడ్డీ రేట్లు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థ(ఎన్‌బీఎఫ్‌సి)లు తగ్గించిన విషయం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్లకు తీపికబురు అందించాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు నేడు ప్రకటించాయి.
హెచ్‌డీఎఫ్‌సీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
ఇప్పటి వరకు హెచ్‌డీఎఫ్‌సీ 33 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.2 శాతం వడ్డీని అందించేంది. అలాగే, 66 నెలల ఎఫ్‌డీలపై అందించే వడ్డీ రేటు 6.6 శాతంగా, 99 నెలల డిపాజిట్లపై వడ్డీ రేటు 6.65 శాతంగా వడ్డీని ఉండేది. కానీ, ఇప్పుడు దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. దీంతో 33 నెలల కాలపరిమితితో కూడిన రూ.2 కోట్ల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. 66 నెలల కాలపరిమితితో రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై 6.7శాతం, 99 నెలల కాలపరిమితికి 6.8 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.25 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
(చదవండి: భారత్‌లో రైతుల ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే..!)
బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
బజాజ్ ఫైనాన్స్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య కాలవ్యవధి గల ఎఫ్‌డీలకు ఇచ్చే వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు/0.30% వరకు పెంచింది. అయితే, 12-23 నెలల కాలపరిమితితో కూడిన ఎఫ్‌డీ వడ్డీరేట్లలో ఎటువంటి మార్పు లేదు. 24 నెలల-35 నెలల మధ్య కాలపరిమితితో రూ.5 కోట్ల వరకు డిపాజిట్ల కోసం సంవత్సరానికి 6.4% వడ్డీ రేటు చెల్లిస్తే, 36 నెలల-60 నెలల మధ్య డిపాజిట్లకు సంవత్సరానికి 6.8% వడ్డీ రేటు చెల్లించనుంది. అయితే, ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షకు ముందు ఈ రెండు సంస్థలు వడ్డీరేట్లు పెంచడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment