దీర్ఘకాలిక పొదుపుతో ఆర్థికాభివృద్ధి
సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సులో సీడీఎస్‌ఎల్ రీజనల్ మేనేజర్
సాక్షి, తిరుపతి: దీర్ఘకాలికంగా పెట్టుబడులు, పొదుపు చేయడంతోనే ప్రతివ్యక్తికి పరిపూర్ణంగా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్(సీడీఎస్‌ఎల్) రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి తెలిపారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్ వెనిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో పెట్టుబడి మార్గాలు అసంఖ్యాక రీతిలో వెల్లువెత్తుతున్న తరుణంలో సరైన పెట్టుబడి అవకాశాలను ఎంచుకునే విధానాలను వివరించారు.
లాభసాటి పెట్టుబడి అవకాశాలను ఎంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళితే ఆర్థిక సంపదను పెంచుకోవచ్చని తెలిపారు. ఆధునిక సమాజానికి అనుగుణంగా పెట్టుబడి రంగంలో సరికొత్త అవకాశాలు వచ్చాయన్నారు. వాటిపై ప్రతి ఇన్వెస్టర్ అవగాహన పెంచుకుంటే ఆర్థిక పరిపుష్టి సుసాధ్యమన్నారు. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకునే సౌలభ్యం ఉందన్నారు. కొంత కాలం పెట్టుబడులు ఆపేసే అవకాశం కూడా ఉందని చెప్పారు.
ఇంటర్నెట్ అవగాహన ఉంటే నేరుగా సీడీఎస్‌ఎల్ వెబ్‌సైట్ ద్వారా ఖాతాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌకర్యం ఉందన్నారు. డీమ్యాట్ ఖాతాలో మొబైల్ నంబరు నమోదు చేసుకుంటే సీడీఎస్‌ఎల్ నుంచి డిబెట్ జరిగితే తక్షణం మొబైల్‌కు మెసేజ్ వచ్చే విధంగా సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాక యాప్ సదుపాయం ఉండడంతో మొబైల్లోనే ఖాతా వివరాలు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.
ప్రతివ్యక్తి తన సంపాదనలో తొలుత పొదుపుచేసిన తర్వాతే ఖర్చులు చేసుకునే విధానం అలవర్చుకుంటే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తించాలన్నారు. పెట్టుబడులుర, పొదుపుతో పాటు ప్రతివ్యక్తి ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమా, ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని శివప్రసాద్ వెనిశెట్టి సూచించారు.